రమేశ్‌ హత్య కేసులో ఏడుగురి అరెస్టు

ABN , First Publish Date - 2022-12-31T23:17:28+05:30 IST

మదనపల్లె మండలంలోని తాల్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌ పక్కనున్న మామిడితోపులో ఈనెల 26వ తేదీ రాత్రి జంగిటి రమేశ్‌ హత్య కేసులో నిందితులైన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో శుక్రవారం నలుగురిని, శనివారం మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

రమేశ్‌ హత్య కేసులో ఏడుగురి అరెస్టు
గొల్లపల్లెలో గ్రామస్తులతో మాట్లాడుతున్న సీఐ శివాంజినేయులు

మదనపల్లె క్రైం / నిమ్మనపల్లె, డిసెంబరు 31: మదనపల్లె మండలంలోని తాల్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌ పక్కనున్న మామిడితోపులో ఈనెల 26వ తేదీ రాత్రి జంగిటి రమేశ్‌ హత్య కేసులో నిందితులైన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో శుక్రవారం నలుగురిని, శనివారం మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. తాలూకా సీఐ సత్యనారాయణ కథనం మేరకు.. గుండ్లబురుజు గొల్లపల్లెకు చెందిన రమేశ్‌, అతడి అన్న సుబ్రహ్మణ్యం, బెంగళూరుకు చెందిన మంజునాథ్‌లు కుటుంబ గొడవల కారణంగా ఈ ఏడాది మే 31న వెంకట్రమణ అనే వ్యక్తిని హత్య చేశారు. ఈ మేరకు నిమ్మనపల్లె పోలీసులు జూన్‌ 4న ఈ ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. దీంతో వెంకట్రమణ సోదరుడు శ్రీనివాసులు, రమేశ్‌పై కక్ష పెంచుకున్నాడు. శ్రీనివాసులు మండలంలోని చల్లావారిపల్లెకు చెందిన గణేశ్‌లు స్నేహితులు. వీరిద్దరూ కలిసి రమేశ్‌ను హత్య చేసేందుకు పథకం రచించారు. హత్య చేసేందుకు రూ.3 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. గణేశ్‌ లారీడ్రైవర్‌ కావడంతో బాడుగలకు వెళ్లే క్రమంలో కొద్దిరోజుల కిందట సోమలకు చెందిన విష్ణుప్రియ అనే మహిళ పరిచయమైంది. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకుని వెంకట్రమణ హత్య విషయం ఆమెకు చెప్పి సాయం చేయమని కోరాడు. ఈమె తమ బంధువుల మహిళ మదనపల్లె మండలం వేంపల్లెకు చెందిన అపర్ణను గణేశ్‌కు పరిచయం చేసింది. అతడు రమేశ్‌ మొబైల్‌ నెంబర్‌ సేకరించి అపర్ణకు ఇచ్చాడు. దీంతో ఈమె రమేశ్‌కు వాట్సాప్‌ మెసేజ్‌లు పోస్టు చేయడంతో ఇద్దరూ దగ్గరయ్యారు. అయితే రమేశ్‌ తనతో మాట్లాడిన ప్రతిమాటా..ఎప్పటికప్పుడు గణేశ్‌కు చెబుతుండేది. దీంతో అతడు హత్యకు పథకం రచించి ఈనెల 26వ తేదీ రాత్రి రమేశ్‌ను దారుణంగా హత్య చేశారు. కాగా ఈ కేసులో శ్రీనివాసులును అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుల గుట్టు రట్టయింది. ఈ కేసులో శుక్రవారం శ్రీనివాసులు, గణేశ్‌, ధనంజయ, మహ్మద్‌లను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అలాగే శనివారం సాయి, విష్ణుప్రియ, అపర్ణలను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

పోలీస్‌ బందోబస్తు మధ్య అంత్యక్రియలు

మండలంలోని రాచవేటివారిపల్లె పంచాయతీ గొల్లపల్లెకి చెందిన రమేశ్‌ మదనపల్లె మామిడితోపులో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. రమేశ్‌ మృతదేహాన్ని పూడ్చేందుకు గ్రామస్థులు కనీసం గడ్డపార, పారను కూడా ఇవ్వకపోవడంతో దీంతో పోలీసులు శనివారం జేసీబీ సహాయంతో గుంతను తవ్వించి అంత్యక్రియలు పూర్తి చేశారు. సీఐ శివాంజినేయులు, ఎస్‌ఐ ఫాతిమా, పోలీసులు గొల్లపల్లెకు చేరుకుని గట్టి బందోబస్తు మధ్య అంత్యక్రియలను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో సీఐ మాట్లాడుతూ ఘర్షణలకు పాల్పడి హత్యలు జరిగేంత వరకు పగలు పెంచుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దని తెలిపారు. ప్రస్తుతం ఒక హత్యకు బదులు రెండవ హత్య జరిగిందని ఇది ఇలాగే కొనసాగితే ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

Updated Date - 2022-12-31T23:17:29+05:30 IST