వంటనూనెలపై ‘విజిలెన్స్‌’ కొరడా

ABN , First Publish Date - 2022-03-17T05:11:49+05:30 IST

వంటనూనెల అక్రమ నిల్వలు, అధిక ధరలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం కొరడా ఝలిపిస్తోంది.

వంటనూనెలపై ‘విజిలెన్స్‌’ కొరడా
నూనెమిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్‌ అధికారులు

ఇప్పటి వరకు 151 కేసులు నమోదు

ప్రొద్దుటూరు క్రైం, మార్చి 16 : వంటనూనెల అక్రమ నిల్వలు, అధిక ధరలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం కొరడా ఝలిపిస్తోంది. వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖతో పాటు సంబంధిత శాఖ అధికారులు  దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రీజనల్‌ అధికారి ఉమామహేశ్వర్‌ నేతృత్వంలో ఆ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు నాలుగు బృందాలుగా తనిఖీ చేపట్టారు.  జిల్లావ్యాప్తంగా రాజంపేట, పెనగలూరు, చిట్వేల్‌, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, కడప పట్టణాల్లో దాడులు సాగాయి. మొత్తంగా 45 వ్యాపార సంస్థలపై అయా శాఖల అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టగా, అందులో అక్రమాలకు పాల్పడుతూ పట్టుబడిన 14 మందిపై కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్‌ రీజనల్‌ అధికారి ఉమామహేశ్వర్‌ తెలిపారు. ప్రొద్దుటూరులోని శ్రీసాయిబాలాజీ ట్రేడర్స్‌లో అనుమతించిన పరిమాణం కంటే ఎక్కువగా వంటనూనెల నిల్వ ఉన్న కారణంగా ఈసీ యాక్టు 1955 ప్రకారం 6-ఎ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో రూ.62,07,500లు విలువ చేసే 50,165 ఎంటీఎస్‌ నూనె నిల్వలను జప్తు చేసినట్లు ఆయన చెప్పారు. జిల్లావ్యాప్తంగా 333 వ్యాపార విభాగాల్లో దాడులు నిర్వహించగా, 151 కేసులు నమోదు చేసినట్లు  చెప్పారు. కాగా ఈ దాడుల్లో ఎస్‌ఐ రంగస్వామి, ఏఈ ఆశోక్‌కుమార్‌, విజిలెన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Read more