పని ఒత్తిడి తగ్గించండి

ABN , First Publish Date - 2022-12-31T23:22:38+05:30 IST

జిల్లాలో పనిచేస్తున్న వీఆర్‌వోలకు పని ఒత్తిడి ఎక్కువైందని, వెంటనే దానిని తగ్గించాలని శనివారం కలెక్టర్‌ పీఎస్‌ గిరీషాకు వినతిపత్రం అందజేశారు. నాలుగు నెలల కాలంలో గ్రామ వీఆర్‌వోలపై పని ఒత్తిడి ఎక్కువ అవ్వడమే కాక వారిపై తమరు సస్పెన్షన్‌ వేటు వేశారని వారు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు.

పని ఒత్తిడి తగ్గించండి
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న వీఆర్‌వోలు

కలెక్టర్‌కు విన్నవించుకున్న వీఆర్‌వోలు

రాయచోటి (కలెక్టరేట్‌), డిసెంబరు 31: జిల్లాలో పనిచేస్తున్న వీఆర్‌వోలకు పని ఒత్తిడి ఎక్కువైందని, వెంటనే దానిని తగ్గించాలని శనివారం కలెక్టర్‌ పీఎస్‌ గిరీషాకు వినతిపత్రం అందజేశారు. నాలుగు నెలల కాలంలో గ్రామ వీఆర్‌వోలపై పని ఒత్తిడి ఎక్కువ అవ్వడమే కాక వారిపై తమరు సస్పెన్షన్‌ వేటు వేశారని వారు కలెక్టర్‌కు విన్నవించుకున్నారు. గ్రామంలో జరుగుతున్న సర్వే కోసం తమ సొంత డబ్బులు పెట్టి సర్వే చేస్తున్నా అధికారులు ఆ విషయాన్ని గుర్తించకుండా మాపై సస్పెన్షన్లు, షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం దారుణమని అన్నారు. పని ఒత్తిడి ఎక్కువై చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారని వీఆర్‌వోలపై ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై కలెక్టర్‌ మాట్లాడుతూ రాజంపేట, మదనపల్లె, రాయచోటి, పీలేరు ప్రాంతాల్లో భూకబ్జాలు జరుగుతున్నాయని నా దృష్టికి రావడంతో నేను వీఆర్‌వోలపైన చర్యలు తీసుకున్నాను తప్ప ఇందులో నా వ్యక్తిగతమేమి ఉండదని స్పష్టం చేశారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత మీపైనే ఉందని స్పష్టం చేశారు. ఎవరు ఏమి చెప్పినా మీ విధి నిర్వహణను మీరు సరిగ్గా నిర్వహించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో రాజంపేట, రాయచోటి, పీలేరు నుంచి వచ్చిన వీఆర్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:22:40+05:30 IST