శ్మశాన వాటిక జోలికి వస్తే సహించం

ABN , First Publish Date - 2022-03-17T04:51:40+05:30 IST

పట్టణ పరిధిలోని గున్నికుంట్ల రోడ్డులో గల జోరాణికుంటలో ఉన్న హిందూ శ్మశాన వాటిక జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని సీపీఐ, ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు.

శ్మశాన వాటిక జోలికి వస్తే సహించం
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఐ, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలు

సీపీఐ, ప్రజా సంఘాల నేతల హెచ్చరిక


రాయచోటిటౌన్‌, మార్చి 16: పట్టణ పరిధిలోని గున్నికుంట్ల రోడ్డులో గల జోరాణికుంటలో ఉన్న హిందూ శ్మశాన వాటిక జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని సీపీఐ, ప్రజా సంఘాల, విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. శ్మశానవాటికను కొంత మంది కబ్జాదారులు ఆక్రమించుకోవడంపై బుధవారం సీపీఐ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలు ఆయా వార్డుల ప్రజలతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డెర విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ జీవానందం, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ  కబ్జాదారులు శ్మశానవాటికలో సమాధులు పగలగొట్టి ఆక్రమించడమే కాకుండా, మధ్యలో రోడ్డు వేశారన్నారు.  వెంట నే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.  కాగా శ్మశాన వాటిక కబ్జాకు పాల్పడేవారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు హరికృష్ణ డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 


పోలీసులు కేసు నమోదు  చేయాలి

రాయచోటి, మార్చి 16: తప్పు చేసిన వారు సొంత పార్టీ నాయకులైనా ఉపేక్షించేది లేదని, సర్వే నెంబరు 801లో గల శ్మశాన వాటికలో సమాధులను ధ్వంసం చేసి శ్మశానాన్ని ఆక్రమించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మున్సిపల్‌ కౌన్సిలర్లు, వైసీపీ నేతలు డిమాండ్‌ చేశారు. శ్మశాన వాటిక ఆక్రమణ విషయంపై స్పందించిన మున్సిపల్‌ కౌన్సిలర్లు వైసీపీ నేతలు బుధవారం రాయచోటి తహసీల్దార్‌ సుబ్రమణ్యంరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పోలంరెడ్డి దశరథరామిరెడ్డి, వైసీపీ మైనార్టీ నేత హబీబుల్లాఖాన్‌, కౌన్సిలర్లు డాక్టర్‌ మదన్‌మోహన్‌రెడ్డి, అల్తాఫ్‌, గౌస్‌కాన్‌, సుగవాసి ఈశ్వర్‌ప్రసాద్‌, జయన్ననాయక్‌ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2022-03-17T04:51:40+05:30 IST