రిజిస్ట్రేషన్‌ బాదుడు

ABN , First Publish Date - 2022-03-16T05:42:47+05:30 IST

రిజిస్ట్రేషన్‌ బాదుడు

రిజిస్ట్రేషన్‌ బాదుడు
రాయచోటిలో వెంచర్ల వద్ద కొనుగోలుదారులు

సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల వారీగా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ విలువ పెంపు

నివేదికలు సిద్ధం చేసిన అధికారులు

20-100 శాతం పెరిగే అవకాశం

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో 250 శాతం...

జిల్లా ప్రజలపై రూ.150 కోట్ల అదనపు భారం

ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి


స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ విలువను ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెంచేస్తోంది. ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అడ్డదిడ్డంగా జనంపై భారం వేస్తూ 20 నుంచి 100 శాతం పెంచనుంది. ఇప్పటికే జిల్లా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు పెరిగిన రేట్లతో నివేదిక ప్రభుత్వానికి పంపారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన స్థిరాస్తి విలువ వల్ల ఆస్తుల కొనుగోలుదారులపై సరాసరి రూ.150 కోట్ల అదనపు భారం తప్పదు. రిజిస్ర్టేషన్‌ ధర పెరుగుతోందని తెలిసి.. ఒకటి రెండు సెంట్లు స్థలం కొనుగోలు చేసిన సామాన్యులు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రైతులు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాలకు వెళితే.. లేనిపోని కొర్రీలు పెట్టి రిజిస్ట్రేషన్‌ చేయడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. ఆ వివరాలపై ప్రత్యేక కథనం. 

కడప-ఆంధ్రజ్యోతి/కలెక్టరేట్‌: జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, రాజంపేట రెవిన్యూ డివిజన్ల పరిధిలో 18 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. రోజుకు సరాసరి 400 నుంచి 500లకు పైగా వివిధ రకాల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ చార్జి, నిర్ధారించిన స్థిరాస్తి విలువపై 7.5 శాతం స్టాంప్‌ డ్యూటీ రూపంలో ఏటా రూ.300 కోట్ల వరకు రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరుతోంది. ఏటేటా రిజిస్ట్రేషన్‌ విలువ పెంచడం సాధారణమే. అయితే.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అడ్డదిడ్డంగా పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పారదర్శకత ఏమాత్రం పాటించకపోవడం వల్ల స్థిరాస్తి కొనుగోలుదారులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఆగస్టు నెలలో భూములు, స్థలాలు, భవనాలు.. వంటి స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ విలువ 10-20 శాతం పెంచేవారని, తాజాగా క్రయ విక్రయాలు జరిగే ప్రాంతాలను గుర్తించి.. అక్కడ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 20 నుంచి 100 శాతం పెంచాలని ప్రభుత్వమే ఆదేశాలు ఇచ్చిందని.. ఆ మేరకే నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపామని ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ పేర్కొనడం గమనార్హం. 

ఏదీ పారదర్శకత..?:

స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ విలువ పెంచాలంటే సంబంధింత సబ్‌ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి. ఆయా ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి, రవాణా, పారిశ్రామిక ప్రగతి, నివాస కాలనీల విస్తరణ.. వంటివి పరిగణలోకి తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్‌ విలువపై ఎంత పెంచాలో పారదర్శకంగా నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు విరుద్ధంగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లోనే కూర్చుని గత ఏడాది కాలంగా జరిగిన డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్ల ఆధారంగా విలువ పెంచేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. 2007లో ఆనాటి జిల్లా రిజిస్ట్రార్‌ శ్రీనివాసమూర్తి వీధి వీధినా తిరిగి ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి, మౌలిక వసుతలను లెక్కకట్టి భూములు ధరలు పెంచారని, తాజాగా అలాంటి ప్రక్రియ చేయకుండానే భారీగా ధరలు పెంచి ప్రభుత్వానికి సిఫారసు చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 

జిల్లా వాసులపై రూ.150 కోట్ల భారం

కడప అర్బన్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం పరిధిలో వైవీ స్ట్రీట్‌ ఏరియాలో భూమి, ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ విలువ ప్రస్తుతం చదరపు గజం రూ.64,500 ఉంటే రూ.71,500లకు పెంచారు. రూ.7 వేలు పెరిగింది. ఈ ప్రాంతంలో సెంటు (48.4 చదరపు గజాలు) స్థలం రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే రూ.25 వేలు స్టాంప్‌ డ్యూటీ రూపంలో ఆదనపు భారం భరించక తప్పదు. ఐటీఐ సర్కిల్‌ ఏరియాలో చదరపు గజం రూ.9,700 నుంచి రూ.19 వేలకు పెంచారు. అంటే.. చ.జగంపై రూ.9,300 పెరిగింది. ఇక్కడ కూడా సెంటు స్థలం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలంటే స్టాంప్‌ డ్యూటీ రూపంలో రూ.33,759 రిజిస్ట్రేషన్‌దారులు భరించక తప్పదు. వాటర్‌గండి ప్రాంతంలో చ.గజం రూ.2,700 నుంచి రూ.4,800లకు పెంచారు. అంటే.. దాదాపు వంద శాతం పెంచేశారు. పుట్లంపల్లె ప్రాంతంలో రూ.3 వేల నుంచి రూ.5 వేలు, ఏపీహెచ్‌ఎ్‌స కాలనీ ఏరియాలో రూ.2,500 నుంచి రూ.4,250 లకు రిజిస్ట్రేషన్‌ విలువ పెంచారు. కడప నగరంలో ఒక్కటే కాదు.. రాజంపేట, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు.. ఇలా అన్ని ప్రాంతాల్లో ఇబ్బడిముబ్బడిగా స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌ విలువ పెంచడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం ఏటా రూ.300 కోట్ల వరకు రిజిస్ట్రేషన్‌ ఆదాయం వస్తుంది. రిజిస్ట్రేషన్‌ భూముల విలువ 20-100 శాతం వరకు పెరిగిందని రిజిస్ట్రేషన్‌ అధికారులే అంటున్నారు. సగటున 50 శాతం లెక్కించినా ప్రజలపై ఆదనంగా రూ.150 కోట్లు భారం తప్పదు. జగన్‌ ప్రభుత్వం ఓవైపు సంక్షేమ పథకాల పేరుతో పంపకాలు చేస్తూ.. మరోపక్క ఖజానాను నింపుకోవడానికి ఇలా అన్నింటి ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

