జనవాడ..!

ABN , First Publish Date - 2022-09-25T05:52:27+05:30 IST

గుడివాడ గర్జించింది.

జనవాడ..!

గుడివాడలో అమరావతి పాదయాత్రకు విశేష ఆదరణ

పాద యాత్రికులతో ప్రధాన రహదారులన్నీ కిటకిట

పచ్చజెండాల రెపరెపల నడుమ ఉత్సాహంగా సాగిన యాత్ర

ప్రతి సెంటరులోనూ ఆత్మీయ ఆహ్వానాలు

పాదయాత్రకు పోలీసుల భారీ బందోబస్తు

పట్టణం మొత్తం మోహరించిన సీఆర్పీఎఫ్‌ బలగాలు

లాడ్జీల్లో కొత్త వారికి అనుమతి నో

ఆంక్షలు దాటుకుని అశేషంగా తరలివచ్చిన జనం

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన పాదయాత్ర

గుడివాడ గర్జించింది. జనవాడై జేజేలు పలికింది. ఆంక్షల కంచెలు దాటుకుని, అధికార పార్టీ బెదిరింపులకు ఎదురొడ్డి జన సునామీ గుడివాడ పట్టణం మొత్తాన్ని చుట్టేసింది. పట్టణం.. పల్లెలు.. వీధులు.. అక్కడ.. ఇక్కడ.. అని తేడా లేకుండా అన్నిచోట్లా పచ్చటి పతాకాలు రెపరెపలాడాయి. ఉడత ఊపులకు ఉద్యమం ఆగదని, అందరూ కలిసొస్తే అణచివేత తప్పదని హెచ్చరిస్తూనే అమరావతి అన్నదాతలు అడుగు ముందుకేశారు. అలుపెరగని రైతుల మహాపాదయాత్రకు శనివారం గుడివాడ వాసులు బ్రహ్మరథం పెట్టగా, దారిపొడవునా రథాన్ని ఆపి, పూజలు చేసి, హారతులు పట్టి, దిష్టి తీశారు. అమ్మలాంటి అమరావతి కోసం పోరాడుతున్న రైతులకు తమ వంతు సేవ చేసుకున్నారు.

గుడివాడ, గుడివాడ టౌన్‌/గుడివాడ రూరల్‌, సెప్టెంబరు 24 : అమరావతి రైతుల మహాపాదయాత్ర తో గుడివాడ పట్టణం దద్దరిల్లింది. మహాపాదయాత్రకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన రైతులతో పురవీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఇక్కడి రాజకీయ పరిణామాల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ముగ్గురు ఏఎస్పీల పర్యవేక్షణలో ఆరుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, సీఆర్పీఎఫ్‌ దళాలు రెండు, 600 మందికి పైగా పోలీసుల పర్యవేక్షణలో పాదయాత్ర ఆద్యంతం ఉత్కంఠభరిత వాతావరణంలో సాగింది. అంతకుముందే సీఆర్పీఎఫ్‌ దళాలు పట్టణంలో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించాయి. కొత్త మునిసిపల్‌ కార్యాలయం, శరత్‌ థియేటర్‌ సెంటర్‌ వద్ద పహారా ఏర్పాటు చేశాయి. శ్రీనివాసుడి రథంతో పాటు వెనుక నడుస్తున్న మహిళా రైతులకు పోలీసులు ప్రత్యేక రక్షణ కల్పించారు. 

  పాదయాత్ర సాగిందిలా..

గుడ్లవల్లేరు మండలం కౌతవరం నుంచి శనివారం ఉదయం 8 గ ంటలకు అమరావతి రైతుల పాదయాత్ర 13వ రోజు ప్రారంభమైంది. గుడ్లవల్లేరు, అంగలూరు, బొమ్ములూరు మీదుగా గుడివాడ పట్టణ శివారు వరకు 19 కిలోమీటర్ల మేర సాగింది. గుడ్లవల్లేరు వద్ద శ్రీనివాస రథానికి 108 కొబ్బరికాయలు కొట్టారు. తొమ్మిది గుమ్మడికాయలతో వెంకటేశ్వరస్వామికి, రథానికి దిష్టి తీశారు. కౌతవరం వద్ద పాదయాత్రకు గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుడివాడ కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ పిన్నమనేని పూర్ణవీరయ్య, మాజీ మంత్రులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, యెర్నేని సీతాదేవి, రైతు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు యెర్నేని నాగే ంద్రనాథ్‌ స్వాగతం పలికారు. గుడ్లవల్లేరు వై బ్రిడ్జి వద్ద స్థానిక రైతులు ఎడ్లబండ్లను ఏర్పాటు చేశారు. అంగలూరు వద్ద మాజీ మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీలు మాగంటి బాబు, కొనకళ్ల నారాయణరావు, పెనుమ లూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ, కొనకళ్ల బుల్లయ్య తదితరులు రైతులతో కలిసి నడిచారు. మధ్యాహ్నం 3.30 గంటలకు యాత్ర గుడివాడ పట్టణానికి చేరుకుంది. పెదకాల్వ సెంటర్‌ వద్ద రైతులకు ఘనస్వాగతం పలికారు. నెహ్రూచౌక్‌ సెంటరులో సర్వమత ప్రార్థనలు చేశారు. కాగా, గుడివాడ పట ్టణాన్ని శనివారం పోలీసులు జల్లెడ పట్టారు. లాడ్జీలను కొత్త వ్యక్తులకు ఇవ్వకుండా ఆంక్షలు పెట్టారు. మూడు రోజులుగా లాడ్జీలను తనిఖీ చేస్తూనే ఉన్నారు. 

Read more