తెలుగుజాతిని అవమానించినట్లే

ABN , First Publish Date - 2022-10-04T05:22:55+05:30 IST

తెలుగుజాతి కీర్తిని నలుచెరుగులా వ్యాపింపజేసిన నందమూరి తారకరామారావును అవమానిస్తే యావత్‌ తెలుగు జాతిని అవమానించినట్టేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

తెలుగుజాతిని అవమానించినట్లే
పీలేరులో రిలే నిరాహారదీక్ష చేస్తున్న నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి

హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తిరిగి పెట్టాలి

ఎన్టీఆర్‌ పేరు పెట్టే వరకు ఉద్యమం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి 


పీలేరు, అక్టోబరు 3: తెలుగుజాతి కీర్తిని నలుచెరుగులా వ్యాపింపజేసిన నందమూరి తారకరామారావును అవమానిస్తే యావత్‌ తెలుగు జాతిని అవమానించినట్టేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి అన్నారు. హెల్త్‌ వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగింపును నిరసిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం పీలేరులో ఒకరోజు నిరాహారదీక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కిశోర్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ 1988లో అత్యంత క్లిష్టతరంగా ఉన్న వైద్య విద్యను సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో హెల్త్‌ యూనివర్సిటీని స్థాపించి అప్పటికే ఉన్న వైద్య కళాశాలలను అభివృద్ధి చేయడమే కాకుండా అనేక కొత్త కళాశాలలను కూడా ఎన్టీఆర్‌ స్థాపించారని తెలిపారు. అందని ద్రాక్షలా ఉన్న వైద్య విద్యను పేదల ముంగిట నిలిపి పేదల గుండెల్లో ఆయన దేవుడిలా నిలిచిపోయారని, అందుకు కృతజ్ఞతగా యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టారన్నారు. వాటి గురించి ఏమాత్రం అవగాహన లేని సీఎం జగన్‌ ఏకపక్షంగా ఆయన పేరు తొలగించడం దారుణమన్నారు. ఎన్టీఆర్‌ పేరు తొలగింపును ఆయన సోదరి షర్మిల కూడా ఆక్షేపిస్తున్నారని, భవిష్యత్తులో వచ్చే మరో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న వైఎ్‌సఆర్‌ పేరును తొలగిస్తే వైఎ్‌సఆర్‌ను అవమానించినట్టేనని ఆమె చెప్పినా వినకుండా జగన్‌ మొండిగా వ్యవహరిస్తున్నారన్నారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి, అనంతపురంలోని జేఎన్‌టీయూకు కూడా భవిష్యత్తులో పేర్లు మార్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్‌కు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. రిలే నిరాహారదీక్షకు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఎన్టీఆర్‌ పేరు మార్పుపై గత కొంతకాలంగా రగిలిపోతున్న టీడీపీ శ్రేణులు పార్టీ అధిష్టానం పిలుపు మేరకు దీక్షకు పెద్దఎత్తున తరలి వచ్చారు. నియోజకవర్గంలోని పీలేరు, కేవీపల్లె, కలకడ, గుర్రంకొండ, కలికిరి, వాల్మీకిపురం మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలి వచ్చి దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన దీక్ష మధ్యాహ్నం 4 గంటలకు ముగిసింది. దీక్షకు హాజరైన పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తూ పార్టీ నాయకులు చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టీడీపీ నేతలు మల్లారపు రవిప్రకాష్‌ నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మద్దిపట్ల సూర్యప్రకాశ్‌, ఆర్బీఐ వెంకటరమణారెడ్డి, మల్లెల రెడ్డిబాషా, పురం రామ్మూర్తి, గీతాంజలి, రమాదేవి, సాధన, అనూరాధ, లక్ష్మీకాంతమ్మ, రియాజ్‌, చిన్న, జనార్దన్‌ గౌడ్‌, ఎన్టీఆర్‌ నఫీస్‌, ముబారక్‌, యల్లెల రెడ్డప్పరెడ్డి, అమరనాథరెడ్డి, లక్ష్మీకర, దద్దాల హరిప్రసాద్‌ నాయుడు, ఆంజి, వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు. 

Read more