లక్ష లీటర్ల పాలసేకరణే లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-31T05:49:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం, అమూల్‌ సహకార డెయిరీ సంయుక్తంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహిస్తున్న అమూల్‌ డెయిరీని రోజుకు లక్ష లీటర్ల పాలసేకరణ లక్ష్యంగా ముందుకు తీసుకెళతామని గుజరాత్‌ రాష్ట్రం అమూల్‌ సహకార డెయిరీ వైస్‌చైర్మన్‌, ఎమ్మెల్యే పర్మార్‌ రాజేంద్రనాథ్‌సిన్హ్‌ పేర్కొన్నారు.

లక్ష లీటర్ల పాలసేకరణే లక్ష్యం
మదనపల్లె సమీపంలోని అమూల్‌ డెయిరీలో చిల్లింగ్‌ యూనిట్‌ను ప్రారంభిస్తున్న అమూల్‌ వైస్‌చైర్మన్‌ రాజేంద్రనాథ్‌ సిన్హ్‌

అమూల్‌ డెయిరీ వైస్‌చైర్మన్‌ రాజేంద్రనాథ్‌


మదనపల్లె టౌన్‌, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం, అమూల్‌ సహకార డెయిరీ సంయుక్తంగా అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నిర్వహిస్తున్న అమూల్‌ డెయిరీని రోజుకు లక్ష లీటర్ల పాలసేకరణ లక్ష్యంగా ముందుకు తీసుకెళతామని గుజరాత్‌ రాష్ట్రం అమూల్‌ సహకార డెయిరీ వైస్‌చైర్మన్‌, ఎమ్మెల్యే పర్మార్‌ రాజేంద్రనాథ్‌సిన్హ్‌ పేర్కొన్నారు. మంగళవారం మదనపల్లె మండలం చిప్పిలి సమీపంలోని అమూల్‌ డెయిరీలో ఆధునుకీకరించిన హెచ్‌వోటీ ప్లాంటును ఏపీ డీడీసీఎఫ్‌ ఎండీ అహ్మద్‌బాబుతో కలసి పునఃప్రారంభించారు. ముందుగా డెయిరీ ఆవరణలో వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠకు పూజలు నిర్వహించిన అమూల్‌ డెయిరీ బోర్డుకు చెందిన ఎండీ అమిత్‌, 11 మంది బోర్డు డైరెక్టర్లు హెచ్‌వోటీ (టెట్రా ప్యాకెట్‌ తయారీ) ప్లాంటును ప్రారంభించారు. దీంతో పాటు టెట్రా ప్యాకెట్‌ ప్యాకింగ్‌, మైక్రోబయాలజీ ల్యాబ్‌, బీఎంసీ యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం అమూల్‌ వైస్‌చైర్మన్‌ రాజేంద్రనాథ్‌సిన్హ్‌ మాట్లాడుతూ గుజరాత్‌లో అమూల్‌ డెయిరీ రోజుకు 35 లక్షల పాలు సేకరిస్తూ రైతుల సహకార సంస్థగా నిలిచిందన్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో సంయుక్తంగా అమూల్‌ డెయిరీని ముందుకు తీసుకెళతామన్నారు.ఏపీ డీడీసీఎఫ్‌ ఎండీ అహ్మద్‌బాబు మాట్లాడుతూ దేశంలోనే పాడిపరిశ్రమకు, నాణ్యమైన పాలకు ఏపీ పేరెన్నికగా వుందని, మహిళా సంఘాలతో అమూల్‌ డెయిరీని నిర్వహిస్తున్నామన్నారు. ఏపీలో అమూల్‌ అడుగు పెట్టాక ఆవు పాలకు రూ.5, బర్రె పాలకు రూ.10 దాకా అధికంగా రైతులకు అందుతోందన్నారు. మదనపల్లె డెయిరీకి లక్ష లీటర్ల చిల్లింగ్‌ చేసే సామర్థ్యం వుందన్నారు. ఇక్కడ హెచ్‌వోటీ ప్లాంటు నుంచి టెట్రా ప్యాకెట్లను ఫిల్లింగ్‌ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ సెంటర్లకు సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో అమూల్‌ డెయిరీ ఎండీ అమిత్‌వ్యాస్‌, 11 మంది డైరెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు తమీమ్‌అన్సారియా, వేంకటేశ్వర్లు, అమూల్‌ డెయిరీ ఏపీ ప్రతినిధి రాజేంద్రప్రసాద్‌, ఆర్డీవో మురళి, పశుసంవర్థకశాఖ జేడీ గుణశేఖర్‌ పిళ్లై తదితరులు పాల్గొన్నారు.

 

Read more