స్పందన అర్జీలను గడువు లోపు పరిష్కరించాలి
ABN , First Publish Date - 2022-10-18T05:04:41+05:30 IST
స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీల పట్ల నిర్లక్ష్యం చేయకుండా... గడువు లోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.
జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా
రాయచోటి(కలెక్టరేట్), అక్టోబరు 17: స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీల పట్ల నిర్లక్ష్యం చేయకుండా... గడువు లోపు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో ప్రజా సమస్యల పరిష్కారవేదిక స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సత్యనారాయణ, డ్వామా పీడీ మద్దిలేటి, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ జయరాజ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రసాలకోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి వస్తున్నారన్నారు. అధికారులు బాధితుల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను శనివారం లోపు క్లియర్ అయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం స్పందన అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో జీవో నెంబరు 69 జారీ చేసిందన్నారు. ప్రతి అధికారి ఈ జీవోను స్పష్టంగా చదివి... మార్గదర్శకాలను అనుసరించి సమస్యలు పరిష్కరించాలన్నారు.