వైసీపీ ప్రభుత్వంలో దివాళా దిశలో పంచాయతీలు

ABN , First Publish Date - 2022-10-08T05:03:10+05:30 IST

పంచాయతీల అభివృద్ది కోసం కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే, వాటిని వైసీసీ ప్రభుత్వం నవరత్నాలకు మళ్లించడంతో రాష్ట్రంలో పంచాయతీలు దివాళా దిశలో ఉన్నాయని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వంలో దివాళా దిశలో పంచాయతీలు

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి


ప్రొద్దుటూరు క్రైం, అక్టోబరు 7 : పంచాయతీల అభివృద్ది కోసం కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే, వాటిని వైసీసీ ప్రభుత్వం నవరత్నాలకు మళ్లించడంతో రాష్ట్రంలో పంచాయతీలు దివాళా దిశలో ఉన్నాయని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షులు మల్లెల లింగారెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ 2019 నుంచి నాలుగేళ్లుగా రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసు ప్రకారం పంచాయతీలకు ఇవ్వాల్సిన వాటా ఏడాదికి రూ.200 కోట్లు వంతున రూ.800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోగా, కేంద్రం పంచాయతీల అభివృద్ధి కోసం 14, 15 ఆర్థిక సంఘం విడుదల చేసిన రూ.7660 కోట్లు నిధులు మళ్లించి, నవరత్నాలకు వినియోగించిందన్నారు. దీంతో పంచాయతీ వ్యవస్థ సర్వనాశనం అయిందన్నారు. అయా పంచాయతీల సర్పంచుల సంతకం, పంచాయతీలో తీర్మానం లేకుండా దొంగచాటుగా జగన్‌ సర్కార్‌ పంచాయతీ నిధులు దోచేసిందన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండు చేశారు. చాలా పంచాయతీల్లో నిధులు లేక రోడ్లపై గుంతలు పూడ్చలేని స్థితిలో ఉండటాన్ని బట్టి రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీస్తోందని చెప్పవచ్చన్నారు. ప్రస్తుతం సర్పంచులు అధికారాలు, నిధులు లేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారన్నారు. గడచిన మూడేళ్లుకు సంబంధించి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు రూ.2920 కోట్లు నిలిచిపోయాయని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి సర్పంచులకు విలువ లేకుండా చేసిన ఘనత జగన్‌ సర్కార్‌దే అన్నారు. వెంటనే 14, 15 ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు వెనక్కి ఇవ్వడంతో పాటు రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రూ.800 కోట్లు కూడా పంచాయతీలకు చెల్లించాలని లింగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. సమావేశంలో బీసీ సెల్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుబ్బరాజు, మాజీ కౌన్సిలర్లు సీతారామిరెడ్డి, ఏసుదాసు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-10-08T05:03:10+05:30 IST