జగనన్న ఇళ్ల బకాయిలు రూ.40 కోట్లు

ABN , First Publish Date - 2022-10-08T04:49:30+05:30 IST

జిల్లాలో హౌసింగ్‌ బిల్లుల చెల్లింపులు నెలన్నరగా ఆగిపోయాయి. గతంతో పోలిస్తే ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపిస్తున్నా.. ఆ స్థాయిలో బిల్లులు రావడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నెలన్నర రోజులుగా రూ.40 కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగడం లేదనే వాదన అటు అధికారులు, ఇటు లబ్ధిదారుల్లో వినిపిస్తోంది.

జగనన్న ఇళ్ల బకాయిలు రూ.40 కోట్లు
మదనపల్లె మండలం కోళ్లబైలు జగనన్న కాలనీలో పునాది దశలో ఇంటి నిర్మాణాలు

నెలన్నరగా నిలిచిన చెల్లింపులు

సామగ్రి సమకూర్చేదెలా?

ఇలా అయితే ఇల్లు కట్టేదెలా?


జిల్లాలో హౌసింగ్‌ బిల్లుల చెల్లింపులు నెలన్నరగా ఆగిపోయాయి. గతంతో పోలిస్తే ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపిస్తున్నా.. ఆ స్థాయిలో బిల్లులు రావడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా నెలన్నర రోజులుగా రూ.40 కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగడం లేదనే వాదన అటు అధికారులు, ఇటు లబ్ధిదారుల్లో వినిపిస్తోంది.


మదనపల్లె, అక్టోబరు 7: జిల్లాలో జగనన్న ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో పడటం లేదని పలువురు వాపోతున్నారు. బిల్లులు వస్తాయని అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించామని తీరా బిల్లులు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా మని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వారానికి కనీసం రూ.6.50 కోట్ల నుంచి రూ.7 కోట్ల విలువ చేసే పనులు లబ్ధిదారులు పూర్తి చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. హౌసింగ్‌, సచివాలయ సిబ్బంది నుంచి అధికారుల వరకూ లబ్ధిదారుల వెంటబడి మరీ నిర్మాణాలు చేయిస్తున్నారు. ఇలా ఇంటి నిర్మాణం ఒక స్టేజీలు మారి మరో స్టేజీకి వెళితే బిల్లులు అప్‌లోడ్‌ చేస్తున్నారు. ఈ లెక్కన తీసుకుంటే జిల్లా వ్యాప్తంగా మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో నెలన్నర రోజులుగా రూ.40 కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు నిర్మాణాలపై అనాసక్తి చూపే అవకాశం ఉందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాణ సామగ్రి ధరలు అందనంత ఎత్తునకు చేరుకోగా బిల్లుల చెల్లింపులో జాప్యంతో నిర్మాణాలపై ప్రభావం చూపుతోంది. ఇలా ఒక్కో స్టేజీ పూర్తయ్యాక బిల్లు రావాలంటే కనీసం నెలన్నర నుంచి రెండు నెలలు పడుతోందని లబ్ధిదారులు చెబుతున్నారు. ఇళ్ల పురోగతిపై అధికారులు గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకూ నిత్యం సమీక్షలు, లక్ష్యాలు విధిస్తున్నారు. కానీ చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు జరగకపోవడంతో ఆశించిన స్థాయిలో నిర్మాణాలు జరగడం లేదనే వాదన అటు అధికారులు, ఇటు లబ్ధిదారుల్లో వినిపిస్తోంది.

జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, రాజంపేట డివిజన్లలో 73,069 గృహాలు మంజూరయ్యాయి. 526 లేఅవుట్లలో 47,305 ప్లాట్లు కేటాయించగా, మిగిలిన లబ్ధిదారులకు సొంత స్థలాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మంజూరైన ఇళ్లలో 62,685 మంది పేర్లు రిజిస్ట్రేషన్‌ చేశారు. వీటిలో 21,906 మంది పునాది నిర్మాణానికి సిద్ధం చేయగా, 21,465 మంది పునాదులు పూర్తి చేశారు. అలాగే 6508 మంది లబ్ధిదారులు గోడలు నిర్మించగా, 7,063 మంది మోల్డింగ్‌ పూర్తి చేశారు. అలాగే 423 మంది ఇంటి  నిర్మాణం పూర్తి చేయగా, 10,384 మంది నిర్మాణాలు ప్రారంభించలేదని అధికారులు చెబుతున్నారు. 2020 డిసెంబరు 25వ తేదీ ప్రభుత్వం గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టగా ఇప్పటి వరకూ అయిదు విడతలుగా బిల్లులు చెల్లించగా తాజాగా రూ.40 కోట్లకుపైగా బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు.

