మాసాపేట రోడ్డు విస్తరణ.. ఎవరి కోసం...?
ABN , First Publish Date - 2022-11-19T23:50:46+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రె డ్డి కడపలో నాలుగు రహదారుల విస్తరణకు 2021 జూలై 9న శంకుస్థాపన చేశారు. కృష్ణాసర్కిల్ నుంచి దేవునికడప మీదుగా మార్కెట్ యార్డు వరకు, ఆర్టీసీ బస్టాండు నుంచి వైజంక్షన్ వరకు, గోకుల్‌లాడ్జి నుంచి అన్నమయ్య కూడలి వరకు, మాసాపేట కూడలి నుంచి మాచుపల్లె రోడ్డు బైపాస్ వరకూ రహదారుల పనులు
గజిబిజి ట్రాఫిక్ ఉండే రహదారులు వదిలేసి..
పేదలు ఉండే సందుల్లో ఇళ్లను కూల్చివేసి రోడ్డు విస్తరణ
పెద్దల స్థలాల విలువ కోసమేనంటున్న బాధితులు
ఇళ్లు పోతున్నాయి కాపాడండి మహాప్రభో అంటే..
రోడ్డేస్తే ఉన్న స్థలమే మూడు రెట్లు ఎక్కువ విలువ పలుకుతుందట
ముఖ్య నేతల విచిత్ర సలహాపై భగ్గుమంటున్న బాధితులు
అభివృద్ధి జరగాలి. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి. ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలి. అలా కాకుండా అభివృద్ధి పేరిట పేదల గూళ్లను కూల్చివేసి పెద్దలను మరింత ధనవంతులుగా చేయడం అన్యాయం. అలాంటి అభివృద్ధిపై విమర్శలు వస్తాయి. ఇదే ఇప్పుడు కడప నగరంలో రోడ్ల విస్తరణ పేరిట జరుగుతోంది. వరద ముంపు నుంచి కడప నగరాన్ని గట్టెక్కించేందుకు ఆక్రమణల పేరిట పేదల ఇళ్లు కూల్చివేశారు. పెద్దలు ఆక్రమించిన ప్రాంతాల జోలికి మాత్రం వెళ్లలేదు. దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ ఘటన మరువకముందే మళ్లీ ఇప్పుడు రోడ్ల విస్తరణ పేరిట పేదల ఇళ్లను కూలగొట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపించేలా ఉన్న రహదారులను వదిలేసి పేదలు నివసించే ప్రాంతంలోనే విస్తరణ పనులు చేపట్టడాన్ని ఇటు ప్రతిపక్ష పార్టీలు, అటు ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అభివృద్ధి మాటున జరుగుతున్న పేదల ఇళ్ల కూల్చివేతపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
(కడప - ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రె డ్డి కడపలో నాలుగు రహదారుల విస్తరణకు 2021 జూలై 9న శంకుస్థాపన చేశారు. కృష్ణాసర్కిల్ నుంచి దేవునికడప మీదుగా మార్కెట్ యార్డు వరకు, ఆర్టీసీ బస్టాండు నుంచి వైజంక్షన్ వరకు, గోకుల్‌లాడ్జి నుంచి అన్నమయ్య కూడలి వరకు, మాసాపేట కూడలి నుంచి మాచుపల్లె రోడ్డు బైపాస్ వరకూ రహదారుల పనులు చేపట్టేందుకు శంకుస్థాపన చేశారు. ఏడాది తరువాత అధికార వర్గాల్లో చలనం వచ్చింది. కృష్ణాసర్కిల్ నుంచి మార్కెట్‌యార్డు వెళ్లే రహదారిలో కొన్ని ఆక్రమణలు తొలగించేశారు. అంబేడ్కర్ సర్కిల్ - వై.జంక్షన్ రహదారి, గోకుల్ లాడ్జి కృష్ణాసర్కిల్ మీదుగా అన్నమయ్య విగ్రహం రహదారి వరకూ కేవలం సర్వేలతో సరిపెట్టారు. ఇప్పుడు మాసాపేట సర్కిల్ నుంచి మాచుపల్లె రోడ్డు బైపాస్ వెళ్లే రహదారి విస్తరణ పనులకు నాలుగురోజుల క్రితం శ్రీకారం చుట్టారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఆక్రమణల పేరిట మాసాపేటలో ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఇప్పుడీ వ్యవహారం దుమారం రేపుతోంది.
