చెరువు మట్టి అక్రమ దందా

ABN , First Publish Date - 2022-10-03T05:30:00+05:30 IST

రువుల్లోని మట్టి కొందరు అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తోంది. అక్కడి మట్టిని అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు.

చెరువు మట్టి అక్రమ దందా
గుంతలమయమైన జిల్లెల్లమడుగు చెరువు

జిల్లెల్లమడుగు చెరువులో అక్రమ తవ్వకాలు

వందలాది ట్రాక్టర్లతో మట్టి దోపిడీ

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇటుక బట్టీలు

రెవెన్యూ అధికారుల హెచ్చరికలు బేఖాతర్‌....


రైల్వేకోడూరు (రూరల్‌), అక్టోబరు 3: చెరువుల్లోని మట్టి కొందరు అధికార పార్టీ నాయకులకు కాసులు కురిపిస్తోంది. అక్కడి మట్టిని అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని రైతులు, ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారం మనది ఎవరొచ్చినా భయం లేదు అంటూ కొందరు అధికార పార్టీ నాయకులు చెరువుల్లో మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. కొందరు నాయకుల భూదాహానికి మండలంలోని చెరువులు కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే... ఓబులవారిపల్లె మండలంలోని జిల్లెల్లమడుగు చెరువు విస్తీర్ణం సుమారు 300 ఎకరాలు ఉంటుంది. జిల్లెల్లమడుగు చెరువు నుంచి వచ్చే నీరు ద్వారా సమీపంలో ఉండే గ్రామాల రైతులు వందల ఎకరాల్లో వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు ఆ చెరువులో ఉండే మట్టిని తవ్వడం వలన నీరు పొలాలోకి చేరుతుందో లేదో అనేది ప్రశ్నార్థకంగా మారింది. చెరువుకు ఉన్న తూములో నుంచి నీరు వస్తేనే రైతులు వ్యవసాయం చేస్తారు. నీరు అందకపోతే వందల ఎకరాలు బీడు భూములుగా మారే పరిస్థితి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. రోజూ వందలాది ట్రాక్టర్ల ద్వారా చెరువు మట్టిని తరలిస్తున్నా ఏ అధికారి పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత చెప్పిందే వేదంగా అధికారులు పనిచేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికే చెరువు నుంచి వందలాది ట్రాక్టర్ల మట్టిని సమీపంలో ఉన్న ఇటుక బట్టీలకు తరలించినట్లు సమాచారం. మండలంలో రోజురోజుకు ఇటుక బట్టీలు అనుమతులు లేకుండా పుట్టుకొస్తుంటే అధికారులు ఏమి చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక ట్రాక్టర్‌ మట్టి 3 వేల రూపాయల నుంచి 5 వేల రూపాయలకు మాఫియాదారులు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇరిగేషన్‌ అధికారులు స్పందించడం లేదని రెవెన్యూ అధికారులు పై అధికారులకు ఫిర్యాదు చేసినా ఏ అధికారి పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని లేనిపక్షంలో జిల్లెల్లమడుగు చెరువు వద్ద ఉన్న భూములు బీడుగా మారుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సంఘటనపై ఇరిగేషన్‌ అధికారుల వివరణ కోసం ప్రయత్నించగా ఓబులవారిపల్లె ఇరిగేషన్‌ ఏఈగా ఇంతవరకు ఎవరూ బాధ్యతలు తీసుకోలేదు. ఇన్‌చార్జ్‌ ఇరిగేషన్‌ అధికారిగా కోడూరు డీఈ ఉన్నారు. ఆయన కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌ చేయగా ఎటువంటి సమాధానం లేదు.


కేసులు నమోదు చేశాం

- పీర్‌మున్ని, తహసీల్దార్‌, ఓబులవారిపల్లె.

రైతులు, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించి జిల్లెల్లమడుగు చెరువు వద్ద మట్టిని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్‌ను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసి ఇరిగేషన్‌ అధికారులకు సమాచారం ఇచ్చాం. అనుమతులు లేని ఇటుక బట్టీలపై చర్యలు తీసుకోవాలని వీఆర్‌వోకు ఆదేశాలు జారీ చేశాం. హెచ్చరికలు జారీ చేసినా మట్టిని తరలిస్తున్నారని సమాచారం రావడంతో మట్టిని తరలిస్తున్న వారిపై స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. జిల్లెల్లమడుగులో జరిగిన అక్రమ మట్టి తరలింపుపై సమగ్ర నివేదికను పై అధికారులకు పంపించాను.Read more