ఆర్టీసీ బస్సు ఢీ - ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2022-09-28T05:28:11+05:30 IST

కడప-తాడిపత్రి జాతీయ రహదారిలోని యర్రగుంట్ల-కమలాపురం మార్గమధ్యంలో పందిళ్లపల్లె సమీపాన ఉన్న మలుపు వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

ఆర్టీసీ బస్సు ఢీ - ఇద్దరు మృతి
ప్రమాదంలో మృతిచెందిన వేణుగోపాల్‌రెడ్డి

కమలాపురం రూరల్‌, సెప్టెంబరు 27 : కడప-తాడిపత్రి జాతీయ రహదారిలోని యర్రగుంట్ల-కమలాపురం మార్గమధ్యంలో పందిళ్లపల్లె సమీపాన ఉన్న మలుపు వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఒకరు సంఘటనా స్థలం వద్ద మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.... ప్రొద్దుటూరు డిపోకు చెందిన ఏపీఎ్‌స ఆర్టీసీ అద్దె బస్సు ఎర్రగుంట్ల వైపు నుంచి కమలాపురం వైపునకు వస్తోంది. అదే సమయంలో కమలాపురం నుంచి ద్విచక్రవాహనం పై ఇద్దరు వ్యక్తులు ఎర్రగుంట్ల వైపు వస్తున్నారు. పందిళ్లపల్లె సమీపాన ఉన్న మలుపు వద్దకు రాగానే బస్సు డ్రైవర్‌ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో  ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరిలో ఒకరు సంఘటనా స్థలం వద్దనే మృతి చెందారు. మరో వ్యక్తి కాలు పూర్తిగా తెగిపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా వీరు సిద్ధవటం మండలం మాచుపల్లెకు చెందిన నారపురెడ్డి వేణుగోపాల్‌రెడ్డి (40), అయ్యవారురెడ్డి (36)గా గుర్తించామని ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  

Read more