‘గేటు’ కట్టాల్సిందే...

ABN , First Publish Date - 2022-09-12T05:25:13+05:30 IST

జిల్లాలోని మున్సిపాలిటీలలో దినసరి మార్కెట్‌, వారపుసంత, టౌన్‌ గేటు వసూలు చేయడంలో కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

‘గేటు’ కట్టాల్సిందే...
తోపుడు బండి వద్ద నుంచి రూ.20 వసూలు చేస్తున్న స్లిప్పు

మునిసిపాలిటీలలో ఇష్టారాజ్యంగా వసూళ్లు

చిరు వ్యాపారుల దగ్గర దోపిడీ

పట్టించుకోని అధికారులు


జిల్లాలోని మున్సిపాలిటీలలో దినసరి మార్కెట్‌, వారపుసంత, టౌన్‌ గేటు వసూలు చేయడంలో కాంట్రాక్టర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన గెజిట్‌ కంటే రెండు, మూడింతలు ఎక్కువగా వసూలు చేస్తూ చిరు వ్యాపారులు, రైతుల నుంచి దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీని అరికట్టాల్సిన మున్సిపల్‌ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో గేటు వసూలు చేసే కాంట్రాక్టర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారుతోంది. దీనిపైన మార్కెట్‌కు పండించిన కూరగాయలను తీసుకెళ్లే రైతులు, మార్కెట్‌లో కూరగాయలు కొని అమ్ముకుని జీవించే చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


(రాయచోటి - ఆంధ్రజ్యోతి):  

జనాభా పరంగానూ.. విస్తీర్ణం పరంగానూ ఎటు చూసినా.. జిల్లాలో మదనపల్లె మునిసిపాలిటీ పెద్ద మునిసిపాలిటీ. ఇక్కడ రోజూ దినసరి మార్కెట్‌, వారపుసంతలో రైతులు తాము పండించిన కూరగాయలను అమ్ముకుంటారు. ఇక్కడ చిరువ్యాపారులు కూరగాయలు కొని పట్టణంలో తోపుడు బండ్లపైన అమ్ముకుంటారు. మదనపల్లె మున్సిపాలిటీలో దినసరి మార్కెట్‌ వారపు సంతలో చిరు వ్యాపారులు, రైతుల నుంచి కాంట్రాక్టర్లు, సబ్‌ కాంట్రాక్టర్లు ప్రభుత్వం నిర్ణయించిన గెజిట్‌ కంటే మూడింతలు వసూలు చేస్తున్నారు. వీరిపై మున్సిపల్‌, రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు తాము పండించిన కూరగాయలు మార్కెట్‌కు తీసుకొస్తే రైతులు నష్టపోతున్నారు. కాంట్రాక్టర్లు ఈ రెండు విభాగాలకు సంబంధించి ఏడాదికి హక్కు దక్కించుకునే క్రమంలో పోటీపడి ఎక్కువ మొత్తానికి పాడుతున్నారు ఆ మొత్తాన్ని వసూలు చేసుకునే క్రమంలో చిరు వ్యాపారుల నుంచి వసూలు చేస్తున్నారు. 2021-22 ఏడాదిలో దినసరి మార్కెట్‌ 85 లక్షలు వేలం పాడారు. అదే ఈ ఏడాది (2022-23) ఏకంగా రూ.1.12 కోట్లు పలికింది. అదేవిధంగా మంగళవారం జరిగే వారపు సంత గత ఏడాది (2021-22) 29 లక్షలు, ఈ ఏడాది 42.60 లక్షలు పలికింది. జంతు వధశాల గత ఏడాది రూ లక్ష, ఈ ఏడాది రూ.1.63 లక్షలకు పోయింది. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కాంట్రాక్టర్లు తోపుడు బండికి రూ.10-20 వసూలు చేయాల్సి ఉండగా, రూ.30-60 వసూలు చేస్తున్నారు. ఆటో, మినీ ఆటోలకు రూ.100 బదులు, 300-500 రూపాయలు వసూలు చేస్తున్నారు. రాయచోటి మున్సిపాలిటీలో కూరగాయల మార్కెట్‌ వేలం పాట రూ.2 లక్షలు పలికింది. 2023 మార్చి వరకు గడువు ఉంది. వీళ్లు కూరగాయల మార్కెట్‌ పరిధిలోని రోడ్డుపైన కూరగాయలు అమ్ముకునే వ్యాపారుల దగ్గర మాత్రమే గేటు వసూలు చేయాలి. మార్కెట్‌ లోపల వసూలు చేయడానికి వీలు లేదు. అదేవిధంగా బస్టాండు మార్కెట్‌ వేలం పాట రూ.3 లక్షలు పలికింది. వీళ్లు మునిసిపాలిటీ పరిధిలో ఎక్కడైనా గేటు వసూలు చేసుకోవచ్చు. వీరికి కూడా 2023 మార్చి వరకు గడువు ఉంది. దినసరి మార్కెట్‌లో గంపకు రూ.3, మూటకు రూ.5 వసూలు చేయాలి. ఎద్దుల బండిలో మూటకు రూ.5, చదరపు గజానికి రూ.5 వసూలు చేయాలి. మార్కెట్‌ పరిధిలో తోపుడు బండికి రూ.10, లారీలో మూటకు రూ.1, 50 మూటలపైన 0.50 పైసలు, టెంకాయ లారీకి రూ.100 వసూలు చేయాలి. టౌన్‌ గేటు పరిధిలో బస్సుకు రూ.25, జీపునకు రూ.10, బయట లారీకి రూ.100, ట్రాక్టర్‌కు రూ.20, లారీకి రూ.100 చొప్పున వసూలు చేయాలి. అయితే ఈ లెక్కల ప్రకారం కాకుండా రెండు, మూడింతలు ఎక్కువగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరి దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు కానీ బిల్లులు ఇవ్వడం లేదు. పట్టణమంతా తిరిగి తోపుడుబండ్లు, పానీపూరిబండ్లు, గంపలలో అమ్ముకునే వ్యాపారుల దగ్గర ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. సాధారణంగా గేటు వసూలు కాంట్రాక్టర్లు చేయాల్సినప్పటికీ మునిసిపల్‌ అధికారులు దానిని పర్యవేక్షించాలి. కరోనా సమయంలో ఈ ప్రాంత రైతులు, చిరు వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని మునిసిపల్‌ గేటును మునిసిపల్‌ పాలకవర్గం రద్దు చేసింది. ఈ ఏడాది మళ్లీ వేలం పాట నిర్వహించారు. ఇకనైనా మునిసిపల్‌ అధికారులు స్పందించి కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా గేటు వసూలు చేయకుండా చూడాలని రైతులు, చిరు వ్యాపారులు కోరుతున్నారు. 


