‘అన్న’దాతలై..

ABN , First Publish Date - 2022-10-07T06:27:22+05:30 IST

‘అన్న’దాతలై..

‘అన్న’దాతలై..
సెంట్రలైజ్‌డ్‌ కిచెన్‌లో సిద్ధమవుతున్న వంటలు

నగరంలో 3 మొబైల్‌ అన్న క్యాంటీన్లు 

సెంట్రలైజ్‌డ్‌ కిచెన్‌ ద్వారా భోజనం తయారీ

రూ.కోటితో సిద్ధం చేసిన కేశినేని చిన్ని

త్వరలో మరికొన్ని..


అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపగలరా? అధికార బలంతో అడ్డంకులు సృష్టించి పేదల ఆకలిని అణచివేయగలరా? అవాంతరాలెన్నైనా, దుష్ట పన్నాగాలు ఎన్ని పన్నినా వెనకడుగు వేసేదేలేదని ముందుకెళ్తున్నారు టీడీపీ నాయకులు. పేదల ఆకలి తీర్చే మహత్కార్యానికి ముందడుగు వేస్తున్నారు. టీడీపీ నేత కేశినేని చిన్ని ఆధ్వర్యంలో రూ.5కే అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను మొబైల్‌ వాహనాల ద్వారా నగరంలో తిప్పే ఆలోచనలు శరవేగంగా జరుగుతున్నాయి. 

(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : పేదల ఆకలి తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018, జూలైలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. రూ.15కే అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం లభించేలా ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 20 క్యాంటీన్లను ఏర్పాటు చేయగా, విజయవాడ నగరంలోనే 11 నెలకొల్పారు. వైసీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను మూసేసింది. అయితే, వాటన్నింటినీ పునరుద్ధరించాల్సిందిగా మూడేళ్లుగా టీడీపీ నాయకులు పోరాడుతూనే ఉన్నారు. అయినా వైసీపీ దిగిరాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. అయితే, టీడీపీ నాయకులు ఏర్పాటుచేసే అన్న క్యాంటీన్లకు వైసీపీ నాయకులు అధికారబలంతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్యల సాకుతో అడ్డు పడుతున్నారు. దీంతో కొన్నిచోట్ల టీడీపీ నాయకులు న్యాయస్థానాలను ఆశ్రయించి అనుమతి తెచ్చి మరీ అన్న క్యాంటీన్లను నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నందిగామలో న్యాయస్థానం అనుమతితోనే అన్న క్యాంటీన్‌ నిర్వహిస్తున్నారు. అలాగే, జగ్గయ్యపేటలో కూడా అడ్డంకులను అధిగమించి మరీ క్యాంటీన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కేశినేని చిన్ని మొబైల్‌ అన్న క్యాంటీన్ల నిర్వహణకు సిద్ధమయ్యారు. ఈ తరహా మొబైల్‌ క్యాంటీన్లను తిరుపతితో పాటు మరి కొన్నిచోట్ల టీడీపీ నాయకులు నిర్వహిస్తున్నారు. ఆ స్ఫూర్తితో జిల్లాలో వీటిని నిర్వహించాలని నిర్ణయించారు. 

తొలి విడతలో మూడు మొబైల్‌ క్యాంటీన్లు

ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో మొబైల్‌ అన్న క్యాంటీన్‌ నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి విడతలో 3 మొబైల్‌ క్యాంటీన్లను సిద్ధం చేశారు. ఈ క్యాంటీన్ల కోసం విజయవాడలోని గురునానక్‌ కాలనీలో సుమారు రూ.40 లక్షలతో సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ఏర్పాటు చేశారు. పరిశుభ్రమైన వాతావరణంలో వండిన ఆహారాన్ని మొబైల్‌ క్యాంటీన్ల ద్వారా ప్రజలకు అందిస్తారు. ఆహార పదార్థాలు సుమారు 2 గంటల పాటు వేడిగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. తొలి విడతలో సిద్ధమైన మొబైల్‌ క్యాంటీన్లు విజయవాడ నగర పరిధిలోని తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాల్లో పేదల ఆకలిని తీరుస్తాయి. వీటిని ప్రభుత్వ ఆసుపత్రి, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్‌, గుణదల, ఆర్టీసీ బస్టాండ్‌, కృష్ణలంక, ఆటోనగర్‌, మామిడిపాకలు, చిట్టినగర్‌, వస్త్రలత, ఐరన్‌ మార్కెట్‌, రైల్వేస్టేషన్‌, పెజ్జోనిపేట, స్వాతి సెంటర్‌ ప్రాంతాల్లో నడుపుతూ పేదల ఆకలి తీరుస్తారు. ఒక్కో మొబైల్‌ క్యాంటీన్‌ను సిద్ధం చేసేందుకు సుమారు రూ.20 లక్షల వరకు ఖర్చు చేశారు. మొత్తం రూ.కోటి వ్యయంతో తొలి విడతలో మూడు మొబైల్‌ క్యాంటీన్లు సిద్ధమవ్వగా, మలి విడతలో మరో రూ.60 లక్షలతో నాలుగు మొబైల్‌ క్యాంటీన్లు సిద్ధం చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. 

Read more