పార్కుకెళ్తే పరార్‌..

ABN , First Publish Date - 2022-07-01T06:34:31+05:30 IST

పార్కుకెళ్తే పరార్‌..

పార్కుకెళ్తే పరార్‌..

దారుణంగా హరిత బెర్మ్‌ పార్క్‌

నిర్వహణాలోపం.. ప్రభుత్వ నిధుల శాపం

అస్తవ్యస్త పారిశుధ్యంతో పర్యాటకులకు పరీక్ష


విజయవాడ, ఆంధ్రజ్యోతి  : చక్కటి సాయం సంధ్యవేళలో, పచ్చటి అందాల సోయగాల్లో, ముచ్చటైన కృష్ణానది తిన్నెల్లో తీరిగ్గా కూర్చుని ప్రకృతిని ఆస్వాదించాలని భవానీపురంలోని బెర్మ్‌పార్క్‌ వెళ్లారంటే ఇక అంతే సంగతులు. ముఖద్వారం నుంచే సమస్యలు మీకు స్వాగతం పలుకుతాయి. పొరపాటున పచ్చటి లాన్‌వైపు చూశారా... అపరిశుభ్రత మీకు అసహ్యం కలిగిస్తుంది. పోనీ, అలా ఘాట్‌ మెట్లపై సేద తీరాలని చూశారా.. భరించలేనంత దుర్గంధం, పేరుకుపోయిన గుర్రపు డెక్క మీ ముక్కుపుటాలను తాకుతూ పోపో..మంటాయి. పోనీ, అటుగా నడుద్దామని ఓ అడుగు ముందుకేశారా.. తిని పడేసిన ఆహార పదార్థాలు, ఆ పక్కనే పీక్కుతింటున్న కుక్కలు మీ సహనానికి పరీక్ష పెడతాయి. ముక్కు మూసుకుంటూనే మరో అడుగు ముందుకేసేలోపు మందు సీసాలు మీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఇదెక్కడి దరిద్రం రా బాబూ.. అనుకుంటూనే ఓ అడుగు వెనక్కి వేయగానే, చిందరవందరగా చెల్లాచెదురైన చెత్త.. కుప్పలుకుప్పలుగా కనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకులే.. ఆ పక్కన చెట్ల నీడన కాసేపు సేదతీరాలనుకుంటే మాత్రం చిక్కుల్లో పడిపోతారు. ఎండిపోయిన చెట్లు, ఆకులు రాలి అలాగే వదిలేసిన లాన్‌, పక్షుల వ్యర్థాలతో ‘ఛీ..’ అనిపించే బల్లలు మిమ్మల్ని భయపెడతాయి. ఇంత గందరగోళం మధ్య అసలిక్కడికి ఎందుకొచ్చాం రా.. దేవుడా.. అనుకుంటూ తిరుగుముఖం పట్టేలోపే దారి వెంట పూడుకుపోయిన డ్రెయినేజీ దుర్గంధం మిమ్మల్ని దూరంగా తరిమేస్తుంది. ఒకప్పుడు అందాలకు నెలవై, ఆకర్షణీయమై, అందరి మనసుకు దగ్గరైన భవానీపురంలోని బెర్మ్‌పార్క్‌ నేటి దుస్థితి ఇది. గత మే నెలలో ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయిలో రూ.48 లక్షలు, బోటింగ్‌ ద్వారా మరో రూ.42 లక్షల ఆదాయం తెచ్చిపెట్టిన పార్కును పరిరక్షించే పద్ధతి ఇదేనా.. అని సందర్శకులు మండిపడుతున్నారు. 

Updated Date - 2022-07-01T06:34:31+05:30 IST