పీఏసీఎస్‌లపై భారం

ABN , First Publish Date - 2022-12-07T00:04:19+05:30 IST

ధాన్యం కొనుగోలులో నూతన నిబంధనలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఎసీఎస్‌) పాలిట శాపంగా మారాయి. మిల్లర్లు, మధ్యవర్తులు చేసే పనిని పీఏసీఎస్‌లపై మోపి అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో పీఏసీఎస్‌లపై ఆర్థిక భారం పడుతోంది. సిబ్బంది జీతాలకు, నిర్వహణకు అవసరమైన రీతిలో ప్రభుత్వం కమీషన్‌ ఇవ్వడంలేదని పీఏసీఎస్‌ల కార్యదర్శులు వాపోతున్నారు.

పీఏసీఎస్‌లపై భారం

హమాలీల చార్జీలు, ట్యాక్స్‌కే రూ.31 చెల్లించాలి

మిగిలిన 60 పైసలతో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌లకు జీతాలెలా?

హమాలీ చార్జీలు సివిల్‌ సప్లయీస్‌ పెట్టుకోవాలని కార్యదర్శుల విన్నపం

ధాన్యం కొనుగోలులో నూతన నిబంధనలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఎసీఎస్‌) పాలిట శాపంగా మారాయి. మిల్లర్లు, మధ్యవర్తులు చేసే పనిని పీఏసీఎస్‌లపై మోపి అధికారులు చోద్యం చూస్తున్నారు. దీంతో పీఏసీఎస్‌లపై ఆర్థిక భారం పడుతోంది. సిబ్బంది జీతాలకు, నిర్వహణకు అవసరమైన రీతిలో ప్రభుత్వం కమీషన్‌ ఇవ్వడంలేదని పీఏసీఎస్‌ల కార్యదర్శులు వాపోతున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో 316 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 258 పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మిగిలినవి మార్కెటింగ్‌ శాఖ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా ఏర్పాటు చేసినవి. ఒక్కో పీఏసీఎస్‌ పరిధిలో మూడు, నాలుగు ఆర్బీకేలున్నాయి. వీటి ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరుపుతున్నారు.

నెలకు రూ.లక్ష ఖర్చు

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు అధికంగా పీఏసీఎస్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసి మిల్లరుకు పంపే వరకు పీఏసీఎస్‌లదే బాధ్యత. ఆర్బీకేల్లో టెక్నికల్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ అపరేటర్‌, ఇద్దరు సహాయకులను నియమించి వారికి పీఏసీఎస్‌ల ద్వారానే జీతాలు ఇవ్వాలి. టెక్నికల్‌ అసిస్టెంట్‌కు నెలకు రూ.10,800, డేటా ఎంట్రీ అపరేటర్‌కు నెలకు రూ.8వేలు, ఇద్దరు సహాయకులకు రూ.6వేలు చొప్పున జీతం పీఏసీఎస్‌ల నుంచే ఇవ్వాల్సి వస్తోంది. దీంతో ఒక్కో పీఏసీఎస్‌ పరిధిలో ఒక ఆర్‌బీకే నిర్వహణకు నెలకు రూ.30,800 ఖర్చవుతోంది. పీఏసీఎస్‌ పరిధిలో మూడు ఆర్బీకేలుంటే నెలకు కనీసంగా లక్ష రూపాయలు సిబ్బందికి వేతనాలుగా ఇవ్వాల్సి ఉంది. ఇది పీఏసీఎస్‌లకు ఆర్థికంగా భారంగా మారింది.

పెండింగ్‌లోనే హమాలీల చార్జీలు

గతేడాదికి సంబంధించి హమాలీల చార్జీలను ఇంతవరకు ప్రభుత్వం పీఎసీఎస్‌లకు విడుదల చేయలేదు. ధాన్యం కొనుగోలు అంశంలో పీఏసీఎస్‌ సిబ్బంది స్వచ్ఛందంగానే పనిచేస్తున్నారని, టెక్నికల్‌ అసిస్టెంట్‌, డేటాఎంట్రీ అపరేటర్‌ ఇద్దరు సహాయకులకు జీతాలు ప్రభుత్వం ఇవ్వకుంటే ఎలాగని పీఏసీఎస్‌ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. నవంబరు నుంచి ఏప్రిల్‌ వరకు ఆరునెలల పాటు పీఏసీఎస్‌లకు రూ.6 లక్షల మేర ఆర్థిక భారం పడుతోందని, ఈ ఖర్చులను పీఏసీఎస్‌లు ఎలా భరిస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు.పీఏసీఎస్‌లకు సంబంధించి పరిపాలనా వ్యవహారాలను చూసే కేడీసీసీబీ అధికారులు ఈ ఖర్చులను పీఏసీఎస్‌లే చూసుకోవాలని చెబుతున్నారని పీఏసీఎస్‌ల పర్సన్‌ఇన్‌చార్జులు, కార్యదర్శులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలులో హమాలీల చార్జీలు సకాలంలో విడుదల చేయకపోవడంతో పీఏసీఎస్‌లకు తలకు మించిన భారమవుతోంది.

అధికారులు పట్టించుకోరు

ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లను తహసీల్దార్లు, ఆర్డీవోలు, వ్యవసాయశాఖ నుంచి జిల్లా, మండలస్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వారు పీఏసీఎస్‌లను పరిశీలించడానికి వచ్చినపుడు తమ ఇబ్బందులను చెబితే విని వెళ్లిపోతున్నారే తప్ప ఆర్థిక భారం సమస్యను ప్రభుత్వం దృష్టికితీసుకువెళతామని కూడా చెప్పడం లేదని పీఏసీఎస్‌ కార్యదర్శులు వాపోతున్నారు.

క్వింటాలుకు మిగిలేది 60 పైసలే

పీఏసీఎస్‌ల ద్వారా ఽధాన్యం కొనుగోలు చేస్తే క్వింటాలుకు ప్రభుత్వం రూ.31.60 కమీషన్‌ ఇస్తోంది. ఇందులో ఆరు రూపాయలు ఇన్‌కంటాక్స్‌ రూపంలో కట్టాల్సి వస్తోంది. హమాలీల చార్జీల రూపంలో క్వింటాలుకు రూ.25లు ఇవ్వాలి. ఈ ఖర్చులన్నీ పోతే పీఏసీఎస్‌లకు మిగిలేది 60 పైసలు. ఈ 60 పైసల్లో నుంచే టెక్నికల్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ అపరేటర్‌ ఇద్దరు సహాయకులకు జీతాలు ఇవ్వాలట. గతేడాది ఇవ్వాల్సినవి రూ.50 లక్షలకుపేనే పెండింగులో ఉన్నాయి. కనీసం హమాలీ చార్జీల వరకైనా సివిల్‌ సప్లయీస్‌ శాఖ ఇవ్వాలని పీఏసీఎస్‌ కార్యదర్శులు కోరుతున్నారు.

Updated Date - 2022-12-07T00:04:21+05:30 IST