‘అధికారిక దందా’పై లోకాయుక్త కొరడా

ABN , First Publish Date - 2022-09-20T05:02:11+05:30 IST

జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై రాష్ట్ర లోకాయుక్త కొరడా ఝళిపించింది.

‘అధికారిక దందా’పై లోకాయుక్త కొరడా

ఇసుక అక్రమ రవాణాపై నివేదిక ఇవ్వండి

కలెక్టర్‌, ఎస్పీలకు ఆదేశాలు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


రాయచోటి, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై రాష్ట్ర లోకాయుక్త కొరడా ఝళిపించింది. ‘అధికారిక దందా’ పేరుతో ఈనెల 17వ తేదీ పెద్దతిప్పసముద్రం మండల కేంద్రం నుంచి ఇసుక అక్రమ రవాణాపై ఆంధ్రజ్యోతిలో కథనం వెలువడిన విషయం తెలిసిందే. ఈ కథనంపై రాష్ట్ర లోకాయుక్త సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ అక్రమ రవాణాపై కలెక్టర్‌, ఎస్పీలతో పాటు మరో ముగ్గురు అధికారులను ప్రతిపాదులుగా చేరుస్తూ ఈనెల 19వ తేదీ నోటీసులు జారీ చేసింది. తక్షణమే ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించింది. వివరాలను పరిశీలిస్తే.. తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్దతిప్పసముద్రం మండల పరిధిలో గత కొన్ని నెలలుగా ప్రైవేటు వ్యక్తులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అంకిరెడ్డిగారిపల్లె, జెట్టివారిపల్లెతో పాటు ఇంకా కొన్ని ప్రాంతాలలో అక్రమ రవాణాదారులు ఇసుక నిల్వలు ఏర్పాటు చేశారు. ఎటువంటి భయం లేకుండానే పట్టపగలే ఇసుకను తరలించేస్తున్నారు. ఈ అక్రమ రవాణాదారులకు కొందరు కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారు. ఇందుకుగానూ... సదరు అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అక్రమ రవాణా గురించి అటు రెవెన్యూ, ఇటు పోలీసు శాఖలకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. అయినా ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు ఆ శాఖలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ  నేపధ్యంలో పై వివరాలతో ఈనెల 17న ఆంధ్రజ్యోతిలో అధికారిక దందా శీర్షికన వార్త వెలువడింది. ఈ వార్తకు రాష్ట్ర లోకాయుక్త సుమోటోగా స్పందించింది. భారత శిక్షాస్మృతి ప్రకారం మైన్స్‌అండ్‌ మినరల్స్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌ చట్టప్రకారం, ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ చట్టం ప్రకారం ఇసుక అక్రమరవాణా నేరమని లోకాయుక్త తన నోటీసులో పేర్కొంది. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటి రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. లోకాయుక్తకు ఉన్న అధికారాలతో సుమోటోగా కేసును స్వీకరించింది దీంతో అక్రమ రవాణాపై స్పందించాల్సిందిగా కలెక్టర్‌, ఎస్పీ, పెద్దతిప్పసముద్రం తహసీల్దార్‌, జిల్లా మైన్స్‌ అండ్‌ జియాలజి అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఎస్‌ఐలకు నోటీసులు జారీ చేసింది. అక్రమ ఇసుక రవాణా, అందుకు సహకరిస్తున్న అధికారులపై సమగ్ర విచారణ జరిపి నివేదికను ఈనెల 26వ తేదీ లోపు తమకు పంపాలని కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులో పేర్కొంది. ఇసుక అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ అవసరమైతే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించింది. జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లోనూ అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే  ఆరోపణలు ఉన్నాయి. ఎక్స్‌కవేటర్‌లను ఉపయోగిస్తూ.. రేయింబవళ్లు ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్రమంగా రవాణా చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ విషయమై పత్రికల్లో వచ్చినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో లోకాయుక్త జోక్యం చేసుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Read more