రాయచోటిలో 250 శాతం పెంపు

రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటుకు జనవరి 24న రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాయచోటి జిల్లా కేంద్రం అవుతుందని తిరుపతి, కడప, పులివెందుల, కదిరి, తాడిపత్రి తదితర ప్రాంతాలకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రాయచోటిలో వాలిపోయారు. గత డిసెంబరు నెలలో రూ.25 లక్షలు పలికిన ఎకరం భూమి ఏకంగా రూ.1.5-2 కోట్లకు చేరింది. రింగ్‌ కూడళ్లలో రూ.5-6 కోట్లకు చేరింది. ప్రభుత్వం కూడా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తరహాలో భూముల రిజిస్ట్రేషన్‌ విలువ పెంచి ఖజానా నింపుకోవాలనే ముందుకు వెళుతోంది. కొత్త జిల్లా కేంద్రంలో ఇల్లు కట్టుకోవాలనుకునే సామాన్యుల కల కలగానే మిగులుతోంది. ప్రస్తుత రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం చదరపు గజం కనిష్టంగా రూ.2,200 ఉంటే గరిష్టంగా రూ.8,500 వరకు ఉందని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి తెలిపారు. ప్రభుత్వం 250 శాతం వరకు పెంచమని సూచించింది. ఈ లెక్కన చదరపు గజం కనిష్టంగా రూ.6-7 వేలు, గరిష్టంగా రూ.25 వేలకు పైగా చేరుతోంది. గరిష్ట ధర ప్రకారం చ.గజంపై రూ.17 వేలకు పైగా పెరుగుతోంది. తాజాగా ఒక సెంటు (48.4 చ.గజాలు) రిజిస్ట్రేషన్‌ చేస్తే స్టాంప్‌ డ్యూటీ రూ.29 వేలు వస్తుంది. పెరిగే ధరల ప్రకారం రూ.90 వేలు అవుతుంది. ఈ లెక్కన రూ.70 వేలు అదనపు భారం భరించాల్సి వస్తుంది. ఐదు సెంట్లు నివాస స్థలం కొనుగోలు చేయాలంటే రిజిస్ట్రేషన్‌ స్టాంపు డ్యూటీ రూపంలో రూ3.55 లక్షలు వరకు భరించక తప్పదు. వామ్మో..! ఇవేమి రిజిస్ట్రేషన్‌ ధరలు అంటూ సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రభుత్వం పునరాలోచించాలి 

అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఎంపిక చేయడం అభినందనీయం. జిల్లా కేంద్రంలో సొంత ఇల్లు కుట్టకోవాలని ప్రతి ఒక్కరూ నాలుగైదు సెంట్లు స్థలం కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. కొత్త జిల్లా కావడంతో భూముల రిజిస్ట్రేషన్‌ విలువ ఏకంగా 250 శాతం పెంచాలనే ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు. ఐదు సెంట్లు స్థలం కొనుగోలు చేస్తే పెరిగే భూముల విలువ ప్రకారం రిజిస్ట్రేషన్‌ స్టాంప్‌ డ్యూటీ రుసుం రూ.3.55 లక్షలు అదనంగా భరించాల్సి వస్తుంది. కొత్త జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే బయటి వ్యక్తులు ఇక్కడికి రావాలి. వారికి ప్రోత్సాహకరంగా స్థిరాస్తుల రిజిస్ర్టేషన్‌ విలువ ఉండాలి. ఏటేటా రిజిస్ట్రేషన్‌ విలువ పెంచడం సహజమే. ఏకంగా 250 శాతం పెంచాలనుకోవడం సామాన్యులపై మోయలేని భారం వేయడమే. ప్రభుత్వం పునరాలోచించాలి. 

- కె.శివశంకర్‌, కొత్తపేట రామాపురం, రాయచోటి


ప్రభుత్వానికి నివేదిక పంపాం 

- గిరిబాబు, డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ, కడప

ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో 18 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో భూములు, స్థలాల రిజిస్ట్రేషన్‌ విలువను పెంచాం. ఆ నివేదికను ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పెరిగిన విలువ ప్రకారం స్టాంప్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. Read more