అమరావతి ప్రజా ఉద్యమం

ABN , First Publish Date - 2022-09-19T06:15:34+05:30 IST

అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర వారి స్వప్రయోజనం కోసం కాదని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమేనని, రైతులు నిర్వహించే పాదయాత్రకు అఖండ స్వాగతం పలుకుదామని వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలుపునిచ్చారు.

అమరావతి ప్రజా ఉద్యమం

- రాజధాని ప్రాంత రైతులను ఎడ్ల బండ్లపై ఊరేగించాలి

- అఖిల పక్ష సమావేశంలో వివిధ పార్టీల నాయకులు 

మచిలీపట్నం టౌన్‌, సెప్టెబరు 18 : అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర వారి స్వప్రయోజనం కోసం కాదని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమేనని, రైతులు నిర్వహించే పాదయాత్రకు అఖండ స్వాగతం పలుకుదామని వివిధ రాజకీయ పార్టీల నాయకులు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం ఈశ్వర్‌ రెసిడెన్సీలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. సీపీఐ జిల్లా నాయకుడు మోదుమూడి రామారావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడారు. రాజధాని కోసం త్యాగాలు చేసిన రైతుల యాత్రలకు అన్ని ప్రాంతాల్లో మద్దతు ఇస్తున్నారన్నారు. అదే రీతిలో కృష్ణాజిల్లాలో పెనుమూడి వంతెన వద్ద అమరావతి రైతులు ప్రవేశిస్తారని, అక్కడ నుంచి కృష్ణాజిల్లా వాసులందరూ పార్టీలకతీతంగా స్వాగతం పలకాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని శంకుస్థాపనకు మట్టి, గంగాజలాలు తీసుకువచ్చిన సంగతి మరచిపోలేమన్నారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించడం కోసమే మూడు రాజధానుల మాట సీఎం జగన్‌ తీసుకువచ్చారన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, అమరావతి ఉద్యమకారులకు 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు భోగిరెడ్డిపల్లిలో స్వాగతం పలుకుతామన్నారు. నాలుగు గంటలకు నెలకుర్రు, 6 నుంచి 8 గంటల వరకు చిన్నాపురంలో యాత్ర సాగుతుందన్నారు. చిన్నాపురంలో రైతులు భోజనం, బస చేస్తారన్నారు. 22న ఉదయం 8 గంటలకు చిన్నాపురం నుంచి గుండుపాలెం, రుద్రవరం, శారదానగర్‌, కాలేఖాన్‌పేట, చింతచెట్టు సెంటర్‌, రాజుపేట మీదుగా షాదీఖానాకు వస్తారన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు షాదీఖానా వద్ద భోజన విరామం తీసుకుంటారని, 3 గంటలకు రాజుపేటలో మొదలై కోనేరుసెంటర్‌, బస్టాండ్‌ సెంటర్‌, జిల్లా పరిషత్‌ సెంటర్‌ల మీదుగా హర్ష కళాశాలకు చేరుకుంటుందని, అక్కడ యాత్రికులు బస చేస్తారన్నారు. సభాధ్యక్షుడు, సీపీఐ నాయకుడు మోదుమూడి రామారావు మాట్లాడుతూ, అమరావతి రాజధానికి సీపీఐ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ, స్వప్రయోజనాల కోసమే వైసీపీ నాయకులు మూడు రాజధానుల ప్రక్రియను తెరపైకి తీసుకుని వచ్చారన్నారు. టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి రైతులందరూ స్వాగతించాలన్నారు. మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, చిన్నాపురంలో అమరావతి రైతులను ఎడ్లబండిపై ఊరేగిస్తామన్నారు. అమరావతి రైతుల త్యాగాలను మరువలేమన్నారు. మచిలీపట్నం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పుప్పాల ప్రసాద్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదన్నారు. బీసీ సంఘ నాయకుడు కె.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ, అమరావతిలో భూములిచ్చిన రైతులు అగ్రకులాలకు చెందిన వారని వైసీపీ నాయకులు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. ఎస్సీ, బీసీ రైతులు పలువురు భూములిచ్చిన సంగతిని మరచిపోలేమన్నారు. 

నష్టపోయేది రాష్ట్ర ప్రజలే.. : అమరావతి రైతుల ఆవేదన

అమరావతి రైతులు నష్టపోతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని, ఎక్కువగా నష్టపోయేది రాష్ట్ర ప్రజలే అని అమరావతి రైతులు అన్నారు. రైతు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ, రెండవ పర్యాయం చేసే ఈ పాదయాత్రకు ఊహించని విధంగా స్పందన లభిస్తోందన్నారు. రైతు జి. స్వరాజ్యరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును గౌరవించాలన్నారు. రైతు గద్దే బుజ్జి తిరుమలరావు మాట్లాడుతూ, సౌతాఫ్రికా ప్రజలు ఇచ్చిన సలహా అంటూ మూడు రాజధానులను అమలు చేస్తామనడం అవివేకమన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌, కాంగ్రెస్‌ నాయకుడు ఫణిభూషణ్‌, బీజేపీ నాయకులు హరి, వి. వెంకటరమణ, మహిళా సమైక్య నాయకురాలు వడుగు రత్నకుమారి, ఏఐటీయూసీ నాయకుడు లింగం ఫిలిప్‌, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు డి.సంగీతరావు, ఇంజనీర్ల సంఘ నాయకుడు మురళీకృష్ణ, వర్తక వాణిజ్య సంఘాల నాయకులు ఫిరోజ్‌, బీసీ నాయకుడు షేక్‌ మౌలాలి, జనసేన నాయకుడు గడ్డం రాజు, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్‌, సీనియర్‌ టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్‌, వాలిశెట్టి తిరుమలరావు, లంకే శేషగిరి, ఫణికుమార్‌, బత్తిన దాసు తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-19T06:15:34+05:30 IST