పెద్దతిప్పసముద్రంలో టెన్షన్‌....టెన్షన్‌

ABN , First Publish Date - 2022-09-09T04:23:21+05:30 IST

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రంలో గురువారం టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

పెద్దతిప్పసముద్రంలో టెన్షన్‌....టెన్షన్‌
మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌కు నోటీసు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులు

అన్నదాన కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం

అడ్డుకునేందుకు పోలీసుల యత్నం...భారీగా మోహరింపు

మరోపక్క భారీగా పోగైన వైసీపీ శ్రేణులు

ఉద్రిక్తతల నడుమ కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌


పెద్దతిప్పసముద్రం/ములకలచెరువు, సెప్టెంబరు 8: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దతిప్పసముద్రంలో గురువారం టెన్షన్‌ వాతావరణం నెలకొంది. అన్నాక్యాంటీన్‌ ఏర్పాటులో భాగంగా ఒక్కరోజు అన్నదానం చేయాలని పార్టీ అధిష్టానం పిలుపు మేరకు తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ పెద్దతిప్పసముద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం బస్టాండు వద్ద భోజనాలు వండించేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఇక్కడ వండేందుకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఓ కార్యకర్త ఇంటి వద్ద భోజనం వండించి బస్టాండుకు తీసుకొచ్చి అన్నదానం చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. నియోజకర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమానికి హాజరయ్యేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే మరోపక్క అన్నదాన కార్యక్రమాన్ని అడ్డుకోవాలని వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ శ్రేణులు కూడా ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో భారీగా పోగయ్యారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు, 50 మంది పోలీసులు మోహరించారు. పోలీసులు అత్యధికంగా టీడీపీ చేపట్టిన అన్నదాన కార్యక్రమం జరిగే బస్టాండులో, మరికొందరు వైసీపీ శ్రేణులు పోగైన ఎంపీడీవో కార్యాలయం వద్దకు చేరుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మధ్యాహ్నం పీటీఎంకు చేరుకున్న తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జి.శంకర్‌యాదవ్‌కు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు యత్నించారు. ఇక్కడ 144 సెక్షన్‌ అమలులో ఉందని ఎలాంటి సమావేశాలు, కార్యక్రమాలు చేపట్టేందుకు వీలు లేదని పోలీసులు నోటీసు అందించేందుకు రాగా శంకర్‌ నిరాకరించారు. అనంతరం ప్రదర్శనగా బస్టాండు వద్దకు చేరుకుని పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ క్రమంలో అన్నదానం చేసేందుకు భోజనం వండిన పాత్రలు తీసుకొస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీనిని ప్రతిఘటించిన కొందరు టీడీపీ కార్యకర్తలు అన్నదాన కార్యక్రమానికి సిద్ధం చేశారు. మాజీ ఎమ్మెల్యే శంకర్‌ 10 మందికిపైగా అన్నదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


పోలీసులు వంట పాత్రలు లాక్కెళ్లారు

మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించి పక్కకు వస్తూనే పోలీసులు అన్నదాన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. కార్యకర్తలు భోజనం వడ్డించకుండా అడ్డుకున్నారు. భోజనం, కూరలు ఉన్న పాత్రలు లాక్కెళ్లారు. ఆటోలో బయట ప్రాంతానికి తీసుకెళ్లారు. పోలీసులతో వారించిన కార్యకర్తలకు కార్యక్రమం నిర్వహించేందుకు అనుమతి లేదంటూ సమాధానం చెప్పారు. ఎలాంటి గొడవలు లేకుండా కార్యక్రమం ముగియడంతో ప్రజలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 





Updated Date - 2022-09-09T04:23:21+05:30 IST