తోడుపు బండికి రోజుకు రూ.30

- రామకృష్ణ, తోపుడు బండి వ్యాపారి, ఎస్టేట్‌, మదనపల్లె

మదనపల్లె పట్టణంలోని సంత గేటులో తోపుడు బండికి రోజు రూ.30 గేటు వసూలు కడుతున్నాం. మంగళవారం వారపుసంత రోజున రూ.50 గేటు కడుతున్నాం. పట్టణంలోని వీధుల్లో తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటే రూ.20 వసూలు చేస్తున్నారు. రోజూ గేటు వసూలు చేసే వాళ్లు రూ.10 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. 


లాభం వచ్చినా.. నష్టమొచ్చినా గేటు కట్టాల్సిందే

- బాబు, ఆకుకూరల వ్యాపారి, మదనపల్లె

రోజూ ఆకుకూరలు రైతుల దగ్గర తీసుకుని సంత గేటులో అమ్ముతాను. రోజూ రూ.100 గేటు కడతాను. వ్యాపారంలో లాభమొచ్చినా, నష్టమొచ్చినా గేటు మాత్రం కచ్చితంగా కట్టాల్సిందే. ఆకుకూరలు అమ్ముకునే వారికి  రోజుకు రూ.100 గేటు కట్టాలంటే చాలా ఎక్కువ అనిపిస్తోంది. ఎంత కట్టాలో తెలియదు. వాళ్లు చెప్పింది ఇవ్వాల్సిందే. అధికారులు గేటు తగ్గిస్తే బాగుంటుంది. 


నా దృష్టికి ఫిర్యాదు రాలేదు

- రాంబాబు, కమిషనర్‌, రాయచోటి

ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే ఎక్కువ వసూలు చేస్తున్న విషయం ఇంతవరకు నాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. మీ ద్వారానే తెలిసింది. తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటాం.



Updated Date - 2022-09-12T05:25:13+05:30 IST