వదలని వర్షం

ABN , First Publish Date - 2022-12-13T00:10:02+05:30 IST

రాజంపేట డివిజన్‌ కుండపోత వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మాండస్‌ తుఫాన్‌ వలన రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడి ప్రజలు ఇబ్బంది ఎదుర్కోగా ఆదివారం పగలంతా విరామం ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.

వదలని వర్షం
మామిడి తోటలో నిలిచిన నీరు

ఆందోళనలో జనం

ఒక్కరోజు విరామం.. తిరిగి కుండపోత

ఉగ్రరూపం దాల్చనున్న నదులు, పంటలకు భారీ నష్టం

రాజంపేట, డిసెంబరు 12: రాజంపేట డివిజన్‌ కుండపోత వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మాండస్‌ తుఫాన్‌ వలన రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడి ప్రజలు ఇబ్బంది ఎదుర్కోగా ఆదివారం పగలంతా విరామం ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కొద్దిసేపు విరామం ఇవ్వడం, భారీ ఎత్తున కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. దీంతో రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో పెద్దఎత్తున వరదనీరు ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి కూడా ఇదే విధంగా వర్షం కురిస్తే గుంజనేరు, పామిలేరు, పుల్లంగేరు, బాహుదా, చెయ్యేరు నదులు ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉంది. ఉద్యాన పంటలైన అరటి, బొప్పాయి, మామిడితోటల్లో వరదనీరు ఎక్కువగా ప్రవహించడంతో పాటు నీరు నిల్వ ఉండటంతో పంటలకు పెద్దఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రూ.20 కోట్లకు పైబడి అరటి పంట నేలమట్టమైంది. ఇక మామిడి తోటల్లో పూత పెద్దఎత్తున కాచి ఉంది. ఇదే వర్షం ఎక్కువగా పడితే మామిడి పంటలన్నీ దెబ్బతినే అవకాశం ఉంది. బొప్పాయి పంటను ఇప్పుడిప్పుడే సాగు చేస్తున్నారు. నీరు నిలిస్తే బొప్పాయి పంట అంతా ఆదిలోనే పాడయ్యే అవకాశం ఉంది. కడప-చెన్నై హైవే పూర్తిగా దెబ్బతింది. పుల్లంపేట, రాజంపేట, కోడూరు, ఓబులవారిపల్లె ప్రాంతాల గుండా వెళ్లే ఈ హైవే గుంతలమయమై దెబ్బతినడం వల్ల వాహనాలు వెళ్లడం ఇబ్బందికరంగా ఉంది. అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులు ఇప్పటికి ఇళ్లు లేక చలికి, ఎండకు, వానకు ఇబ్బందులు పడుతూ తాత్కాలిక గుడిసెల్లో ఏడాదిపైబడి కాలం గడుపుతున్నారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తలదాచుకోవడానికి కూడా వీలులేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - 2022-12-13T00:10:02+05:30 IST

Read more