చుక్కల భూముల చిక్కు వీడింది
ABN , First Publish Date - 2022-04-08T05:39:32+05:30 IST
ఎట్టకేలకు చుక్కల భూముల చిక్కుముడులు వీడనున్నాయి. నాలుగేళ్లుగా క్లియరెన్సు కోసం నానా తంటాలు పడుతున్న రైతుల ఇబ్బందిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ
ఇకక్లియరెన్స్ బాఽధ్యత కలెక్టర్లదే
దాదాపు 1500 పెండింగ్ దరఖాస్తులు
కడప(కలెక్టరేట్), ఏప్రిల్ 7: ఎట్టకేలకు చుక్కల భూముల చిక్కుముడులు వీడనున్నాయి. నాలుగేళ్లుగా క్లియరెన్సు కోసం నానా తంటాలు పడుతున్న రైతుల ఇబ్బందిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ తహశీల్దార్లు, ఆర్డీవో, కలెక్టర్ కమిటీల ఆమోదం పొందినా... రాష్ట్ర సీసీఎల్‌ఏ గ్రీన్ సిగ్నల్‌తో పాటు ప్రభుత్వ ఆమోదం పొందాలి. ఇదంతా పెద్ద తంతుగా కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చుక్కల భూములను చక్కదిద్దే బాధ్యత కలెక్టర్‌కు అప్పగించింది. ఇది ఇన్నాళ్లు కార్యాలయాలు, దళారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగిన రైతులకు శుభ పరిణామమే.
దాదాపు 1500 దరఖాస్తులు పెండింగ్
గత కొన్నేళ్లుగా చుక్కల భూములను చక్కదిద్దాలంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. 2017లో ఆ భూముల క్లియరెన్సు కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం జీవో నెంబరు 298 జారీ చేసింది. అయినప్పటికీ ఈ వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. అనంతరం కొలువుదీరిన ప్రభుత్వం దాదాపు 8 పర్యాయాలు సర్క్యులర్లు, ఆర్డర్లు, మెమోలతో మార్గదర్శకాలు జారీచేసింది. వీటితో పాటు లేనిపోని ఆంక్షలు విధించింది. దీంతో కలెక్టరేట్ కు వచ్చిన దాదాపు 2 వేల దరఖాస్తులు క్లియరెన్సు దొరకక మురిగిపోతున్నాయి. కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పడిన నేపథ్యంలో రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు నియోజక వర్గాలకు చెందిన చుక్కల భూములకు సంబంధించిన దాదాపు 5 వందల దరఖాస్తులు ఆ జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయి. దీంతో వైఎస్సార్ కడప జిల్లా పరిధిలో ఇంకా 1500 వరకు పెండింగ్ దరఖాస్తులు ఉంటాయని రెవెన్యూ వర్గాల సమాచారం.
పెద్ద వ్యాపారమే సాగింది..
చుక్కల భూములకు సంబంధించి నిన్నటి వరకు ప్రభుత్వ నిర్ణయాలన్నీ అధికార పార్టీలోని కొందరు నేతలకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయనే విమర్శలు రైతుల నుంచి వచ్చాయి. తహశ్దీరు నుంచి దరఖాస్తు ఆర్డీఓకు, జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌కు... అక్కడ కమిటీలో గ్రీన్‌సిగ్నల్ దొరికినా ఆభూములకు మోక్షం ఉండేది కాదు. కలెక్టర్ అప్రూల్ అనంతరం సీసీఎల్‌ఏ కమిషనరు క్లియరెన్సు ఇవ్వడమే కాకుండా మళ్లీ ప్రభుత్వం కూడా పరిశీలించి ఓకే అంటూ అనుమతులిస్తే తప్ప ఆభూములకు చుక్కల జాడ్యం వీడేదికాదు. ఇంత తతంగం జరగాలంటే రైతులకు పుణ్యకాలం అటకెక్కినట్లే. ఈలోగా దళారులు అధికారుల పేరుతో భూముల మార్కెట్ ధరలను బట్టి లక్షలాది రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.
