మదనపల్లెలో కుంకుమపువ్వు

ABN , First Publish Date - 2022-10-18T04:37:25+05:30 IST

చల్లటి ప్రదేశాల్లో మాత్రమే సాగయ్యే కుంకుమపువ్వు పంటను మదనపల్లెలో సాగు చేస్తున్నారు.

మదనపల్లెలో కుంకుమపువ్వు
ట్రేలలో వికసిస్తున్న కుంకుమపూలు

అగ్రికల్చర్‌ విద్యార్థిని వినూత్న ప్రయోగం

ప్రత్యేక గదిలోని చిల్లింగ్‌ స్టోరేజీలో పంట సాగు


రొటీన్‌కు భిన్నంగా ఆలోచించిన ఆమె.. చేసే పనిలో కొత్తదనం ఉండాలని వినూత్నమైన పంటను ఎంచుకున్నారు. చల్లటి ప్రదేశాల్లో మాత్రమే సాగయ్యే కుంకుమపువ్వు పంటను మదనపల్లెలో సాగు చేస్తున్నారు. తన ఇంటిలోని ఓ గదిలో ఏర్పాటు చేసిన చిల్లింగ్‌ కోల్డ్‌ స్టోరేజీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రేలలో విత్తనాలను నాటారు. ప్రస్తుతం కొన్ని పువ్వులు పూస్తుండగా నవంబరు 20వ తేదీ నాటికి పంట పూర్తిగా చేతికి వస్తుందని నిర్వాహకురాలు శ్రీనిధి చెబుతున్నారు. 


మదనపల్లె, అక్టోబరు 17: హిందువులు పవిత్రంగా భావించే, చల్లటి ప్రదేశాలుగా చెప్పుకునే జమ్ము-కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో మాత్రమే సాగయ్యే కుంకుమపువ్వు పంట మదనపల్లెలో సాగవుతోంది. ఇది వినడానికి ఆశ్చర్యంగానే అనిపించినా పట్టణ శివారు ప్రాంతం చిప్పిలికి చెందిన పుప్పు శ్రీకాంత్‌రెడ్డి, పుప్పు భార్గవి దంపతుల కుమార్తె పి.శ్రీనిధి సాగు చేస్తున్నారు. బెంగళూరు యూనివర్సిటీలో సాయిల్‌ అండ్‌ వాటర్‌ కన్జర్వేటర్‌ (అగ్రికల్చర్‌) బీఎస్పీ పూర్తి చేసిన శ్రీనిధి ఉత్తరప్రదేశ్‌లోని బెనారస్‌ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ, ఎస్వీ యూనివర్సిటీలో అదే విభాగంలో ఏడాది పాటు ఉద్యోగం చేశారు. తర్వాత అగ్రికల్చర్‌లో పీహెచ్‌డీ చేయాలని మొదట అనుకున్నారు. కానీ జీవితంలో ఏదైనా సాధించాలని, తాను ఎంచుకునే ప్రాజెక్టు కూడా రొటీన్‌కు భిన్నంగా ఉండాలని సంకల్పించారు. ఈ క్రమంలో తాను ఎంచుకునే రంగంపై ఏడాది పాటు అన్వేషించి కుంకుమపువ్వు పంటపై దృష్టి పెట్టారు. తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కుంకుమపువ్వు పంట సాగు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయాన్ని తనతో పాటు బెంగళూరు యూనివర్సిటీలో అగ్రికల్చర్‌ బీఎస్సీ చేసిన తన స్నేహితుడు శ్రీకాంత్‌రెడ్డి, తల్లిదండ్రుల సహకారంతో పంట సాగుకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా స్నేహితుడు శ్రీకాంత్‌రెడ్డి సాయంతో జమ్ము-కశ్మీర్‌ నుంచి కుంకుమపువ్వు విత్తనాలు తెప్పించారు. పంట సాగులో జమ్ము-కశ్మీర్‌, హర్యానా యూనివర్సిటీ ప్రొఫెసర్ల నుంచి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు తీసుకుంటూ పంట సాగు చేస్తున్నారు. ఏడాదిలో మూడు నెలల వ్యవధి గల పంటను ఈ ఏడాది ఆగస్టు 20వ తేదీ నాటారు. నవంబరు 20వ తేదీ నాటికి పంట పూర్తి కానుంది. ఈ దశలో అయిదు రోజులుగా మొక్క నుంచి పుష్పాలు వికసిస్తున్నాయి. పంట పూర్తయ్యే నవంబరు 20వ తేదీ వరకూ పుష్పాలు వస్తాయని, వాటిని ఎప్పటికప్పుడు కోస్తూ రేఖలు, అందులోని పుష్ప రేణువులను వేరు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలో మొదటిసారి సాగైన ఈ పంట సక్సెస్‌ కావడంపై శ్రీనిధి, తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవని చెప్పవచ్చు.

