జిల్లాను వణికిస్తున్న ‘మాండస్‌’

ABN , First Publish Date - 2022-12-13T00:10:18+05:30 IST

జిల్లాలోని అన్నదాతలను మాండస్‌ తుఫాను వణికిస్తోంది. మాండస్‌ కారణంగా శుక్రవారం చిరుజల్లులతో మొదలైన వర్షం సోమవారం వరకు నాలుగు రోజులపాటు జడివానగా మారి ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. దీనికి తోడు ఈదురు గాలులు వీస్తుండడంతో వ్యవసాయ,

జిల్లాను వణికిస్తున్న ‘మాండస్‌’

నాలుగు రోజుల నుంచి జడివానలు

సోమవారం జిల్లాలో 199.6 మి.మీ వర్షపాతం

10,946 ఎకరాలలో పంట నష్టం

లబోదిబోమంటున్న అన్నదాతలు

జలాశయాలు, చెరువులు, నదుల వద్ద ప్రత్యేక నిఘా

మైలవరం నుంచి పెన్నాకు 6,000 క్యూసెక్కుల నీరు విడుదల

కడప(రూరల్‌) డిసెంబర్‌ 12: జిల్లాలోని అన్నదాతలను మాండస్‌ తుఫాను వణికిస్తోంది. మాండస్‌ కారణంగా శుక్రవారం చిరుజల్లులతో మొదలైన వర్షం సోమవారం వరకు నాలుగు రోజులపాటు జడివానగా మారి ఓ మోస్తారు వర్షాలు పడ్డాయి. దీనికి తోడు ఈదురు గాలులు వీస్తుండడంతో వ్యవసాయ, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఆదివారం ఉదయం వర్షం కాస్త తెరపిచ్చినట్లే ఇచ్చి సాయంత్రం నుంచి మళ్లీ ముసురువాన కురుస్తోంది. దీంతో పంటలు చేతికి వస్తాయో రావోనని అన్నదాతలు ఆందో ళన చెందుతున్నారు.

199.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

మాండస్‌ తుఫాను కారణంగా జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జిల్లాలోని 36 మండలాల్లో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 199.6 మీ.మీ వర్షపాతం నమోదైంది. డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. కడప డివిజన్‌లో 62.04, బద్వేల్‌ డివిజన్‌లో 101.04, జమ్మలమడుగు డివిజన్‌లో 20.06, పులివెందుల డివిజన్‌లో 15.02 మీ.మీ వర్షపాతం నమోదైంది. బి.కోడూరు మండలంలో అత్యధికంగా 20.08 మి.మీ వర్షపాతం నమోదు కాగా కొండాపురం మండలంలో అత్యల్పంగా 0.2 మి.మీ నమోదైంది.

కాగా, శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 1187.0 మి.మీ, శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు 668.8 మి.మీ నమోదైంది. ఇప్పటి వరకు మొత్తం జిల్లా అంతటా 2054 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

10,946 ఎకరాలలో పంట నష్టం

జిల్లాలో తాజాగా ఆదివారం నుంచి సోమవారం వరకు కురిసిన వర్షానికి 10,946 ఎకరాలలో ఉద్యాన, వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. ఇందులో 20 మండలాల్లోని 94 గ్రామాల్లో 10,628 ఎకరాల్లో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. వీటిలో కోతకొచ్చిన వరి పంట 745.6 ఎకరాలు, పూత, కోత దశలో ఉన్న మొక్కజొన్న 50 ఎకరాలు, జొన్న 565 ఎకరాలు, పూత దశలో ఉన్న శనగ పంట 8536 ఎకరాలు, సన్‌ఫ్లవర్‌ 17 ఎకరాలు, కోత దశలో ఉన్న మినుము 703 ఎకరాలు, నువ్వులు 12 ఎకరాల్లో పంట దెబ్బతింది. అలాగే ఉద్యాన పంటలకు సంబంధించి ఉల్లి, టమోటా, అరటి, బీర, బెండ, క్యాబేజీ, చామంతి, బంతి, మిరప, బీన్స్‌, వంగ, కర్జూజ తదితర పంటలు దెబ్బతిన్నాయి. లింగాల, బి.మఠం, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, చెన్నూరు, ఒంటిమిట్ట, కడప, చాపాడు, మైదుకూరు, సిద్దవటం, గోపవరం తదితర 12 మండలాల్లో 242 మంది రైతులకు 318 ఎకరాల్లో రూ.30.44 లక్షల మేర పంటలకు నష్టం వాటిల్లింది. మైదుకూరు, బి.మఠం, సిద్దవటం మండలంలో ఎక్కువ నష్టం వాటిల్లింది. ఇకపోతే శుక్రవారం నుంచి ఆదివారం వరకు కురిసిన వర్షాలకు వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 15,515 ఎకరాలలో పంటలకు నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు(డిసెంబర్‌ 13) మొత్తం 26,461 ఎకరాలలో పంటనష్టం వాటిల్లింది.

లబోదిబోమంటున్న అన్నదాతలు

మాండస్‌ తుఫాను కారణంగా జిల్లాలో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న జడివానలకు జిల్లాలోని రైతులు తల్లడిల్లిపోతున్నారు. కోతకొచ్చిన వరి, పూత కోత దశలో ఉన్న మొక్కజొన్న, జొన్న, పూత దశలో ఉన్న శనగ తదితర వ్యవసాయ పంటలతో పాటు చేతికి అందివచ్చిన ఉల్లి, టమోటా, అరటి, బీర, బెండ, క్యాబేజీ, చామంతి తదితర పంటలను సాగుచేసిన రైతులు భారీగా నష్టపోయారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలను కాపాడుకునే పనిలో అన్నదాతలు నిమగ్నమయ్యారు. ఆరీబీకే పరిధిలో ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగడం, ధాన్యంలో తేమ ఖరారు, తూకంలో తేడాలతో నలిగిపోతున్న అన్నదాతలకు ప్రస్తుతం మాండస్‌ తుఫాను కారణంగా వర్షాలు మరింత నష్టాన్ని తెచ్చిపెడుతుండడంతో కన్నీటి పర్వంతం అవుతున్నారు.

జలాశయాలు, చెరువులు, నదుల వద్ద నిఘా

మాండస్‌ తుఫాను కారణంగా నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని పలు జలాశయాలకు, చెరువులకు వర్షపు నీరు వచ్చి చేరుతోంది. గండికోట, మైలవరం, సీబీఆర్‌, వామికొండ, ఎస్‌ఆర్‌-1, ఎస్‌ఆర్‌-2, ఎస్‌పీవీబీఆర్‌, సర్వరాయసాగర్‌, పైడిపాళెం, బుగ్గవంక తదితర జలాశయాలతో పాటు పలు మండలాల్లోని చెరువులు, వాగులు, వంకలు, నదుల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అధికారులు నిఘా ఉంచారు.

మైలవరం జలాశయం నుంచి 6,000 క్యూసెక్కుల నీరు విడుదల

మాండస్‌ తుఫాను కారణంగా మైలవరం డ్యాంకు భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుంది. ఈ మేరకు డ్యాం నుంచి ఆదివారం వరకు 3000 క్యూసెక్కుల నీటిని పెన్నాకు వదలగా.. తాజాగా సోమవారం 6,000 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేశారు. దీంతో పెన్నా నదిలో నీటి ఉధృతి మరింతగా పెరిగింది.

Updated Date - 2022-12-13T00:10:18+05:30 IST

Read more