26న దేశవ్యాప్త నిరసనలు

ABN , First Publish Date - 2022-12-16T01:29:23+05:30 IST

మోదీ ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ కేంద్రంగా నిర్వహించిన చరిత్రాత్మక ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చినట్టు అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) అధ్యక్షుడు రావుల వెంకయ్య తెలిపారు.

26న దేశవ్యాప్త నిరసనలు

ధర్నాచౌక్‌, డిసెంబరు 15 : మోదీ ప్రభుత్వం చేసిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ కేంద్రంగా నిర్వహించిన చరిత్రాత్మక ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చినట్టు అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) అధ్యక్షుడు రావుల వెంకయ్య తెలిపారు. స్థానిక దాసరిభవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంతో మోదీ ప్రభుత్వం నల్ల చట్టాలను ఉపసంహరించుకుందన్నారు. ఆ సమయంలో రైతులకు అనేక హామీలు ఇచ్చి భంగం చేయడాన్ని నిరసిస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో మరలా ఉద్యమాన్ని పున:ప్రారంభించాలని, దేశవ్యాప్తంగా రైతు పోరాటాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు జనవరి 26న రిపబ్లిక్‌ డే సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో నిరసనలు, ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమావేశాల్లో చలో పార్లమెంట్‌ చేపడుతున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వ విధానాలు రైతులకు నష్టం కలిగిస్తున్నాయని, డెయిరీల వ్యవస్థను పూర్తిగా నీరగారుస్తున్నాయని మండిపడ్డారు. రూ.500 కోట్ల ఆస్తులు కలిగిన చిత్తూరు డెయిరీని అమూల్‌ డెయిరీకి 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి కేవీవీ.ప్రసాద్‌, మల్నీడు యలమందరావు, కాటమయ్య, జమలయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T01:29:23+05:30 IST