పట్టపగలే బాలిక కిడ్నాప్
ABN , First Publish Date - 2022-10-18T04:35:21+05:30 IST
ఇంటి వెనుక ఉన్న చిన్నారిని కొందరు దుండగులు పట్టపగలే కిడ్నాప్ చేసి బంగారు నగలు అపహరించిన ఘటన మండలంలోని తూముకుంట కస్పాలో కలకలం రేపింది.
బంగారు నగలు చోరీ చేసి వదిలేసిన దుండగులు
గాలివీడు, అక్టోబరు 17: ఇంటి వెనుక ఉన్న చిన్నారిని కొందరు దుండగులు పట్టపగలే కిడ్నాప్ చేసి బంగారు నగలు అపహరించిన ఘటన మండలంలోని తూముకుంట కస్పాలో కలకలం రేపింది. చిన్నారి తల్లిదండ్రుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే... తూముకుంట పంచాయతీ కస్పాలో నివాసం ఉండే గంగసాని నాగార్జున, ఉమాదేవిల కుమార్తె నిఖిత (10) సత్యసాయి జిల్లా ఓడిసి గ్రామంలో 6వ తరగతి చదువుతోంది. సెలవులకు ఇంటికి వచ్చిన ఈనెల 13వ తేదీ పుట్టినరోజు జరుపుకుంది. అనంతరం నిఖిత పాఠశాలకు వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉందని తల్లిదండ్రులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంటికి వెనుక వైపున పొలంలో ఉన్న చింతచెట్టు కింద ఒక్కటే ఉండగా గుర్తు తెలియని ఇద్దరు తన వద్దకు వచ్చి ముక్కు దగ్గర ఏదో పెట్టడంతో మత్తుగా పడిపోయానని బాలిక తెలిపింది. రెండు గంటల తర్వాత పల్లెకు ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న డంపింగ్ యార్డుకు వెనుక వైపున గుట్టలో ఉన్నట్లు తెలిసిందని చెప్పింది. తన చెవులకు ఉన్న రెండు కమ్మలతో పాటు కాళ్ల గజ్జలను దుండగులు తీసుకుని వెళ్లినట్లు తెలిసిందని పేర్కొన్నారు. పుట్టినరోజు నాడే బంగారు కమ్మలతో పాటు కాళ్లగజ్జలు కూడా కొత్తవి కొన్నారు. వాటి విలువ 13 వేల రూపాయలు ఉంటాయని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. పాప ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో పల్లె, వాగులు, వంకలు, బావుల దగ్గర వెతికామని అనంతరం తోటలు, గుట్టల వైపు వెతుకుతుండగా డంపింగ్ యార్డుకు వెనుకవైపున ఉన్న గుట్టలో పాప ఏడుస్తూ వస్తున్నట్లు గుర్తించామని తల్లిదండ్రులు తెలిపారు. ఉదయం పూట కొంతమంది అపరిచిత వ్యక్తులు పాత బట్టల కోసం గ్రామంలో సంచరించినట్లు ప్రజలు తెలిపారు. వారే ఈ పాపను అపహరించి నగలను దోచుకెళ్లి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని గ్రామ మహిళా పోలీ్సకు తెలియశామని ఆమె జరిగిన విషయాలన్నీ పరిశీలించిందని తెలిపారు. పొలాల దగ్గరకు ఒంటరిగా వెళుతుంటామని ఇలాంటి దుండగులు తారసపడితే మా పరిస్థితి ఏమిటని మహిళలు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ విషయమై పోలీసులను అడగ్గా తమకు దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.