గండికోటలో ‘నూతన’ సందడి

ABN , First Publish Date - 2022-12-31T00:07:25+05:30 IST

పర్యాటక ప్రాంతమైన గండికోటకు శుక్రవారం సాయంత్రం నుంచే పర్యాటకులు చేరుకుంటున్నారు. దీంతో ఇక్కడ ముందస్తు హడావిడి నెలకొంది. శుక్రవారం సాయంత్రం చెన్నై, హైదరాబాదు, తిరుపతి, కడప, గుంటూరు, తదితర ప్రాంతాల నుంచి సుమారు 30 నుంచి

గండికోటలో ‘నూతన’ సందడి

ముందస్తుగా చేరుకుంటున్న పర్యాటకులు

వెలసిన అనధికార టెంట్లు

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 30: పర్యాటక ప్రాంతమైన గండికోటకు శుక్రవారం సాయంత్రం నుంచే పర్యాటకులు చేరుకుంటున్నారు. దీంతో ఇక్కడ ముందస్తు హడావిడి నెలకొంది. శుక్రవారం సాయంత్రం చెన్నై, హైదరాబాదు, తిరుపతి, కడప, గుంటూరు, తదితర ప్రాంతాల నుంచి సుమారు 30 నుంచి 40 వాహనాలు సాయంత్రం 6.30 గంటలకు చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో లోయ పక్కన అనధికారికంగా టెంట్లు వేశారు. టూరిజం ఆవరణంలోని అద్దె భవనాలు, ప్రైవేటు లాడ్జీలు 2వ తేదీ వరకు అన్ని ఫుల్‌ అయినట్లు తెలుస్తోంది.

కాగా.. ఇటీవల జమ్మలమడుగు ఆర్డీవో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని డిసెంబరు 31, జనవరి 1 తేదీల్లో శని, ఆదివారం కావటం వలన పర్యాటకుల సందడి నెలకొంటుందని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. గండికోట పరిసర ప్రాంతాల్లో ఆ రెండు రోజులు మద ్యం విక్రయాలు రద్దు చేశామన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పర్యాటక ప్రాంతంలో ఎలాంటి ఫంక్షన్లు చేయరాదని హెచ్చరించారు. అయినా జమ్మలమడుగు పట్టణంలోని ముద్దనూరు రోడ్డులోని బార్‌ నుంచి నేరుగా గూడెం చెరువు, గండికోట ప్రాంతానికి మద్యం ఇప్పటికే సరఫరా అయిందని సమాచారం. గండికోట గ్రామంలోని వివిధ దుకాణాలవారు ముందస్తుగానే తెచ్చుకుని నిల్వ ఉంచుకున్నారని అంటున్నారు. అలాగే గూడెం చెరువు, రాజీవ్‌నగర్‌ కాలనీల వద్ద రెండుమూడు చోట్ల మద్యం విక్రయించేందుకు సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఒకవైపు సంబంధిత అధికారులు అనధికారికంగా టెంట్లు వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. వీటికి సంబంధించి ఆర్డీవో శ్రీనివాసులును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా గండికోట పర్యాటక ప్రాంతంలో మద్యం అమ్మకుండా, ఎలాంటి ఫంక్షన్లు, డిన్నర్లు చే యకుండా, అల్లర్లు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. లోయ పక్కన అనధికారికంగా టెంట్లు వేసిన విషయం తనకు తెలియదని, తహసీల్దారు రవీంద్రారెడ్డికి తెలియజేస్తానన్నారు.

Updated Date - 2022-12-31T00:07:29+05:30 IST