పేదల ఇళ్లు కూల్చివేత
మాసాపేట సర్కిల్ నుంచి బైపాస్ వరకూ ఉన్న రోడ్డు ప్రస్తుతం కొన్ని చోట్ల 40 నుంచి 60 అడుగులు వెడల్పు ఉంది. దీన్ని 80 అడుగులకు విస్తరిస్తున్నారు. మాసాపేట కూడలి నుంచి దొరల గోరీల వరకు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేసి నిర్మాణాలు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు. రహదారి విస్తరణలో భాగంగానే ఆక్రమణలు తొలగిస్తున్నామని అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కార్పొరేషన్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు 60 నుంచి 70 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఇళ్లు కూల్చివేస్తున్నారు. సుమారు 143 ఇళ్లలో 40 ఇళ్ల దాకా విస్తరణలో సంపూర్ణంగా పోతుండగా, మరో 100 ఇళ్లు పాక్షికంగా దెబ్బతింటున్నాయి.
పెద్దల కోసమేనా..
కడప నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ ఉండే రహదారులను వదిలేసి మాసాపేట బైపాస్ సర్కిల్ రహదారిలో విస్తరణ పనులు చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అంబేడ్కర్‌సర్కిల్ నుంచి వైజంక్షన్ వెళ్లే రహదారి వాహనాలతో కిటకిటలాడుతుంటుంది. నిమిషం వ్యవధిలో సుమారు వందకు పైగా వాహనాలు రాకపోకలు సాగుతున్నాయంటే ఇక్కడ ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది. ఇదే పరిస్థితి గోకుల్‌లాడ్జి, క్రిష్ణసర్కిల్, అన్నమయ్య రహదారుల్లో ఉంది. వాటిని వదిలేసి మాసాపేట కూడలి నుంచి రహదారి విస్తరణ పనులు చేపట్టడం పలు ఆరోపణలకు తావిస్తోంది. ఈ రహదారి పరిధిలో కడపకు చెందిన ముఖ్య నేతల భూములు ఉన్నాయి. వాటికి విలువ పెంచేందుకే పేదల ఇళ్లు కొట్టివేసి రోడ్డు వేస్తున్నారంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ రోడ్డు ఏర్పాటు అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సిద్దంగా ఉన్నారని, వారి కోసమే ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం జరుగుతుందంటూ ఆరోపిస్తున్నారు.
రేటు పెరుగుతుందట
ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ నివాసం ఉంటున్నారు. కొందరు చిరువ్యాపారాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తుంటే మరికొందరు కూలి పనులకు వెళ్లి పొట్ట పోసుకుంటున్నారు. ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరిట వారి ఇళ్లు కూలిపోతున్నాయి. సార్.. ఇళ్లు పోతున్నాయి, ఇప్పుడు రోడ్డు 80 అడుగులు విస్తరిస్తారట. అట్లయితే మా ఇళ్లు పోతాయి, 70 అడుగులకు విస్తరించండి అంటూ బాధితులు కడపకు చెందిన ముఖ్య నేతల వద్దకు వెళితే.. వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే.. ‘‘ఇప్పుడు మీరుండే స్థలం రూ.5లక్షలు విలువ చేస్తుందనుకో.. రోడ్డు పడితే రూ.10లక్షలు పలుకుతుంది. మీ స్థలం పోతే పోనీ, ఉన్న స్థలానికైనా మంచి ధర వస్తుంద’’ అన్నారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కోసమే రోడ్డు విస్తరణ అంటున్నారు.. మేము అభివృద్ధి చెందే అవసరం లేదా..? పెద్దలు మాత్రమే అభివృద్ధి చెందాలా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ రహదారుల విస్తరణ గురించి కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
70 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నాం
- నాగరాజు, చిరువ్యాపారి
70 ఏళ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం. కొందరు కూలీ పనులకెళితే మరికొందరు చిరు వ్యాపారాలు పెట్టుకుని బతుకుతున్నాం. ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేస్తున్నారు. 80 అడుగుల విస్తరణ వల్ల తీవ్రంగా నష్టపోతున్నాం. 75 అడుగులు విస్తరణకే పరిమితం చేయాలి.
1981 నుంచి పన్నులు కడుతున్నాం
- ప్రకాశం, కార్మికుడు
అభివృద్ధి కోసం రోడ్ల విస్తరణ అంటున్నారు. పేదలు లేకుండా చేసే అభివృద్ధి ఎందుకు? పేదలు కూడా అభివృద్ధిలో భాగం కావాలి కానీ ఎవరి కోసమే పేదల ఇళ్లు కూలగొట్టడం సమంజసం కాదు. 1981 నుంచి నీటి పన్ను, అన్ని పన్నులు కడుతున్నాం.