భవానీ భక్తులకు అందని వైద్యం!

ABN , First Publish Date - 2022-12-16T01:04:16+05:30 IST

ఇంద్రకీలాదిపై గురువారం భవానీ భక్తులు పోటెత్తారు. తొలిరోజునే లక్షల్లో భవానీలు దీక్షవిమరణకు తరలివచ్చారు. భక్తులకు కొండపైన ఏర్పాట్లలో అధికారుల డొల్లతనం తొలిరోజునే వెలుగుచూడటం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. వందల కిలోమీటర్ల నుంచి వచ్చే భవానీలకు వైద్య సదుపాయం అందించేందుకు ఏర్పాటు చేసిన శిబిరాల్లో వైద్య సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. మందుల కొరత, అరకొర ఏర్పాట్లతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

భవానీ భక్తులకు అందని వైద్యం!
వైద్య శిబిరంలో కుర్చీలు లేక కింద కూర్చున్న పారామెడికల్‌ సిబ్బంది

(విజయవాడ ఆంధ్రజ్యోతి) : శివాలయం మెడికల్‌క్యాం్‌పలో రెండో షిఫ్టులో సూమారు 400 ఓపీ దాటింది. ఉదయం మందులు తక్కువగా రావడంతో మధ్యాహ్ననికే అవికాస్త అయిపోయాయి. హెల్త్‌ ఆఫీసర్‌కు ఫొన్‌ చేస్తే పంపించామంటున్నారేతప్ప మందులు రావడంలేదని చెబుతున్నారు. వోఎంఈ టర్నింగ్‌ పాయింట్‌ వద్ద విద్యుత్‌ సౌకర్యం లేక అత్యవసర చికిత్స కోసం వచ్చే భక్తులకు ఆక్సిజన్‌ అందించడం కష్టమవుతోంది. భవానీ దీక్షల విరమణకు తొలిరోజు తెలుగు రాష్ర్టాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. కాలినడకన అమ్మవారి దర్శినానికి వచ్చే భక్తులకు వైద్యం అందించడంలో జిల్లా ఆరోగ్యశాఖ విఫలమైంది. మొత్తం 21 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు అధికారికంగా ప్రకటించినా.. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా పారామెడికల్‌ సిబ్బందిని 252 మందిని మూడు షిఫ్టుల్లో నియమించింది. ఒక్కో సెంటర్లో నలుగురిని నియమించారు. ఉదయం 7-2, మధ్యాహ్నం 2-8, రాత్రి 8-7 గంటలకు షిఫ్టులు వేశారు. ఉదయం నుంచే ఒక్కొ సెంటర్లో సూమారు 200 ఓపీ ఉంటుందని, వీరికి సరిపడ మందులు లేకపోవడంతో మరో సెంటర్‌కు వెళ్లాలని సిబ్బంది సూచిస్తున్నారు. కొన్ని సెంటర్లకు ఆక్సిజన్‌ మిషన్లు అందించినా విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో సిబ్బంది నానాయాతన పడుతున్నారు.

వసతుల్లేక వైద్య సిబ్బంది పాట్లు!

జిల్లావ్యాప్తంగా వచ్చిన 252 మంది పారామెడికల్‌ సిబ్బందికి సెంటర్లో కనీస వసతులు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంటర్లో టెబుల్స్‌, కుర్చీలు, కొన్ని సెంటర్లకు ఆరు బెడ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా అందుబాటులోకి రాలేదని చెబుతున్నారు. బెంచీలు, కుర్చీలు లేకపోవడంతో మందులన్నీ బ్యాక్సుల్లోనే ఉండిపోయాయి. సిబ్బంది కింద కూర్చొని భక్తులకు వైద్య సహాయమందిస్తున్నారు.

Updated Date - 2022-12-16T01:04:18+05:30 IST