ఎస్‌ఆర్‌ పోయి... జేఎ్‌సడబ్ల్యు వచ్చా..

ABN , First Publish Date - 2022-12-13T00:14:08+05:30 IST

రూ.15వేల కోట్లు పెట్టుబడితో 25వేల మందికి ఉపాధి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు. సీఎం పలికిన చిలక పలుకులకు ఈనెల 23కు మూడేళ్లవుతుంది. అయితే ఉక్కు పరిశ్రమ పూర్తి ఏ స్థితిలో ఉందంటే ప్రహరీ మాత్రమే నిర్మించారు. మూడేళ్ల

ఎస్‌ఆర్‌ పోయి... జేఎ్‌సడబ్ల్యు వచ్చా..

ఉక్కు కర్మాగారం శంకుస్థాపనకు మూడేళ్లు

మూడు సంస్థలతో ఒప్పందం

ప్రతిసారీ కొత్తగా ప్రారంభిస్తున్నట్లు కలరింగ్‌, హంగామా

చెల్లికి పెళ్లి చేయాలి మళ్లీ మళ్లీ.. అన్నట్లుగా ఉక్కు ఫ్యాక్టరీపై వైసీపీ వ్యవహారం

‘‘ఎన్నికలకు ఆరు నెలల ముందు ఆ పెద్దమనిషి టెంకాయ కొట్టాడు. ఒకసారి ఆలోచించమని చెబుతున్నా.. ప్రజలు ఐదు సంవత్సరాలు పరిపాలనకు అధికారం ఇస్తారు. అందులో నాలుగున్నర సంవత్సరాల పాలనలో ఏమీ చేయకుండా ఎన్నికలకు ఆరు నెలలకు ముందు టెంకాయ కొడితే మోసం అంటారు.. అదే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు టెంకాయ కొడితే దీనిని చిత్తశుద్ధి అంటారు.. పాలనలో తేడా ఎలా ఉంటుందో ఆలోచించండి.. మూడేళ్లలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేసి ప్రారంభిస్తాం...’’ - ఇదీ సీఎం జగన్‌ 2019 డిసెంబరు 23న పలికిన చిలక పలుకులు.

(కడప - ఆంధ్రజ్యోతి): రూ.15వేల కోట్లు పెట్టుబడితో 25వేల మందికి ఉపాధి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పుకొచ్చారు. సీఎం పలికిన చిలక పలుకులకు ఈనెల 23కు మూడేళ్లవుతుంది. అయితే ఉక్కు పరిశ్రమ పూర్తి ఏ స్థితిలో ఉందంటే ప్రహరీ మాత్రమే నిర్మించారు. మూడేళ్ల కాలవ్యవధిలో మూడు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కటి కూడా ముందడగు పడలేదు. ఇప్పుడు ఎస్‌ఆర్‌ స్టీలు లిమిటెడ్‌ బదులు జేఎ్‌సడబ్ల్యు స్టీల్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. ఇప్పుడేదో కొత్తగా పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్న ప్రతిసారీ హైలెవెల్‌లో కలరింగ్‌.. రాయలసీమ రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పుకురావడం ఆనవాయితీగా మారింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి నెలకొంది. ఉక్కు కర్మాగారం నిర్మాణంలో జగన్‌ సర్కారు చిత్తశుద్ధి చూసి జిల్లా వాసులు ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జేఎ్‌సడబ్ల్యువోకు అప్పగిస్తున్నారు. మరీ ఈ సారైనా పనులు మొదలుపెడతారా లేక ఉక్కుఫ్యాక్టరీ పునాదిరాయికి మూడేళ్లు అంటూ ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను కప్పి పుచ్చడానికి నిర్మాణం జరిగినట్లు కటింగ్‌ ఇస్తారో చూడాల్సి ఉంది.

జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లె - పెద్దదండ్లూరు గ్రామాల సమీపంలో ఏపీ హైగ్రేడ్‌ స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం వైఎస్‌ జగన్‌ 2019 డిసెంబరు 23న ఉక్కుపరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.15వేల కోట్ల వ్యయంతో 30 లక్షల టన్నుల సామర్థ్యం గల స్లీటుప్లాంటు నిర్మిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మందికి ఉపాధి కలగనుంది. స్లీటు ప్లాంటు కోసం 3148.69 ఎకరాలు భూమి కేటాయించారు. రెండు దశల్లో కర్మాగారం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఫేజ్‌-1లో రూ.10082 కోట్లతో మూడుమిలియన్‌ టన్నులు, ఫేజ్‌-2లో ఆరు వేల కోట్లతో మూడు మిలియన్‌ టన్నులు ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటు నిర్మాణం చేపట్టాలనుకున్నారు. టౌన్‌షిప్‌, మౌలిక వసతుల కల్పన పరిశ్రమల నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఫ్యాక్టరీ వస్తే సిమెంటు కర్మాగారంతో వెనుకబడిన రాయలసీమ రూపురేఖలే మారిపోతాయని జనం సాక్షిగా సీఎం జగన్‌ వెల్లడించారు. సీన్‌ కట్‌ చేస్తే.. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జిల్లాకు అచ్చి వచ్చినట్లు లేదు. 2007, జూన్‌ 10న దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జమ్మలమడుగు మండలం అంబవరం వద్ద 10,670 ఎకరాల్లో బ్రాహ్మణ స్టీలు ప్లాంటు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఫ్యాక్టరీ పనులు ప్రారంభించిన గాలి జనార్ధన్‌రెడ్డి ఓబులాపురం అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో జైలుకెళ్లడం, వైఎస్‌ చనిపోవడంతో బ్రాహ్మణి కథ కంచికి చేరింది. రాష్ట్ర విభజన చట్టంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టి మరీ మరిచిన కేంద్రం తీరుకు నిరసనగా అప్పటి టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. దీక్ష విరమింపజేసిన సందర్భంగా ఉక్కు ఫ్యాక్టరీ రాష్ట్రమే నిర్మిస్తుందని నాటి సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు 2018 డిసెంబరు 27న రాయలసీమ స్టీలు అథారిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరిట శంకుస్థాపన చేశారు. అయితే చంద్రబాబు దిగిపోయారు. అయితే జగన్‌ తన తండ్రి వైఎస్‌ శంకుస్థాపన చేసిన బ్రాహ్మణి స్టీలు, చంద్రబాబు శంకుస్థాపన చేసిన రాయలసీమ స్టీలు అథారిటీ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ కాదని జగన్‌ ఏపీ హైగ్రేడ్‌ స్టీలు ప్లాంటు పేరిట శంకుస్థాపన చేశారు. జగన్‌ చె ప్పిన మాట ప్రకారం అయితే ఈ మేరకు స్టీలు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి ముస్తాబు కావాల్సి ఉంది.

మూడేళ్లు .. మూడు సంస్థలు

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే స్టీలు ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే దాన్ని చిత్తశుద్ధి అంటూ జగన్‌ చెప్పుకునేందుకు గాను ఎలాంటి నిధుల కే టాయింపు లేకుండానే శంకుస్థాపన చేశారు. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో స్టీలు ప్లాంటు నిర్మించాలనుకున్నారు. తొలుత లిబర్టీ స్టీలు కంపెనీ ఆసక్తి చూపించింది. 2021 ఫిబ్రవరి 22న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో కూడా లిబర్టీకి అమోదముద్ర వేశారు. తొలివిడతలో 1082 కోట్లు, రెండో విడతలో ఆరు వేల కోట్లుతో నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే ఆ సంస్థ ఆర్థిక వెసులుబాటు లేకపోవడం, ఇతరత్రా కారణాలతో ఆ ఒప్పందం రద్దయింది. గ్లోబల్‌ టెండర్స్‌లో ఎల్‌టుగా నిలిచిన ఎస్‌ఆర్‌ స్టీలు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇప్పుడు ఎస్‌ఆర్‌ కూడా తప్పుకుంది. తాజాగా ముచ్చటగా మూడో సంస్థగా జెఎ్‌సడబ్ల్యూ కంపెనీకి అప్పగించారు. రూ.8800 కోట్లతో నిర్మించనున్నారు. మొదటి దశలో రూ.3300 కోట్లు ఏడాదికి మిలియన్‌ టన్నుల ఉత్పత్తి, రెండో విడత 3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి చేయాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సోమవారం జరిగిన ఎస్‌ఐ డీపీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్లీలు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సీపీఐ పాదయాత్ర మొదలెట్టింది. కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ రాష్ట్ట్రస్థాయి నాయకులు హాజరయ్యారు. టీడీపీ ఇతర ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. క్రిస్మస్‌ సందర్భంగా సీఎం ఈ నెల 23న జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజుకు స్టీలు ఫ్యాక్టరీకి టెంకాయ కొట్టి మూడేళ్లు అవుతుంది. తీవ్ర విమర్శల నేపధ్యంలో ఇప్పుడు మళ్లీ జేఎ్‌సడబ్ల్యు కంపెనీని తీసుకువచ్చారు. ఆ సంస్థ ఎప్పుడు పనులు మొదలుపెట్టనుందనేది సమాచారం లేదు.

Updated Date - 2022-12-13T00:14:13+05:30 IST