గృహ నిర్మాణ సామగ్రి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కమ్మీ ధరలు మరింత ప్రియమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించిన కొలతల ప్రకారం ఇల్లు కట్టుకోవాలంటే కనీసం రూ.6 లక్షలు అవుతుందని అంచనా. కానీ ప్రభుత్వం ఇస్తున్న ధర రూ.1.80 లక్షలు మాత్రమే. పేదలందరికీ ఇళ్లు పథకంలో లబ్ధిదారులకు లేఅవుట్లలో స్థలాలు కేటాయించినా అందులో పాతికభాగం మాత్రమే నిర్మాణాలు చేపడుతున్నారు. మిగిలిన వారిలో ఆర్థిక ఇబ్బందులు, ఊరికి దూరంగా స్థలాలు కేటాయించడం, నిర్మాణాలకు అనుకూలంగా లేకపోవడం, నిర్మాణానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు లేకపోవడం, తదితర కారణాలతో ఇంటి నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు. ఆర్థిక స్థోమత లేని పేదలను నిర్మాణాలకు ప్రోత్సహించే క్రమంలో అడ్వాన్సుగా రూ.15 వేలు, డ్వాక్రా సంఘాల్లో పావలా వడ్డీ పథకం కింద రూ.35 వేలు అప్పుగా ఇప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా జగనన్న ఇళ్లకు ఇప్పటి వరకూ 90 బస్తాలు సిమెంటు ఇస్తుండగా, అదనంగా మరో 50 బస్తాలు ఇస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. నిర్మాణదారులకు ఇది కొంతలో కొంత ఉపశమనం కలిగించినా దాని ఊసే లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. అరకొర సిమెంటు మినహా, స్టీలు పూర్తిగా ఇవ్వడం లేదు. ఒకవేళ అవి ఇచ్చినా లబ్ధిదారునికి ఇచ్చే యూనిట్‌ విలువలోని రూ.1.80 లక్షల బిల్లులో కట్‌ చేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటి నిర్మాణాల పురోగతిని పరిశీలిస్తే చాలా మంది ప్లాట్లు పోతుందనో, ఇల్లు రద్దవుతుందనే భయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ లేఅవుట్లలో స్థలాలు కేటాయించారు. కానీ నిర్మాణం వరకూ వచ్చే సరికి ఆ ఉత్సాహం కనిపించలేదు. మొదట్లో ప్లాటు తీసుకుని, తర్వాత కట్టుకోవచ్చనో, లేక ధర వస్తే అమ్ముకోవచ్చని చాలామంది ఊహించారు. కానీ ప్లాటు కేటాయించిన వెంటనే వలంటీర్ల నుంచి సచివాలయ ఉద్యోగుల వరకూ లబ్ధిదారులపై ఒత్తిడి పెంచారు. టార్గెట్ల ప్రకారం వీరు కూడా వారిపై ఒత్తిడి చేయక తప్పడం లేదు. ఈ క్రమంలో రద్దు పద్దును దృష్టిలో పెట్టుకుని కొందరు అప్పో సప్పో చేసి పునాది పనులు చేపడుతున్నారు. లేఅవుట్లలో పునాది నిర్మాణానికి కావాల్సిన నిధులు, సౌకర్యాలు, సదుపాయాలు లేకపోవడంతో కాంట్రాక్టర్లకు ఒప్పందానికి ఇస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తున్నా ఆ స్థాయిలో క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలు పునాదికే సరిపోతుండగా రాళ్లు, గుట్టల్లో అయితే మరింత ఎక్కువ అవుతోంది. దీంతో తర్వాత ప్రక్రియకు ఆ స్థాయిలో ముందుకెళ్లడం లేదు.


పునాదికే రూ.2.50 లక్షలు

రాళ్లలో ప్లాటు రావడంతో పునాది నిర్మాణానికే రూ.2.50 లక్షలపైన అవుతోంది. డబ్బులు లేక కొంత మేర పునాదిని ఆరు నెలల క్రితం పూర్తి చేయగా ఇప్పుడు బిల్లు వచ్చింది. వచ్చిన రూ.43 వేలతో మిగిలిన పునాది పని చేస్తున్నాం. డబ్బులు ఉన్నప్పుడు పని చేసుకుందాం అనుకుంటే వెంటనే పని చేసేయాలని, లేకుంటే పట్టా రద్దు చేస్తామని చెబుతున్నారు. ఇల్లు పూర్తి కావాలంటే రూ.7 లక్షలు అవుతుందని మేస్త్రి చెబుతున్నాడు. అంత డబ్బులు ఉంటే టౌన్‌లోనే ఎక్కడో ఒక చోట స్థలం కొనుక్కునే వాళ్లం కదా. బిల్లు వచ్చిన కాడికి పనులు చేద్దామని అనుకుంటున్నాము. ముందుకంటే ఇటుక, ఇసుక, కూలీల రేట్లు చాలా ఎక్కువగా పెరిగాయి.

- కె.వెంకటలక్ష్మమ్మ, మదనపల్లె


అదనంగా ఇస్తామన్న సిమెంటు లేదు

ఇల్లు కట్టుకోవడానికి 90 మూటలు సిమెంటు ఇస్తుండగా, అదనంగా మరో 50 మూటలు ఇస్తామని ప్రభుత్వం చెప్పినా సిమెంటు ఇవ్వలేదు. ఇంటికి కావాల్సిన సిమెంటును బయట అధిక ధరకు కొనుక్కోవాల్సి వస్తోంది. నేను ఇంటిని గోడల వరకు పూర్తిచేశాను. రెండు నెలలు అయింది. కమ్మి, సిమెంటు ఇస్తే, మోల్డింగ్‌ వేసుకోవడానికి ఎదురు చూస్తున్నా. అదనంగా ఇస్తామన్న 50 మూటలు ఇవ్వకుంటే పోనీ, చెప్పిన 90 మూటలు కూడా ఎవరికీ ఇవ్వడం లేదు.

- దుర్గాబాయి, నిమ్మనపల్లె


వారంలో చెల్లింపులు పూర్తి

గృహాలు నిర్మించుకున్న ప్రతి ఒక్కరికీ బకాయి ఉన్న బిల్లులన్నీ వారంలో వారి వారి ఖాతాలకు జమ అవుతాయి. ప్రభుత్వం ఇటీవల 2 వేల కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది డిసెంబరు వరకు ఇళ్ల నిర్మాణదారులకు బిల్లుల సమస్య ఉండదు. విడతల వారీగా స్టేజ్‌ ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. ప్రభుత్వం నుంచి బ్యాంకుల ద్వారా వ్యక్తిగత ఖాతాలకు జమ అయ్యేందుకు వారం రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. 

-కె.రామస్వామిరెడ్డి, ఈఈ, హౌసింగ్‌, మదనపల్లెRead more