చారిత్రక నగరాల జాబితాలో బందరు

ABN , First Publish Date - 2022-05-18T06:25:12+05:30 IST

చారిత్రక నగరాల అభివృద్ధికి నీతి ఆయోగ్‌ నడుం బిగించింది.

చారిత్రక నగరాల జాబితాలో బందరు

నగరాభివృద్ధికి నీతి ఆయోగ్‌ ప్రణాళికలు

  నేడు ఢిల్లీలో వర్క్‌షాప్‌

  డీపీఆర్‌పై కమిషనర్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌

మచిలీపట్నం టౌన్‌, మే 17 : చారిత్రక నగరాల అభివృద్ధికి నీతి ఆయోగ్‌ నడుం బిగించింది. దేశంలోని 12 నగరపాలక సంస్థల అభివృద్ధికి ప్రణాళికల రూపకల్పనలో భాగంగా దేశ రాజఽధాని న్యూఢిల్లీలో బుధవారం నీతి ఆయోగ్‌ వర్క్‌షాపు నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మచిలీపట్నం, విజయవాడ నగరాలు నీతి ఆయోగ్‌ వర్క్‌షాపునకు ఎంపికయ్యాయి. నీతి ఆయోగ్‌ రూపొందించిన ప్రణాళికలకు అనుగుణంగా ఈ 12 నగరాల అభివృద్ధికి ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులను సమకూర్చనుంది. మచిలీపట్నం మేయర్‌ మోకా వెంకటేశ్వరమ్మ, కమిషనర్‌ చంద్రయ్య, మూడో డివిజన్‌ కార్పొరేటర్‌ శీలం భారతి ఇప్పటికే దేశ రాజధాని న్యూఢిల్లీలోని హోటల్‌ ఐటీసీ మౌర్యకు చేరుకున్నారు. నీతి ఆయోగ్‌ సూచనల మేరకు బందరు నగరాభివృద్ధి డీపీఆర్‌ను మునిసిపల్‌ కమిషనర్‌ రూపొందించారు. ఈ డీపీఆర్‌ను వర్క్‌షాపులో నగర మేయర్‌, కమిషనర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ చేయనున్నారు. 

 యువతకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు 

బందరు నగరంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు రూపొందించాం. బందరు పోర్టు నిర్మాణం నేపథ్యంలో పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలు ఉన్నందున దీనిని దృష్టిలో ఉంచుకుని ఒక డిటైల్డ్‌ ప్రాజెక్టును తయారు చేశాం. బందరు పోర్టు నిర్మాణం జరిగితే 2051 నాటికి ఉపాధి అవకాశాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో ప్రణాళిక రూపొందించాం. మచిలీపట్నం నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ప్రజలు అభివృద్ధి చెందే విధంగా పథకాలు రూపొందించాం.                                                                    - చంద్రయ్య, నగర కమిషనర్‌ 

  రూ.600 కోట్ల నిధులు 

బందరు నగర అభివృద్ధికి నీతి ఆయోగ్‌ ద్వారా నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రైజ్‌ వాటర్‌ కూపర్‌ సహకారంతో నగరానికి రూ.600 కోట్ల నిధులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. నీతి ఆయోగ్‌ స్పెషల్‌ సెక్రటరీ  కె.రాజేశ్వరరావుతో చర్చించాం. బందరు ఫిషింగ్‌ హార్బర్‌,  మెడికల్‌ కళాశాల, బందరు పోర్టు నిర్మాణాలతో పాటు బందరు నడిబొడ్డులో రూ.50 కోట్లతో డాక్టర్‌ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక మందిరం, నాలెడ్జ్‌ పార్కును అభివృద్ధి చేస్తాం. బందరు కోనేరు సెంటర్‌ను స్వదేశ్‌ దర్శన్‌ పథకం కింద రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తాం.                                         - వల్లభనేని బాలశౌరి, ఎంపీRead more