జమ్ము-కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పది డిగ్రీల సెల్సియస్‌ నుంచి 25 డిగ్రీల సెల్సియ్‌సలో ఉంటాయి. అలాంటి వాతావరణంలో మాత్రమే కుంకుమపువ్వు సాగవుతుంది. అలాంటి వాతావరణాన్ని ఇక్కడ పంట సాగునకు కల్పించారు. ఈ క్రమంలో తన నివాసంలోని ప్రత్యేక గదిలో చిల్లింగ్‌ కోల్డ్‌ స్టోరేజీని ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన ఆ గదిలో వాతావరణాన్ని ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన పరికరాలతో పరిశీలిస్తూ, ఉష్ణోగ్రతలో ఏమాత్రం తేడా లేకుండా కంటికిరెప్పలా పంటను కాపాడుతున్నారు. హైజినిక్‌ కండీషన్‌లో పాలీయూరేటెడ్‌ ఫైబర్‌, థర్మాకోల్‌ ఇన్సులేషన్‌తో ఇండోర్‌ పద్ధతిలో సాగు చేస్తున్నారు. గాలిలో తేమ ఆధారంగా ఆర్గానిక్‌ పద్ధతిని అవలంభిస్తున్నారు. విత్తనం ఏడు గ్రాములు ఉంటే ఒక పువ్వు, పది గ్రాములు ఆపై ఉంటే రెండు పూలు వస్తాయని శ్రీనిధి చెబుతున్నారు.

240 చ.అ.విస్తీర్ణం గల గదిలో 340 ట్రేలు ఏర్పాటు చేశారు. ఒక్కో ట్రేలో విత్తన పరిమాణాన్ని బట్టి 100 నుంచి 130 విత్తనాలు అమర్చారు. మొత్తం 34 వేల విత్తనాలు నాటగా, 23 వేల పుష్పాలు వస్తాయని వారు అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు శ్రీనిధి చెప్పారు. రోజువారీ కోసిన పుష్పాల నుంచి రేఖలు, స్టిగ్మాను వేరు చేసి కుంకుమపువ్వును పక్కకు తీసి ఆర బెడుతున్నారు. తాము ప్రస్తుతం ప్రయోగాత్మకంగా సాగు చేసిన పంట నుంచి మొదట దశలో 200 గ్రాములు కుంకుమపువ్వు రావచ్చని అంచనా వేస్తున్నారు. కుంకుమపువ్వు ధర మార్కెట్‌లో గ్రాము ధర రూ.500 పలకనుంది. మిగిలిన పసుపు స్టిగ్స్‌, రేఖలను ఇతర అవసరాలైన స్వీట్స్‌, కాస్మొటిక్‌లలో ఉపయోగిస్తారని వారు చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణంలో సంభవించిన మార్పుల నేపథ్యంలో కశ్మీర్‌లో కూడా కొందరు ప్రస్తుతం ఇండోర్‌ విధానాన్ని అమలు చేస్తున్నారని, అక్కడి నిపుణుల సలహాలు తీసుకుంటూ, సాగు విధానంలో అదే పద్ధతినే ఇక్కడా అవలంభిస్తున్నట్లు చెప్పారు. 


కుంకుమపువ్వు అంటే గుర్తొచ్చేది కశ్మీర్‌

- పి.శ్రీనిధి, పంట నిర్వాహకురాలు, మదనపల్లె.

సాధారణంగా కుంకుమపువ్వు అనగానే ప్రతి ఒక్కరికీ కశ్మీర్‌ గుర్తొస్తుంది. చల్లటి వాతావరణం ఉన్న మదనపల్లెలో ఎందుకు సాగు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అందుకు మార్గాలను, సాంకేతికను తెలుసుకున్నా. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలలోనూ అతి తక్కువగా సాగు చేస్తున్న వారి కంటే కూడా కుంకుమపువ్వును పండించడం ద్వారా లాభం పొందడం ముఖ్యం కాదు. వాటి విత్తనాలు ఉత్పత్తి చేయాలన్నదే నా ప్రధాన సంకల్పం. ఈ పంటను సాగు చేసే రైతులు అక్కడ కుంకుమపువ్వును దేవుడితో సమానంగా చూస్తారు. పవిత్రంగా ఉంటూ స్నానం చేసిన తర్వాతే పొలంలోకి వెళతారు. ఇక్కడా నేను అదే విధానాలను పాటిస్తున్నా. ప్రొడక్ట్‌ బయటకు వచ్చాకే కంపెనీ రిజిస్ర్టేషన్‌, తదితర అనుమతులు తీసుకోవాలని భావిస్తున్నా. ఈ పంట సాగు కోసం జమ్మూ-కశ్మీర్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌, ఢిల్లీ వెళ్లాను. ఇందులో కశ్మీర్‌, హర్యానా, అలహాబాద్‌ యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా నా తల్లిదండ్రులు, నా స్నేహితుడు, వారి తల్లిదండ్రుల సహకారం మరువలేనిది.



Updated Date - 2022-10-18T04:37:25+05:30 IST