కోటి ఆశలతో.. కొత్త ఏడాదికి స్వాగతం...
ABN , First Publish Date - 2022-12-31T23:30:31+05:30 IST
కోటి ఆశలతో జిల్లా ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా కార్యాలయాలతో పాటు సిబ్బంది కొరత పీడిస్తోంది. జిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది. ఈ ఏడాదైనా జిల్లాలో కొత్త పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
ఈ ఏడాదిలోనైనా...జిల్లా సమస్యలు తీరేనా..?
నత్తనడక పనులు.. వేగం పుంజుకునేనా?
కోటి ఆశలతో జిల్లా ప్రజలు కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతున్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా కార్యాలయాలతో పాటు సిబ్బంది కొరత పీడిస్తోంది. జిల్లా పారిశ్రామికంగా వెనుకబడి ఉంది. ఈ ఏడాదైనా జిల్లాలో కొత్త పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరంలో పరిష్కారానికి నోచుకోని.. సమస్యలు కొత్త ఏడాదిలో అయినా పరిష్కారం కావాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.
(రాయచోటి-ఆంధ్రజ్యోతి): అసలే కొత్త జిల్లా.. ఇంకా పూర్తి స్థాయిలో సదుపాయాలు ఏర్పడ లేదు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలలో.. అరకొర సదుపాయాలతోనే.. అధికారులు పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆశించినంత మేర నిధులు రావడం లేదు. దీంతో కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాలతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాలు లేవు. జిల్లా కేంద్రంలో సైతం అన్ని సదుపాయాలకు సమయం పడుతోంది. కొత్త సంవత్సరంలో అయినా.. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణం జరగాలని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం విరివిగా నిధులు విడుదల చేసి.. జిల్లా కేంద్రాన్ని అన్ని రంగాల్లోనూ. ముందంజలో నిలిచేలా చూడాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా వ్యాప్తంగా సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు కొత్త సంవత్సరంలో పరిష్కారం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు కొత్త సంవత్సరంలో పూర్తయి అందుబాటులోకి రావాలని ఆ ప్రాంత రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఉపాధి లభించేలా పలు పరిశ్రమలు ఏర్పాటు కావాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. అదేవిధంగా గిట్టుబాటు ధర లేనప్పుడు.. పెట్టుబడులు కూడా రాకుండా.. నష్టపోతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్న టమోటా రైతులు.. శీతల గిడ్డంగుల కోసం కొత్త సంవత్సరంలో అయినా.. మోక్షం లభించేనా అని ఎదురు చూస్తున్నారు. మొత్తానికి గడిచిన సంవత్సరంలో పరిష్కారానికి నోచుకోని.. సమస్యలు కొత్త ఏడాదిలో పరిష్కారం కావాలని జిల్లా ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు.
కొత్త భవనాలు ఎప్పుడో..?
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉగాది సందర్భంగా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పడింది. రింగు రోడ్డుకు సమీపంలో అందుబాటులో ఉన్న గిరిజన బాలుర వసతి గృహంలో తాత్కాలిక భవనంలో కలెక్టరేట్లో పాలన సాగుతోంది. అదేవిధంగా రింగు రోడ్డుకు సమీపంలోని పాలిటెక్నిక్ భవనంలో జిల్లా పోలీసు కార్యాలయం నడుస్తోంది. మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయి. రాయచోటి ఆర్డీవో కార్యాలయంతో పాటు మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కొత్త సంవత్సరంలో జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వతంగా ఉండేలా కొత్త భవనాలు నిర్మించాలని పలువురు కోరుకుంటున్నారు.
అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులు పూర్తయ్యేనా?
గత ఏడాది నవంబరులో వచ్చిన వరదలకు సుండుపల్లె మండలంలోని పింఛా ప్రాజెక్టు, రాజంపేట మండలంలోని అన్నమయ్య ప్రాజెక్టులు పూర్తిగా కొట్టుకుపోయాయి. 687 కోట్ల రూపాయలకు అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అదే విధంగా సుమారు రూ.90 కోట్లతో పింఛా ప్రాజెక్టును నిర్మించేందుకు కూడా టెండర్లను ప్రభుత్వం పిలిచింది. ప్రస్తుతం ఈ రెండు ప్రాజెక్టులు కొట్టుకుపోవడంతో.. వేల ఎకరాలు సాగుకు నోచుకోక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త సంవత్సరంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలని రైతులు కోరుకుంటున్నారు.
మదనపల్లె సమస్యలకు మోక్షం ఎప్పుడో..?
మదనపల్లె మండలం ఆరోగ్యవరం వద్ద 100 ఎకరాల్లో, 485 కోట్ల రూపాయలతో ఏడాదిన్నర క్రితం వైద్య కళాశాల పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ భూమి చదును చేసే పనులు మాత్రమే సాగుతున్నాయి. ఈ వైద్య కళాశాల పూర్తయితే మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, రాయచోటి నియోజకవర్గాల్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. అదేవిధంగా మదనపల్లె ప్రాంతంలో టమోటా పంటను ఎక్కువగా సాగు చేస్తారు. మదనపల్లె టమోటా మార్కెట్‌కు రాష్ట్ర స్థాయిలో పేరుంది. ఈ ప్రాంతంలో టమోటా అనుబంధ పరిశ్రమలు లేకపోవడంతో.. గిట్టుబాటు ధరలు లేని సమయంలో టమోటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లె చేనేతకు ప్రసిద్ధి చెందింది. పది వేల చేనేత మగ్గాలు, 20 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ముడిసరుకు ధరలు విపరీతంగా పెరగడంతో చేనేత రంగం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. చేనేత రంగాన్ని ఆదుకునే క్రమంలో టెక్స్టైల్ పార్క్, ఇక్కడ పట్టుచీరలకు బ్రాండ్ ఇమేజ్ కల్పించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
మదనపల్లెకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి చిప్పిలి, గుట్టకిందపల్లె వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నిర్మించిన మరువలు ఏర్పాటు చేయకపోవడంతో నీరు వృథా అవుతోంది. మదనపల్లె పట్టణానికి రూ.20 కోట్లతో అమృత పథకం కింద తాగునీటి పథకాలు, మురుగునీటి శుద్ధి ప్లాంటు నిర్మాణాలు అర్ధంతరంగా ఆగిపోయాయి. ప్రఖ్యాత విద్యా కేంద్రమైన బీటీ కళాశాల ప్రభుత్వపరమైనా, నిధుల కొరతతో ఆ స్థాయిలో అధ్యాపకులు, ఇతర సౌకర్యాలు, వసతుల కల్పనకు నోచుకోలేదు. కళాశాల అభివృద్ధికి 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పెషల్ డెవల్‌పమెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) కింద 4 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో రవీంద్రనాధ్ ఠాగూర్ కాలేజ్, ఆడిటోరియం, బీటీ కళాశాల ఆస్తుల రక్షణకు ప్రహరీ పనులు ప్రారంభమయ్యాయి. నిధుల లేక ఆ పనులన్నీ అసంపూర్తిగా ఆగిపోయాయి. హంద్రీ-నీవా కాలువలు మరమ్మతులకు నోచుకోలేదు.
జ్యూస్ ఫ్యాక్టరీ తెరుచుకునేనా..?
జిల్లాలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం రైల్వేకోడూరు. ఈ నియోజకవర్గం ఉద్యాన పంటలకు కేంద్ర బిందువు. ఇక్కడ శీతల గిడ్డంగులు లేక.. రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అనంతరాజు పేట అప్సా జ్యూస్ ఫ్యాక్టరీ మూత పడి ఉంది. కొత్త సంవత్సరంలో అయినా ఈ ఫ్యాక్టరీ తెరుచుకుంటే.. ఎందరికో ఉపాధి దొరుకుతుంది. గత మూడు దశాబ్దాలుగా 25 గ్రామాలకు సంబంధించి రోడ్డు అండర్ బ్రిడ్జి లేదు. కోడూరు-వెంకటగిరి రోడ్డు పెండింగ్ పడిపోయింది. అగ్రికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు నెరవేర్చలేదు.
ఆదర్శ పాఠశాల నిర్మాణం కలేనా.?
కలకడ ఆదర్శ పాఠశాలకు అనుసంధానంగా బాలికల హాస్టల్ భవనాల నిర్మాణానికి 2016వ సంవత్సరంలో ప్రభుత్వం రూ.1.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. అప్పట్లో కొంత పనులు జరిగాయి. తర్వాత నిలిచిపోయాయి. దీంతో పాఠశాల ఆవరణం పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది. ఇవే కాక జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ.. అనేక అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. నిధులు లేక.. ఆ పనులు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు. కొత్త సంవత్సరంలో అయినా.. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులు కేటాయించి.. అభివృద్ధి పనులన్నీ పూర్తి అవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.