ఏడుగురు ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు

ABN , First Publish Date - 2022-07-06T05:46:39+05:30 IST

జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో అంతర్‌రాష్ట్ర స్మగ్లర్‌ ఫకృద్దీన్‌ కూడా ఉన్నాడు. స్మగ్లర్ల వద్ద నుంచి 2 టన్నుల ఎర్రచందనం దుంగలు, నాలుగు కార్లు, రూ.9.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఏడుగురు ‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్టు
స్వాధీనం చేసుకున్న దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ

వారిలో అంతర్‌రాష్ట్ర స్మగ్లర్‌ ఫకృద్దీన్‌ 

రెండు టన్నుల దుంగలు.. 

నాలుగు కార్లు, రూ.9.5 లక్షల నగదు స్వాధీనం 

కడప(క్రైం), జూలై 5: జిల్లాలోని రెండు వేర్వేరు చోట్ల పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో అంతర్‌రాష్ట్ర స్మగ్లర్‌ ఫకృద్దీన్‌ కూడా ఉన్నాడు.  స్మగ్లర్ల వద్ద నుంచి 2 టన్నుల ఎర్రచందనం దుంగలు, నాలుగు కార్లు, రూ.9.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని పెరేడ్‌ మైదానంలో మంగళవారం ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌, ఫ్యాక్షన్‌ జోన్‌ డీఎస్పీ చెంచుబాబు, సబ్‌ డీఎఫ్‌ఓ వివేక్‌, ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాద్‌రావు, మైదుకూరు డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను వెల్లడించారు.

చాపాడు మండలం ఖాదర్‌పల్లికి చెందిన స్మగ్లర్‌ ఫకృద్దీన్‌ అతని అన్న లాల్‌బాషా, మరో సోదరుడు జాకీర్‌, అదే గ్రామానికి చెందిన లతీఫ్‌ ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. వీరు తిరుపతి రామన్‌, శివబాబు మేస్త్రీల ద్వారా తమిళ కూలీలను తెప్పించి లంకమల్ల, శేషాచలం అడవుల్లో పంపించి, ఎర్రచందనం చెట్లను నరికించి ఖాజీపేట, మైదుకూరు ప్రాంతాలలోని రహస్య గోడౌన్‌లో దుంగలు నిల్వ ఉంచేవారు. వీటిని వాహనాల ద్వారా ఢిల్లీకి చెందిన సలీమ్‌, కటికనహల్లికి చెందిన జమీర్‌కు అమ్మేవారు. వాహనాలను దొంగిలించి పోలీసు స్టిక్కర్లు, పోలీస్‌ సైరన్లు బిగించుకొని చెక్‌పోస్టులు, టోల్‌ప్లాజాల నుంచి చాకచక్యంగా తప్పించుకునేవారు. పోలీసులు, ఫారెస్టు అధికారులు వారి వాహనం ఆపేందుకు ప్రయత్నిస్తే ఢీకొట్టి తప్పించుకుంటున్నారు. ఫకృద్దీన్‌, యాసీన్‌, కామరాజు, ఖాజీపేటకు చెందిన నల్లగుండు వీరభద్రుడు, బానావత్‌ గోపినాయక్‌, బోయ అరవిందులు ఎర్రచందనం దుంగలను కార్లల్లో లోడ్‌ చేసుకుని వెళుతున్నట్లు సమాచారం రావడంతో ఫ్యాక్షన్‌ డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ సీఐలు నాగభూషణం, సత్యబాబు, ఆర్‌ఎస్‌ఐ పోతురాజు, ప్రొద్దుటూరు-2 టౌన్‌ సీఐ ఇబ్రహీంల ఆధ్వర్యంలో మంగళవారం ప్రొద్దుటూరు టౌన్‌లోని మడూరులో నిందితులను అరెస్టు చేశారు. అంతర్‌రాష్ట్ర స్మగ్లర్‌ ఫకృద్దీన్‌, అతని అనుచరులైన యాసీన్‌, కామరాజు, గోడౌన్‌ ఓనర్‌ రామ్మోహన్‌రెడ్డి పట్టుబడగా మిగిలినవారు పారిపోయారు. వీరి నుంచి 40 ఎర్రచందనం దుంగలు, రూ.9.5 లక్షల నగదు, మూడు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు.


ఖాజీపేట పరిధిలో

మండలంలోని కొత్తపేట సమీపంలో ఎర్రచందనం చెట్లను అక్రమంగా నరికి వాహనంలో లోడ్‌ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మైదుకూరు రూరల్‌ సీఐ నరేంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఖాజీపేట ఎస్‌ఐ కుళాయప్ప తన సిబ్బందితో దాడి చేసి ఖాజీపేట మండలం పత్తూరుకు చెందిన నల్లగొండు వీరభద్రుడు, ప్రకాశం జిల్లా బల్లికురువ మండలం, కొత్తూరు గ్రామానికి చెందిన బానవత్‌ గోపినాయక్‌, అనంతపురం జిల్లా బోదపల్లి గ్రామానికి చెందిన బోయ అరవిందులను అరెస్టు చేశారు. వీరి నుంచి 15 ఎర్రచందనం దుంగలు, మహింద్ర, మినీగూడ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న స్మగ్లర్లను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.

Updated Date - 2022-07-06T05:46:39+05:30 IST