రాజధానికి రండి..!
ABN , First Publish Date - 2022-11-15T01:14:32+05:30 IST
‘మేమేమైనా దొంగలమా? విచారణకు రావటానికి.. మీరు తెచ్చిన సమస్యపై అభ్యంతరాలను తెలియజేశాం. వాటిపై మాట్లాడాల్సిన మీరు విచారణకు రమ్మనమని నోటీసులు ఇస్తారా? మా అభ్యంతరాలపై ఏమైనా మాట్లాడాలనుకుంటే.. మీరే మా గ్రామాలకు రండి. మా పెద్దలందరితో కలిసి మాట్లాడండి. ఈ అంశంపై అవగాహన ఉన్న అధికారుల కమిటీని ఏర్పాటు చేయండి. నిర్ణయాధికారం కలిగినవారే రావాలి’ అంటూ అమరావతి రాజధాని రైతులు సీఆర్‌డీఏ ఉన్నతాధికారులకు తేల్చిచెప్పారు.
మాటిమాటికీ రావడానికి మేమేమైనా దొంగలమా..
ఆర్5 జోన్‌పై మా వ్యతిరేకత తెలియజేశాం..
అందుకోసం విచారణ ఎందుకు..?
రాజధానిలో చర్చపెట్టి మా అభ్యంతరాలను వినండి
విజయవాడ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : రాజధానిలో స్థానికేతర పేదల ఇళ్ల స్థలాల కోసం నిర్దేశించిన ఆర్5 జోన్‌పై అభ్యంతరాలు తెలిపిన రైతులు విచారణకు హాజరు కావాలని సీఆర్‌డీఏ అధికారులు అందజేసిన నోటీసులపై అమరావతి రైతులు మండిపడ్డారు. సోమవారం పెద్దసంఖ్యలో రైతులు నగరంలోని సీఆర్‌డీఏ కార్యాలయానికి వచ్చారు. అభ్యంతరాలను తెలిపిన రైతులను విచారణ పేరుతో పిలవటం బాధాకరమన్నారు. నోటీసులు ఇవ్వటం అగౌరవ పరచటమేనన్నారు. విచారణ పేరుతో దశలవారీగా విజయవాడ పిలిపించటం సబబు కాదని, నిర్ణయాధికారం కలిగినవారు అమరావతికి వచ్చి మాట్లాడాలని చెప్పారు. ‘ఆర్5 జోన్‌పై ఇప్పటికే అమరావతి నుంచి వేలసంఖ్యలో అభ్యంతరాలు ఇచ్చాం. ఈ నేపథ్యంలో మమ్మల్ని విజయవాడ రప్పించటం కంటే రాజధానికి మీరే వచ్చి మాట్లాడితే బాగుంటుంది..’ అని సీఆర్‌డీఏ అధికారులకు సూచించారు. ఈ మేరకు సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ అలీం బాషాకు వినతిపత్రం ఇచ్చారు. రాజధాని గ్రామాల రైతులు ఆయా గ్రామసభల్లో ఏకగ్రీవంగా చేసిన తీర్మానాల కాపీలను కూడా అందించారు.
ఆర్5 జోన్‌కు వ్యతిరేకం
సీఆర్‌డీఏ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన రాజధాని రైతులు కొద్దిసేపు ఆర్5 జోన్‌పై అభ్యంతరం తెలిపారు. సీఆర్‌డీఏ చట్ట సవరణలకు పాల్పడటాన్ని ఖండించారు. ఏపీ రాజధాని రైతుల సమన్వయ కమిటీ సభ్యుడు పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ రాజధాని కోసం భూములిచ్చిన రైతులు అన్ని విధాలా నష్టపోయారన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే సీఆర్‌డీఏ చ ట్టానికి అనుగుణంగా వ్యవహరించాలన్నారు. సవరణలు చేయటానికి పూనుకోవటం దారుణమన్నారు. రాజధానిలో ఆర్5 జోన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నా మన్నారు. ఇప్పటికే న్యాయ పోరాటం దిశగా అడుగులు వేశామని, హైకోర్టు ద్వారా తగిన న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.