బిల్లులు రావు.. పనులు సాగవు!

ABN , First Publish Date - 2022-10-17T06:21:47+05:30 IST

బిల్లులు రావు.. పనులు సాగవు!

బిల్లులు రావు.. పనులు సాగవు!

 బాపులపాడు మండలంలో నత్తనడకన ఆర్బీకేల నిర్మాణం

  22 కేంద్రాలకు.. మూడే పూర్తి

 అధికారులు ఒత్తిడి చేస్తున్నా.. పనులు చేయలేమంటున్న కాంట్రాక్టర్లు

  పట్టించుకోని ప్రజాప్రతినిధులు


హనుమాన్‌జంక్షన్‌, అక్టోబరు 16 : సచివాలయ వ్యవస్థ ఏర్పడిన నేపథ్యంలో అన్ని సచివాలయ కేంద్రా ల్లో రైతు భరోసా కేంద్రాలు రైతులకు అందు బాటులో ఉండాలనే  ఉద్దేశంతో చేపట్టిన రైతు భరోసా కేంద్రాల సొంత భవన నిర్మాణాలు బాపులపాడు మండలంలో నత్తనడకగా సాగుతున్నాయి. 2020లో ఈ భవనాలను మంజూరు చేసిన  2021 చివరిలోనే భూమి పూజలు జరపడం గమనార్హం. మండలానికి 22 ఆర్బీకే సెంట ర్లు మంజూరు చేయగా ఇప్పటికి మూడు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మిగిలిన 19 కేంద్రాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రానికి రూ.20.8లక్షలు మంజూరు చేసింది. త్వరితగతిన ఆర్బీకే కేంద్రాలు పూర్తి చేసి రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులుపై ఒక పక్క ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నా.. పనులు మాత్రం ముందుకు కదలని పరిస్థితి మండలంలో ఉంది. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు రాక ఇబ్బంది పడుతుండంతో ఈ పరిస్థితి నెలకొందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులకు దాదాపు రూ.20 లక్షలు  బిల్లులు రావాల్సి ఉన్నట్లు సమాచారం. గత మూడు నెలలుగా బిల్లులు రాని పరిస్థితి ఉంది.. ఈ నేపథ్యంలో  మడిచర్ల, ఓగిరాల, శేరీనరసన్నపాలెం గ్రామాల్లో మాత్రమే భవన నిర్మాణాలు పూర్తి చేశారు. మల్లవల్లి, కోడూరుపాడు, ఏ.సీతారాంపురం, తిప్పనగుంట, బాపులపాడు-1, ఆరుగొలను,పెరికీడు ఆర్బీకే సెంటర్లు ఇంకా గ్రౌండ్‌ లెవల్‌లోనే ఉన్నాయి. బాపులపాడు -2. కొత్తపల్లి, వీరవల్లి, కానుమోలు, వేలేరు, రేమల్లె కేంద్రా లు పునాదుల్లోనే  ఉన్నాయి. రంగన్నగూడెం, బండారు గూడెం. కాకులపాడు, బాపులపాడు-3, బొమ్ములూరు కేంద్రాలు రూఫ్‌ లెవల్‌కు చేరుకున్నాయి. బిల్లులు రాని కారణంగానే పనులు చురుగ్గా సాగడం లేదన్న విమర్శ లు  సర్వత్రా ఉన్నాయి. గ్రామాల్లో ఆర్భాటంగా సచి వాలయ భవనాలు, వెల్‌నెస్‌ సెంటర్లు, ఆర్బీకే కేంద్రాల భవన నిర్మాణాలు చేపట్టిన పనులు మాత్రం సాగని పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే కొన్ని గ్రామాల్లో ఆర్బీకే సెంటర్లకు స్థల సమస్య ఎదురుకావడంతో ఊరికి దూరంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో కేంద్రాలు నిర్మాణం చేపట్టారు. బాపులపాడులో ఊరికి దూరంగా నిర్మిస్తున్న కేంద్రంపై రైతులు పెదవి విరుస్తున్నారు. భవన నిర్మాణాలపై అధికారులు కాంట్రాక్టర్ల మీద ఒత్తిడి తెస్తున్న ముందుకు కదలని పరిస్థితి. 

Updated Date - 2022-10-17T06:21:47+05:30 IST