పోలీసు ఉద్యోగ అభ్యర్ధులకు వయోపరిమితిని ఐదేళ్లకు పెంచాల్సిందే

ABN , First Publish Date - 2022-12-02T00:01:03+05:30 IST

పోలీసు ఉద్యోగ వయో పరిమితి ఐదు సంవత్సరాలు పెంచాల్సిందేనని, పరీక్ష గడువు మూడు నెలలు పొడిగించాలని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దస్తగిరి, గంగాసురేష్‌ డిమాండ్‌ చేశారు.

పోలీసు ఉద్యోగ అభ్యర్ధులకు వయోపరిమితిని ఐదేళ్లకు పెంచాల్సిందే
కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న ఏఐవైఎఫ్‌ నాయకులు

కలెక్టరేట్‌ ఎదుట ఏఐవైఎఫ్‌ ఆందోళన

కడప (ఎడ్యుకేషన), డిసెంబరు 1 : పోలీసు ఉద్యోగ వయో పరిమితి ఐదు సంవత్సరాలు పెంచాల్సిందేనని, పరీక్ష గడువు మూడు నెలలు పొడిగించాలని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దస్తగిరి, గంగాసురేష్‌ డిమాండ్‌ చేశారు. గురువారం కలెక్టరేట్‌ ఎదుట బాబు జగ్జీవన రామ్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసుశాఖలో ప్రతి యేటా 6500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం హామీ ప్రకారం మూడు సంవత్సరాలకు కలిపి 19500 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ పట్టభద్రుల, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో 6511 పోలీసు ఉద్యోగాల నియామకాల కోసం నోటిఫికేషన ఇచ్చారన్నారు. అయితే వయో పరిమితి ఎస్‌ఐకి 21 నుంచి 27 సంవత్సరాలు, పోలీసు కానిస్టేబుల్‌కు 18 నుంచి 24, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్‌ వారికి ఐదు సంవత్సరాల వయో పరిమితి సడలింపుగా నిర్ణయించడం బాధాకరమన్నారు. తద్వారా ఎంతో మంది నిరుద్యోగుల ఆశలు నీరుగారుతాయన్నారు. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో పోలీసు ఉద్యోగాల వయో పరిమితి ఐదు సంవత్సరాలు పెంచి ఉద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ నాయకులు రాహుల్‌దేవ్‌, చైతన్య, జి.నాగరాజులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:01:05+05:30 IST