కళ్లెదుట భూములున్నా..
కళ్లెదుట కోట్ల విలువైన భూములున్నా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు రాక, రుణాలు పొందక, బీమాలు వర్తించక పోవడంతో ప్రతిఏడాది ఆ రైతులకు కరువు కాటకాలెదురైనపుడు కన్నీళ్లే మిగిలేవి. కన్నబిడ్డలకు శుభకార్యాలకు, చదువులకు ఆర్థిక అవసరం ఎదురైనప్పుడు ఈ భూములు చెప్పుకోవడానికే తప్ప.. వీటిని అమ్మేందుకు పనికివచ్చేవి కావు, వీటిపై అప్పులిచ్చేవారూ లేరు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చుక్కల భూముల రైతులకు ఊరట కల్గించేలా ఉంది.
ఇవీ మార్గదర్శకాలు..
పెండింగ్ దరఖాస్తులను ఆర్వోఆర్ చట్టం పరిధిలో చేసేలా ప్రభుత్వం కలెక్టర్లకు మార్గదర్శకాలను గతనెల 23 వ తేదీన మెమో నెంబరు 08-2020-ల్యాండ్స్-1ను విడుదల చేసింది. 2017 నుంచి ఉన్న చుక్కల భూములకు సంబంధించి పట్టాదారు పాసు పుస్తకాలుంటే ఆర్‌ఓఆర్ యాక్టు ప్రకారం ఎలాంటి సమస్యలు లేకుంటే చుక్కల భూములను చక్కదిద్దే బాధ్యత కలెక్టర్‌దే. అంతేకాకుండా మార్పులు చేర్పులు అవసరం అయితే ఆర్‌ఓఆర్ చట్టపరిధిలో చేయాల్సి ఉంటుంది. 22-ఏ-1 లిస్టులో నిషేధిత జాబితాలో ఉన్న చుక్కల భూములను తొలగించే అంశంలో సెక్షన్7-ఏ కింద భూముల పత్రాలాధారంగా డిలిట్ చేయవచ్చు. అప్పుడే రిజిస్ట్రేషన్లు కూడా చేసుకొనేందుకు ఈభూములకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆర్‌ఎస్‌ఆర్ అప్‌డేషన్ యాక్టు పరిధిలో చేయవచ్చు. ఆర్‌ఓఆర్ యాక్టు అమలు నాటికి ముందుగా 12 ఏళ్ల అనుభవంలో ఉండి పత్రాలు కల్గిన చుక్కల భూములను కూడా నేరుగా చుక్కల జాబితా నుంచి తీసి వేసే అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగించారు. ఇటీవల కడప జిల్లా నుంచి కలెక్టర్ అప్రూవుల్ చేసిన చుక్కల భూములకు చెందిన పలు దరఖాస్తులు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్లాయి. తాజాగా చాలా మండలాలకు చెందిన వందలాది ఎకరాల భూములకు కూడా క్లియరెన్సు దొరకనుంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్లియరెన్స్ బాఽధ్యత కలెక్టర్లకు అప్పగించారు
- ఏ.మలోల, డీఆర్వో
చుక్కల భూములకు సంబంధించి చక్కదిద్దేబాధ్యత ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. 22-ఏ-1 జాబితాలో ఉండే చుక్కలభూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేలా ఇటీవల ప్రభుత్వానికి దరఖాస్తులు పంపించాం. అక్కడి నుంచి తాజాగా అనుమతులు జారీ అయ్యాయి. రెవెన్యూలో ఏ, బీ, సీ, డీ, ఈకి సంబంధించి వివిధ క్యాటగిరీల వారీగా భూములలో, ఈ-పరిధిలోని భూములను క్షేత్రస్థాయి రెవెన్యూరికార్డుల పరిశీలన మేరకు క్లియరెన్సు చేసే అధికారం కలెక్టర్లకు ఉంది. ఇక భూ సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుంది.