ఇన్నాళ్లు సహించాం... ఇక సహించం

ABN , First Publish Date - 2022-08-17T04:48:22+05:30 IST

ఒక్క రోజు పన్ను కట్టడం ఆలస్యమైతే వడ్డీలు వేసి ముక్కుపిండి పన్నులు కట్టించుకుంటున్నారు.

ఇన్నాళ్లు సహించాం... ఇక సహించం
సచివాలయం ఎదుట ఆందోళన చేస్తున్న 18వ వార్డు మహబూబ్‌నగర్‌ వీధి వాసులు

రెండేళ్లుగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకోని అధికారులు 

ప్రజల ప్రాణాలంటే లెక్కా జమా లేదా... 

మురుగునీటి సరఫరాపై అధికారులను నిలదీసిన 18వ వార్డు న్యూకాలనీ ప్రజలు  

ఇకపై పన్నులు కట్టమని అల్టిమేటం


ఎర్రగుంట్ల, ఆగస్టు 16: ఒక్క రోజు పన్ను కట్టడం ఆలస్యమైతే వడ్డీలు వేసి ముక్కుపిండి పన్నులు కట్టించుకుంటున్నారు. రెండేళ్లుగా తాగునీటిలో మురు గునీరు కలుషితమౌతోందని ఎన్నోసార్లు మొరపెట్టుకు న్నాం... కార్యాలయాల వద్దకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చాం. అయినా నిమ్మకు నీరెత్తినట్లు మీరు ప్రవర్తిస్తున్నారు. మా వీధిలో ఎవరైనా పన్ను బకాయి లున్నారా... అందరం కట్టాం. అలాంటప్పుడు కొత్త పైప్‌లైన్‌ ఎందుకు వేయరంటూ ఎర్రగుంట్ల నగర పంచాయతీలోని 18వ వార్డు న్యూకాలనీ మహబూబ్‌నగర్‌ వీధులకు చెందిన ప్రజలు అధికారులను మంగళవారం నిలదీశారు. మా గోడు మీకు పట్టదా... ఈ నీటితో ఒక్కరోజు మీరు స్నానాలు చేయండి చాలు తెలుస్తుంది. అంటూ మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొత్తపైపు లైన్‌ వేసేంత వరకు ఇక్కడి నుంచి కదలమంటూ భీష్మించారు. రెండేళ్లుగా ఈనీరు తాగుతున్నాం, స్నానాలు చేస్తున్నాం. కడుపులో వికారం పుడుతోంది. ఒకటే దురద... ఆసుపత్రి పాలై డబ్బులు ఖర్చుచేసుకుంటున్నాం. అయినా మీలో చలనం లేదు. ఎప్పుడొచ్చినా పదిరోజుల్లో వేస్తామంటున్నారు. ఇంకెప్పుడు మేమంతా చచ్చినప్పుడా..? అంటూ  వాదనకు దిగారు. దీంతో హడలెత్తిన అధికారులు ఎం చెప్పాలో దిక్కుతెలియక మిన్నకుండి పోయారు. 


ఐదేళ్ల వరకు పన్నులు అడగవద్దు... 

మా వీధుల్లో ఐదేళ్ల వరకు పన్నులు అడగవద్దు, మేము కట్టం. మేము కట్టే పన్నులతో మేమే కొత్త పైప్‌లైన్‌ వేయించుకుంటామంటూ అల్టిమేటం ఇచ్చారు. చిన్నపిల్లలకు చర్మవ్యాధులొచ్చి తీవ్ర ఆనారోగ్యానికి గురవుతున్నారు. కలుషిత నీరు తాగి ఎన్నో అవస్థలు పడుతున్నా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. 


గనుల్లో నీరు సరఫరా చేస్తున్నారు

మురగునీరు కలుషితమౌతోందని చెబితే కొన్నిసార్లు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. అవి కూడా గనుల్లో నీరని,  కుళ్లులు వస్తున్నాయని ఆ నీటిని తాగేదెలా అని వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. మీరు కూడా ఇలాంటి నీరే తాగుతారా అంటూ ధ్వజమెత్తారు. ప్రజల ప్రాణాంటే లెక్కాజమా లేదా... అంటూ మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేము పన్నులు కట్టడం లేదా అని నిలదీశారు. మాకు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే.. లేదంటే ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. 


ఎన్నోసార్లు విన్నవించాం...

కలుషిత నీటి విషయంపై అధికారులకు అనేకసార్లు ప్రజలతో కలసి విన్నవించాం. అయినా పట్టించు కోవడం లేదు. ఇప్పటికైనా మంచి నీళ్లు ఎప్పటిలోపు సరఫరా చేస్తారో చెప్పండంటూ కమిషనర్‌ను, ఏఈ సందీప్‌ను 18వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ శివకుమార్‌ ప్రశ్నించారు.  

Read more