అభివృద్ధి ప్రణాళికపై మొక్కుబడి శిక్షణ
ABN , First Publish Date - 2022-12-15T23:24:08+05:30 IST
గ్రామ పంచాయతీల 2023-24 అభివృద్ధి ప్రణాళికల తయారీపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం మొక్కుబడిగా సాగింది.
100 మంది జడ్పీటీసీ, ఎంపీపీలకు 20 మందే హాజరు
కమిషనర్ ఆదేశాలను పట్టించుకోని అధికారులు
కడప(రూరల్), డిసెంబర్ 15: గ్రామ పంచాయతీల 2023-24 అభివృద్ధి ప్రణాళికల తయారీపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం మొక్కుబడిగా సాగింది. ఈ శిక్షణలో జడ్పీటీసీలు, ఎంపీపీలను భాగస్వామ్యులను చేస్తూ విద్య, వైద్యం, వ్యవసాయం, నీటిసఫరా, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పోషకాహారం తదితర 9 అంశాలపై జిల్లా స్థాయిలో ఒక రోజు శిక్షణ ఇవ్వాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కోన శశిధర్ జడ్పీ, డీపీవో శాఖలను ఆదేశించారు. ఆయన ఆదేశాలను అధికారులు లైట్‌గా తీసుకొన్నారో ఏమో కానీ గురువారం జడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణను మొక్కుబడిగా సాగించారు. జిల్లాలోని 50 మంది జడ్పీటీసీలు, 50 మంది ఎంపీపీలు మొత్తం 100 మంది ఉండగా... కేవలం 20మంది మాత్రమే శిక్షణకు హాజరయ్యారు. అధికారులు జడ్పీటీసీ, ఎంపీపీలకు శిక్షణపై తగు అవగాహన కల్పించకపోవడం తో ఇంత తక్కువ స్థాయిలో హాజరైనట్లు చెప్పుకొస్తున్నారు. వీరిలో కూడా చాలా మంది మధ్యాహ్నం తరువాత శిక్షణకు హాజరు కాలేదు. శిక్షణలో ఆయా శాఖల సమాచారం ప్రజాప్రతినిధులకు తెలియజేయడానికి జడ్పీ వైస్ చైర్మన్ బాలయ్యతో పాటు జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎ.నాగేశ్వరరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి మైఖేల్, జడ్పీ సీఈవో సుధాకర్‌రెడ్డి, డీపీవో ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ డిప్యూటీ సీఈవో రమణారెడ్డి, డీఎల్‌పీవో మస్తాన్‌వల్లి, జడ్పీ డీఎల్‌డీవో వెంకటసుబ్బయ్యతో పాటు మరో ఆరు మంది మాస్టర్ ట్రైనర్లు హాజరైనప్పటికీ శిక్షణలో వినడానికి ప్రజాప్రతినిధులు పెద్దగా లేకపోవడంతో వారు కూడా ఒకటి రెండు మాటలు చెప్పి టకటకా ఓ పనైపోయిందనిపించారు.
అభివృద్ధి ప్రణాళికల తయారీలో భాగస్వాములు కావాలి
జడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య
గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికల తయారీలో జడ్పీటీసీలు, ఎంపీపీలు భాగస్వాములు కావాలని జడ్పీ వైస్ చైర్మన్ పిట్టు బాలయ్య అన్నారు. ఒక్కో గ్రామానికి అవసరాలు వేర్వేరుగా ఉంటాయని, అటువంటి అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు. నీటిసరఫరా, పారిశుధ్య పనులు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు, ఆరోగ్యం, విద్య, పోషకాహారం తదితరాల్లో ఆయా గ్రామాలకు ఏమి అవసరమో గుర్తించి ప్రాధాన్యతను బట్టి సమన్వయంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు.
శిక్షణల పేరుతో లక్షలు ఖర్చు
డీపీఆర్‌సీ భవనంలో నిర్వహించే శిక్షణలకు 30 నుంచి 50 శాతానికి మించి హాజరు కావడం లేదు. కానీ శిక్షణల పేరుతో నిర్వహకులు లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. భోజనం, టీ, బిస్కెట్ తదితర స్నాక్స్, శిక్షణకు అవరమైన మెటీరియల్ పంపిణీ పేరుతో రూ.10ల ఖర్చుకు రూ.20లు చూపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.