జగన్‌రెడ్డీ... దివ్యాంగుల జీవితాలతో ఆటలొద్దు

ABN , First Publish Date - 2022-12-31T00:04:06+05:30 IST

నెలవారీగా వచ్చే పెన్షన్‌ డబ్బులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అవ్వాతాతలతో పాటు వితంతు, దివ్యాంగుల జీవితాలతో వైసీపీ జగన్‌రెడ్డి ప్రభుత్వం ఆటలాడే పద్ధతులకు స్వస్తి పలకాలని పలు పార్టీల, ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. విద్యుత్‌ 300 యూనిట్ల కంటే ఎక్కువగా వాడుకున్నారని, వెయ్యి చదరపు అడుగుల ఇల్లు ఉందని,

జగన్‌రెడ్డీ... దివ్యాంగుల జీవితాలతో ఆటలొద్దు

నోటీసులిచ్చిన వారందరికీ పింఛన్‌ వర్తింపచేయాలి

లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం

కలెక్టరేట్‌ ముట్టడిలో పలు పార్టీలు, ప్రజాసంఘాలు

కడప (మారుతీనగర్‌), డిసెంబరు 30 : నెలవారీగా వచ్చే పెన్షన్‌ డబ్బులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న అవ్వాతాతలతో పాటు వితంతు, దివ్యాంగుల జీవితాలతో వైసీపీ జగన్‌రెడ్డి ప్రభుత్వం ఆటలాడే పద్ధతులకు స్వస్తి పలకాలని పలు పార్టీల, ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు. విద్యుత్‌ 300 యూనిట్ల కంటే ఎక్కువగా వాడుకున్నారని, వెయ్యి చదరపు అడుగుల ఇల్లు ఉందని, కాంట్రాక్ట్‌ బేసిస్‌ ఉద్యోగం ఉందని.. ఇలా కారణాలను చూపి రాష్ట్రవ్యాపితంగా సుమారు ఆరు లక్షల పింఛన్లను తొలగించేందుకు సచివాలయ వలంటీర్లతో నోటీసులు ఇవ్వడం దారుణమన్నారు. ఇందుకు నిరసనగా ఎంఆర్‌పీఎస్‌ నేతలు వి.శివయ్య, మానికింది వెంకటేశ్‌, మాతయ్య, కేఎన్‌ రాజు సారథ్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి చిన్నసుబ్బయ్య ఆధ్వర్యలో శుక్రవారం కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మకాయల రవిశంకర్‌రెడ్డి, మగ్బుల్‌బాష, (ఆర్‌సీపీ), వెంకటశివ, (సీపీఐ), ఎం. బాలకృష్ణయాదవ్‌, (బీజేపీ), సలావుద్దీన్‌, అవ్వారు మల్లికార్జున (ఏపీబీసీ మహాసభ) మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు జగన్‌రెడ్డి అవ్వా తాతలకు పింఛన్‌ 3 వేలు ఇస్తానంటూ బీరాలు పలికిన సంగతి తెలిసిందే అన్నారు. అధికారం చేపట్టి మూడున్నర సంవత్సరాలకు పైగా అవుతున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోగా సంవత్సరానికి 250 మాత్రమే పెంచుతూ నానా హంగామా చేస్తున్నారని అన్నారు. సలహాదారుల పేరుతో ఇష్టానుసారంగా లక్షలాది రూపాయలను అప్పనంగా వారికి దోచిపెడుతున్న తీరు దారుణమన్నారు. ఎక్కడ బడితే అక్కడ ప్రభుత్వ స్థలాలు, భూములు, ఇసుక, మద్యం, మైనింగ్‌, కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చివరకు ఎర్రమట్టిని సైతం వదలకుండా సొమ్ముచేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పింఛన్లను తొలగించేందుకు వేసిన నోటిసులిచ్చే ఎత్తుగడకు తిలోదకాలిచ్చి త్వరితగతిన అర్హులైన ప్రతీఒక్కరికీ పింఛన్‌ వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తదనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించేందుకు ఆయన చాంబర్‌ వద్దకు చేరుకోగా పోలీసులు లోనికి పంపలేదు. దీంతో చేసేదిలేక ప్రభుత్వతీరు, అధికారులతీరు బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-31T00:04:12+05:30 IST