పంటలకు మద్దతు ధరల చట్టం తేవాలి

ABN , First Publish Date - 2022-08-01T05:59:20+05:30 IST

అన్ని పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పంటలకు మద్దతు ధరల చట్టం తేవాలి
లెనిన్‌ సెంటర్‌లో నిరసన తెలుపుతున్న ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి నేతలు

ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి  

  రైతు విద్రోహ చర్యలకు నిరసనగా ధర్నా 

విజయవాడ (గవర్నర్‌పేట), జూలై 31 : అన్ని పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు విద్రోహ చర్యలకు నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో లెనిన్‌ సెంటర్‌లో నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు సంఘాల నేతలు నినాదాలు చేశారు. జమలయ్య మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పర్చకుండా తుంగలో తొక్కిందన్నారు. బీజేపీకి చెందిన రైతు నాయకులతో కమిటీ ఏర్పాటు చేసి, పోరాటం సాగించిన నాయకత్వంతో సంప్రదించకుండా, చర్చించకుండా, విధివిధానాలు లేకుండా మద్దతు ధరల చట్ట ప్రస్తావన లేకుండా విధానాలు రూపొందించడం దుర్మార్గమన్నారు. రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకువచ్చే తంతు జరుగుతోందని ఆరోపించారు. రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు మాట్లాడుతూ, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 22ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. రైతు ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్దఎత్తున రైతులు ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏఐకేఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.హరినాథ్‌ మాట్లాడుతూ, రుణ విమోచన చట్టం తెచ్చి ఆత్మహత్యల నుంచి రైతాంగాన్ని కాపాడాలని కోరారు. రైతులకు భారంగా మారే విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ, ఎక్కువ మంది పేద రైతులు, రైతు కూలీలు ఆధారపడి ఉన్న పాడి రంగంపై జీఎస్‌టీ విధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. నిరసన కార్యక్రమంలో ఏఐకేయం రాష్ట్ర అధ్యక్షుడు తోట ఆంజనేయులు, ఎఐకేఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వెంకటరెడ్డి, నల్లమడ రైతు సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, జాగృతి రైతు సంఘం నేత మరీదు ప్రసాద్‌, ఎన్టీఆర్‌ జిల్లా రైతు సంఘం కార్యదర్శి పీవీ ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-08-01T05:59:20+05:30 IST