తిరువూరు వైసీపీలో తిరుగుబావుటా!

ABN , First Publish Date - 2022-12-31T00:54:49+05:30 IST

తిరువూరు నియోజకవర్గం వైసీపీలో కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. ఎమ్మెల్యే రక్షణనిధి, ఆయన బామ్మర్ది, వారి అనుచరుల అరాచకాలపై అసమ్మతి వర్గం రగిలిపోతోంది. అధిష్టానానికి అనేకమార్లు ఫిర్యాదులు చేసినా సరిగ్గా స్పందించకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేని ఓడించాలని, ఆయన కార్యక్రమాలను అడ్డుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ఇందుకు ప్రజల మద్దతును కూడగట్టేందుకు గ్రామగ్రామాన క్రియాశీలంగా కృషి చేస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా విషయాలన్నీ తెలుసుకున్న అధిష్టానం తీరిగ్గా దూతను పురమాయించి దిద్దుబాటుకు దిగింది. అసమ్మతిని దారికి తెచ్చుకునేందకు సతమతమవుతోంది.

తిరువూరు వైసీపీలో తిరుగుబావుటా!

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తొలుత పట్టించుకోని అధిష్టానం

ఎమ్మెల్యేను ఓడిస్తామని తెగేసి చెప్పిన అసమ్మతి వర్గం

ఎమ్మెల్యే కార్యక్రమాలను అడ్డుకోవాలని సంచలన నిర్ణయం

ప్రజల మద్దతు కూడగట్టేందుకు క్రియాశీల కృషి

దిగొచ్చిన అధిష్టానం.. దిద్దుబాటు చర్యలు మొదలు

విచారణకు కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ను పంపిన వైనం

అసమ్మతితో ప్రత్యేకంగా సమావేశమైన దూత

అక్రమాలపై ఆధారాలతో వివరించిన తిరుగుబాటు నేతలు

తిరువూరు నియోజకవర్గం వైసీపీలో కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. ఎమ్మెల్యే రక్షణనిధి, ఆయన బామ్మర్ది, వారి అనుచరుల అరాచకాలపై అసమ్మతి వర్గం రగిలిపోతోంది. అధిష్టానానికి అనేకమార్లు ఫిర్యాదులు చేసినా సరిగ్గా స్పందించకపోవడంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేని ఓడించాలని, ఆయన కార్యక్రమాలను అడ్డుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ఇందుకు ప్రజల మద్దతును కూడగట్టేందుకు గ్రామగ్రామాన క్రియాశీలంగా కృషి చేస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా విషయాలన్నీ తెలుసుకున్న అధిష్టానం తీరిగ్గా దూతను పురమాయించి దిద్దుబాటుకు దిగింది. అసమ్మతిని దారికి తెచ్చుకునేందకు సతమతమవుతోంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : రెవెన్యూ శాఖ పరిధిలో ఎమ్మెల్యే అనుచరుడు సాగించిన నకిలీ పొజిషన్‌ పట్టాల కుంభకోణంతో పాటు, ఆయన బామ్మరిది, అనుచరుల అనేక అరాచకాలకు పాల్పడ్డారు. వీటికి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. అధిష్టానం కూడా ఎమ్మెల్యేకు అండగా నిలిచింది. దీంతో అసమ్మతి వర్గంలో కోపం కట్టలు తెంచుకుంది.

నీరుగారిన రాజీ యత్నాలు

అసమ్మతి నేతలు రెండు నెలలుగా గ్రామగ్రామాన సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరుల అవినీతి, వారికి ఎమ్మెల్యే కొమ్ము కాయటంపై విస్తృతంగా చర్చించటం ప్రారంభించారు. ఒకే గ్రామంలో రెండు మూడు గ్రూపులుగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా విడిపోయారు. ఈ పరిణామాలతో ఈ నెల 27న పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు మూడు జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్‌ మర్రి రాజశేఖర్‌, రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి తిరువూరు వచ్చి.. ఎమ్మెల్యే సమక్షంలో విచారణ చేపట్టారు. విచారణకు వచ్చినవారు ఎమ్మెల్యే సమక్షంలో చర్చించటంపై అసమ్మతివర్గం అసహనం వ్యక్తం చేసింది. అధిష్టానానికి ఫిర్యాదు చేసినా లాభం లేదని ఎమ్మెల్యేను ఓడించటమే లక్ష్యమని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యేకు సీటు ఇవ్వకుండా అడ్డుకోవాలని, సీటు ఇస్తే డబ్బులు వేసుకుని మరీ ఓడించాలని అసమ్మతి నేతలు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయాన్ని అధిష్టానంలోని కొందరు ముఖ్యనేతలకు కూడా చెప్పారు.

ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలివీ

దొంగ పొజిషన్‌ సర్టిఫికెట్ల ఉదంతంతో పాటు ఇసుక, విద్యుత్‌ శాఖలో పోస్టుల అమ్మకాలు, అంగన్‌వాడీ స్కూళ్లలో పోస్టుల అమ్మకాలు, ఇసుక అమ్మకాలు, భూ కబ్జాలు తదితరాలపై స్థానికంగా వైసీపీ నాయకులు బాహాటంగా ప్రశ్నిస్తున్నారు. వీరిని అధికార బలంతో కొందరు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ పరిధిలో జరిగిన నకిలీ పొజిషన్‌ సర్టిఫికెట్ల ఉదంతంపై ఏకంగా స్పందనలో ఫిర్యాదులు చేశారు.

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతి ప్రచారం

వైసీపీ అధిష్టానం తమను పట్టించుకోకపోవడంతో గ్రామస్థాయిలో అసమ్మతివర్గం క్రియాశీలంగా పని చేస్తోంది. ఎమ్మెల్యే నిర్వహించిన గడపగడప కార్యక్రమంలో ఏ గ్రామం వెళ్లినా, ఎక్కడ ఎదురుపడినా అడ్డుకుంటున్నారు. అక్రమాలపై నిలదీస్తున్నారు. ఈ అంశాలు కూడా అధిష్టానం దృష్టికి వెళ్లాయి. వీటితో ఉలిక్కిపడిన అధిష్టానం విచారణకు దిద్దుబాటుకు దూతను పురమాయించింది. కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ తుమ్మల చంద్రశేఖర్‌ శుక్రవారం తిరువూరు వచ్చి ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా అసమ్మతి వర్గంతోనే ప్రత్యేకంగా చర్చించారు. ఎమ్మెల్యే అనుచరులు, ఆయన బావమరిది చేసిన పాపాల చిట్టాను అసమ్మతి వర్గం వివరించింది. వీరికి ఎమ్మెల్యే మద్దతు పలకటాన్ని సాక్ష్యాధారాలతో సహా అందించింది.

Updated Date - 2022-12-31T00:54:49+05:30 IST

Read more