బొప్పాయి ధర ఊగిసలాట
ABN , First Publish Date - 2022-09-06T04:59:43+05:30 IST
ఇటు వ్యాపారులు, అటు దళారులు కలసి బొప్పాయి ధరలతో ఆటాడుకుంటున్నారు. దీంతో బొప్పాయి ధరలు ఊగిసలాడుతున్నాయి.
టన్ను ధర రూ.9 వేలకు తగ్గిస్తామని వ్యాపారులు
రూ.10,500 కొనసాగించాలని రైతుల పట్టు
కొలిక్కిరాని చర్చలు, లారీలను అడ్డుకుని నిరసన
మదనపల్లె పీలేరు, కలికిరి ప్రాంతాల్లో టన్ను రూ.18 వేలు
రైల్వేకోడూరు, సెప్టెంబరు 5: ఇటు వ్యాపారులు, అటు దళారులు కలసి బొప్పాయి ధరలతో ఆటాడుకుంటున్నారు. దీంతో బొప్పాయి ధరలు ఊగిసలాడుతున్నాయి. మొదట కోతల సమయంలో టన్ను బొప్పాయి ధర రూ.18 వేల నుంచి రూ.16 వేల వరకు ధరలు ఫలికాయి. దిగుబడులు తక్కువగా ఉన్నా ధరలు బాగా ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే క్రమేణా వ్యాపారులు టన్ను ధర రూ.15,000, 14,000, 13,000, 12,000, 11,000, 10,500 తగ్గిస్తూ వచ్చారు. తోటల్లో కాయలు మాగిపోతున్నాయని వ్యాపారులు చెప్పిన ధరకే వేస్తూ వచ్చారు. అయితే మళ్లీ ధరలు తగ్గించాలని వ్యాపారులు చెప్పడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. రెండు రోజుల నుంచి ధరల విషయంగా చర్చలు జరుగుతున్నాయి. దీంతో వ్యాపారులు టన్ను ధర రూ.9 వేలు చేయాలని నిర్ణయించారు. దీంతో రైతులు అందుకు అంగీకరించకుండా సోమవారం బొప్పాయి లారీలను ఓబనపల్లె వద్ద అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. రైతులు టన్ను ధర రూ.10,500 కొనసాగించాలని డిమాండు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లె, పీలేరు, కలికిరి ప్రాంతాల్లో బొప్పాయి కాయల ధరలు టన్ను రూ.18 వేలు ఉన్నాయని రైతులు తెలిపారు. కాయలు కాటాపై పెట్టిన వెంటనే రైతులకు డబ్బులు ఇస్తున్నారని చెబుతున్నారు. రైల్వేకోడూరులో అందుకు భిన్నంగా ఉంది. ఇతర రాష్ట్రాల్లో బొప్పాయి కాయలకు మంచి డిమాండు, ధరలు ఉన్నా అక్కడ లేవని, కూలీలు దొరకడం లేదన్న సాకు చూపి వ్యాపారులు ధరలను తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ధరలు తగ్గించడంతో కోతలు సక్రమంగా కోయకపోవడంతో కాయలు మాగిపోతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైల్వేకోడూరు, చిట్వేలి, పెనగలూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట తదితర మండలాల నుంచి రోజూ వంద లారీల్లో బొప్పాయి కాయలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. రైతులకు కావాల్సిన మద్దతు ధర లభించడం లేదు. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక వడ్డీలకు వడ్డీలు పెరుగుతున్నాయి. ఇలా ధరలు ఉంటే ఎందుకు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బొప్పాయికి ఉన్నంత డిమాండ్ ఏ కాయలకు లేవని రైతులు చెబుతున్నారు. అయితే ఇక్కడి వ్యాపారులు దళారుల మాట విని ధరలు తగ్గిస్తున్నారని రైతులు చెబుతున్నారు. దిల్లీ, ముంబయ్, చెన్నై, బెంగళూరు, ఆగ్రా, కేరళ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బొప్పాయి కాయలను ఇష్టపడి తింటారు. బొప్పాయి పండ్లు కూడా మంచి ధరలు ఉన్నాయి. మార్కెట్‌లో విపరీతంగా అమ్మకాలు సాగుతున్నాయి. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను నట్టేట ముంచేస్తున్నారని పలువురు రైతులు అంటున్నారు. టన్ను బొప్పాయి ధర రూ.10,500 చేయాలని రైతులు పట్టుపడుతున్నారు.
రైతుల దగ్గరే కాయలను కొనుగోలు చేయాలి
- సుగవాసి శివశంకర్, రైతు, నేతివారిపల్లె, చిట్వేలి మండలం
వ్యాపారులు నేరుగా రైతుల దగ్గరే బొప్పాయి కాయలను కొనుగోలు చేయాలి. అప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. బొప్పాయి కాయలకు డిమాండ్ ఉన్నా ఇక్కడి వ్యాపారులు ధరలను తగ్గించి వేస్తున్నారు. కాయల కొనుగోలు విషయంలో దళారులు మధ్య లో ఉండి రైతులను నాశనం చేస్తున్నారు. దళారీ వ్యవస్థను పూర్తిగా లేకుండా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రైతులను బాగు చేయాలంటే దళారీ వ్యవస్థ లేకుండా పోవాలి. రైతుల నుంచి నేరుగా వ్యాపారులు ధరలు మాట్లాడుకుని కోతలు చేస్తే రైతులు బాగుపడతారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్
- కంచిరాజు రామరాజు, మాధవరంపోడు, రైల్వేకోడూరు మండలం, రైతు
అంతర్జాతీయ మార్కెట్‌లో బొప్పాయికి మంచి డిమాండ్ ఉంది. లక్షలాది రూపాయలు వెచ్చించి తోటలను సాగు చేస్తే తీరా మంచి డిమాండ్ సమయంలో కాయల ధరలను తగ్గించి వేస్తున్నారు. దళారులు, వ్యాపారులు కలసి ధరల నాటకం ఆడుతున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని దళారుల వ్యవస్థ లేకుండా చేయాలి. అప్పుడే రైతులు బాగుపడతారు. నిత్యం కష్టించి పండ్ల తోటలను సాగు చేస్తే తీరా అమ్ముకునే సమయంలో దళారులు గద్దల్లా వచ్చి తన్నుకుపోతున్నారు.
