జిల్లాను అగ్రపథంలో నిలుపుదాం

ABN , First Publish Date - 2022-08-16T05:12:20+05:30 IST

దేశ ప్రగతి కోసం పాటుపడిన మహనీయుల త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకమని, వారి స్ఫూర్తితో జిల్లాను అగ్రపథంలో నిలుపుదామని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

జిల్లాను అగ్రపథంలో నిలుపుదాం
జాతీయ జెండాకు అభివాదం చేస్తున్న మంత్రి, కలెక్టర్‌, ఎస్పీ తదితరులు

జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

కొత్త జిల్లాలో తొలిసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

జెండా ఆవిష్కరించిన మంత్రి

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

పెద్ద ఎత్తున హాజరైన ప్రముఖులు, ప్రజలు


రాయచోటి, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి):  దేశ ప్రగతి కోసం పాటుపడిన మహనీయుల త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకమని, వారి స్ఫూర్తితో జిల్లాను అగ్రపథంలో నిలుపుదామని రాష్ట్ర వ్యవసాయ శాఖ, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పిలుపునిచ్చారు. కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో స్థానిక పోలీసు పెరేడ్‌ గ్రౌండులో తొలిసారిగా జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని స్వాతంత్య్ర సమరయోధులు యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి, బండారు పెద్ద సంజీవు, బండారు గండ్రాయుడు, టి.చంద్రశేఖర్‌రెడ్డి, వెంకటసుబ్బయ్య,  సిగబత్తుల భక్తియార్‌లను గుర్తు చేసుకున్నారు. జిల్లాలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త జిల్లాలతో నూతన శకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఇప్పుడు ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను పునర్వవ్యస్థీకరించిందన్నారు. 25 కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విస్తృత అధ్యయనం, సుధీర్ఘ కసరత్తు ద్వారా పూర్తి శాస్ర్తీయతతో ప్రభుత్వం జిల్లాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పుడున్న జిల్లాల సరిహద్దులు చెరిపేసి ప్రజలకు అనుకూలమైన కొత్త సరిహద్దులను సృష్టించడం ద్వారా పాలన మెరుగుపడుతుందన్నారు. చిన్న జిల్లాలు ఏర్పడితే ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ అవుతుందన్నారు. జిల్లా కార్యాలయాలు ప్రజల సమీపానికే వస్తాయన్నారు. దీనివల్ల పాలనాపరమైన ప్రయోజనాలతో పాటు పరిపాలనలో గుణాత్మక మార్పు వస్తుందన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య నడియాడిన ప్రాంతాన్ని ఆయన పేరుతో అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేయడం మనందరికీ గర్వకారణమన్నారు. 7951 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఆరు నియోజకవర్గాలు, 3 రెవెన్యూ డివిజన్లు, 4 మున్సిపాలిటీలు, 30 మండలాలు 462 గ్రామ పంచాయతీలతో కొత్త జిల్లా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త జిల్లాలో కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ త్వరితగతిన జిల్లాలో ఏర్పాటు చేసి పరిపాలన సాగించడంలో జిల్లా కలెక్టర్‌ చూపిన శ్రద్ధ, చొరవ ప్రశంసనీయమన్నారు 

జిల్లాలో డాక్టర్‌ వైఎస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి రూ.13,500 పెట్టుబడి సాయం అందించనున్నట్లు తెలిపారు. దీనిద్వారా ఐదేళ్లలో ప్రతి రైతు రూ.67,500 లబ్ధి పొందుతాడని తెలిపారు. డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతుల తరపున ప్రీమియం మొత్తాన్ని 100 శాతం ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందన్నారు. 2021 సంవత్సరానికి జిల్లాలో పంటల బీమా కింద 63,293 మంది రైతుల ఖాతాలో రూ.63 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. పగటి పూటే రైతులకు 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడానికే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిద్వారా నాణ్యమైన వ్యవసాయ ఉత్పాదకాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటివి రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ పెట్టుబడిని తగ్గించడం, వ్యవసాయ కూలీల సమస్యలను అధిగమించేందుకు వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు రైతులకు సబ్సిడీతో యంత్రాలను ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులు అసక్తి చూపే విధంగా అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రైతులు పండించిన పంటల కోసం వ్యవసాయ మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఉద్యానవన రైతులకు చేయూత ఇవ్వడానికి వివిధ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా పాలకు గిట్టుబాటు ధర, మహిళా పాడి రైతులకు ఆర్థికాభివృద్ధి కల్పించడానికి రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ మహిళా పాల ఉత్పత్తి సహకార సంఘాలను ఏర్పాటు చేసి పాల సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. పశువులకు అత్యవసర సమయంలో వైద్యసేవలు అందించేందుకు ప్రతి నియోజకవర్గంలో సంచార పశువైద్య వాహనాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

జిల్లాలో పట్టుపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అనేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలో సూక్ష్మ నీటి సాగును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 2022-23 సంవత్సరానికి 10,221 మెట్రిక్‌ టన్నుల మేలు జాతి చేపలు, రొయ్యల ఉత్పత్తి లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జగనన్న అమ్మఒడి ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా పిల్లలను బడులకు పంపేందుకు కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల చదువుల నాణ్యతా ప్రమాణాలు పెంచ డం కోసం జగనన్న విద్యాకానుక ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పెంచేందుకు జగనన్న గోరుముద్ద ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లల్లో దృష్టి సమస్యలను గుర్తించి సరిదిద్దడానికి వైఎ్‌సఆర్‌ కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. జగనన్న విద్యాదీవెన వసతి ద్వారా పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. పేద ప్రజలకు కార్పొరేట్‌ తరహా ఉచిత వైద్యం అందించేందుకు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందన్నారు. గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. 

సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటి ముందుకే ప్రభుత్వ సేవలు అందుతున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీట వేసిందన్నారు వృద్ధులకు పెన్షన్లు ప్రతి నెలా ఒకటో తేదీనే ఇస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు. వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ పథకం, జగనన్నతోడు, జగనన్న చేదోడు, వైఎస్సార్‌ కాపునేస్తం,  వైఎస్సార్‌ నేతన్న నేస్తం, వైఎస్సార్‌ వాహనమిత్ర, పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్‌ జలయజ్ఙం వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టినట్లు వివరించారు. అదే విధంగా జిల్లాలో అనేక సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం ఎమ్మెల్యేలు సచివాలయాల వారీగా ఇంటింటికి వెళ్లి సమస్యలను పరిష్కారం చేసేందుకు రూ.20 లక్షల నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. తొలుత అనేక శాఖలు ఏర్పాటు చేసిన శకటాలు ర్యాలీగా వచ్చాయి. జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి, కలెక్టర్‌, ఎస్పీలతో కలిసి ఓపెన్‌ టాప్‌ వాహనంలో ర్యాలీగా పోలీసుపెరేడ్‌ గ్రౌండుకు చేరుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసులతో గౌరవవందనం స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా సీనియర్‌ సిటిజన్‌ షేక్‌ భానుబీ, సనా నాగులమ్మను మంత్రితో పాటు అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో శాసనసభా వ్యవహారాల సమన్వయ కమిటీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డితో పాటు జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి, కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియాతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు, డివిజన్‌ అధికారులు, పాల్గొన్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పెద్ద ఎత్తున విద్యార్థులు హాజరై, కార్యక్రమాలలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T05:12:20+05:30 IST