జగన్‌తోనే తేల్చుకుందాం
ABN , First Publish Date - 2022-12-07T03:24:27+05:30 IST
‘‘బతిమాలుతూ కూర్చుంటే పట్టించుకోరు. ఒత్తిడి తెస్తేనే హక్కులను సాధించుకోగలం. అధికారాలు దక్కించుకోగలం.
అవసరమైతే రాజీనామాలకు రెడీ
పలు జిల్లాల సర్పంచుల తీర్మానం
కడప(రూరల్), డిసెంబరు 6: ‘‘బతిమాలుతూ కూర్చుంటే పట్టించుకోరు. ఒత్తిడి తెస్తేనే హక్కులను సాధించుకోగలం. అధికారాలు దక్కించుకోగలం. ప్రభుత్వం దిగివచ్చేలా రాజీనామాలకు సిద్ధపడదాం. మంత్రులతో పనికాదు, నేరుగా ముఖ్యమంత్రి దగ్గరే తేల్చుకుందాం’’ అని పలువురు సర్పంచ్‌లు, సర్పంచ్ల సంఘం నేతలు తేల్చి చెప్పారు. పంచాయతీల సమస్యలను, నిధుల విషయాన్ని ప్రభుత్వం పరిష్కరించాలంటే పార్టీ, సర్పంచ్ పదవులకు రాజీనామాకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. మంగళవారం కడప నగరంలోని సర్పంచ్ల సంఘం కార్యాలయంలో ఉమ్మడి కడప జిల్లా సర్పంచ్ల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి నిధులు, విధులపై చర్చించారు. సమావేశానికి ఉమ్మడి కడప జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పాపారావు, పల్నాడు జిల్లా సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడు అల్లాబకాష్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజనేయులుతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ‘‘సర్పంచ్‌లలో 90 శాతం మంది వైసీపీ వారే ఉన్నారు.
అయినా సర్పంచ్ల సమస్యలను ప్రభత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. మన అవసరమే ప్రభుత్వానికి ఉంటుంది. బతిమలాడితే పట్టించుకోరు. ఒత్తిడి తెస్తేనే హక్కులను సాధించుకోగలుగుతాం. ఎమ్మెల్యేలు, ఎంపీలకు, మంత్రులకు విన్నవిస్తే ప్రయోజనం లేదు. నేరుగా సీఎంతోనే తేల్చుకుందాం. కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలలో సర్పంచ్‌లు రారాజులుగా ఉన్నారు. అక్కడి సర్పంచ్‌లు 29 విశేషాధికారాలతో మోస్ట్ పవర్‌ఫుల్‌గా కొనసాగుతున్నారు. కానీ, ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేల ప్రభావం తగ్గిపోతుందనే కారణంతో కనీస అధికారాలు కూడా ఇవ్వలేదు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల లేమితో పనులు చేయలేక అవస్థలు పడుతున్నామన్నారు. సమస్యలను పరిష్కరించాలని పలువురు మంత్రుల దృష్టికి తీసుకెళ్తే తామేమీ చేయలేమన్నారని.. సీఎం దృష్టికైనా తీసుకెళ్లాలని అడిగితే ఆ పనీ చేయలేమన్నారని పేర్కొన్నారు. అదే కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. అవసరమైతే సర్పంచ్‌లందరూ రాజీనామాలకు కూడా సిద్ధపడాలని, అప్పుడే సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని తెలిపారు. పార్టీలకతీతంగా జనవరి 5న రాష్ట్రస్థాయిలో సర్పంచ్ల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని సమస్యల పరిష్కారానికి చొరవ చూపుదామని తీర్మానం చేశారు.