బెల్లం కొనుగోళ్లపై సమాచారం ఇవ్వండి
ABN , First Publish Date - 2022-05-14T05:30:00+05:30 IST
పెద్దమొత్తంలో బెల్లం కొనుగోళ్లపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ రవిమనోహరాచారి దుకాణాదారులకు సూచించారు.
మదనపల్లె క్రైం, మే 14: పెద్దమొత్తంలో బెల్లం కొనుగోళ్లపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ రవిమనోహరాచారి దుకాణాదారులకు సూచించారు. శనివారం తాలూకా పోలీ్‌సస్టేషన్‌లో పట్టణంలోని ట్రేడర్స్, హోల్‌సేల్ దుకాణాదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె పరిసర ప్రాంతాలకు చెందిన తాం డావాసులు పట్టణంలో బెల్లం తీసుకెళ్లి సారా తయారీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణ చేయగా, వాస్తవాలు వెలుగులోకి వచ్చాయన్నారు. బెల్లం విక్రయాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా దుకాణంలో రిజిష్టర్ నిర్వహించాలన్నారు. పది కేజీలకు మించి కొనుగోలు చేసేవారి మొబైల్‌నంబర్, ఆధార్, ఇంటి చిరునామా అందులో నమోదు చేయాలన్నారు. అదే విధంగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అయితే గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాలు సాగిస్తూ సారా తయారీని ప్రోత్సహిస్తే దుకాణాదారులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిబంధనల మేరకు వ్యాపారాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈబీ డీఎస్పీ రాధాకృష్ణ, టూటౌన్ సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ చంద్రశేఖర్, సిబ్బంది, వ్యాపారులు పాల్గొన్నారు.