దాన్యం కొనుగోలు ప్రకటనలకే పరిమితమా?
ABN , First Publish Date - 2022-11-17T23:44:31+05:30 IST
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతుకు అందేలా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారని, అది కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ప్రభాకర్‌రెడ్డి, ఎం.సూర్యనారాయణలు విమర్శించారు.
ఆర్‌బీకేల్లో కొనుగోలు చేయకుంటే ఆందోళన తప్పదు
రైతు సంఘం శిక్షణా తరగతుల్లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కడప (సెవెన్‌రోడ్స్), నవంబరు 17: ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతుకు అందేలా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారని, అది కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితమైందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ప్రభాకర్‌రెడ్డి, ఎం.సూర్యనారాయణలు విమర్శించారు. కడప జిల్లా పరిషత్ సమావేశ హాలులో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి శిక్షణ తరగతుల్లో భాగంగా గురువారం హాజరై రైతులనుద్దేశించి మాట్లాడారు. ఖరీఫ్ సీజన్‌లో పంటలన్నీ చేతికందివస్తున్నాయని.. అధికారులు మాత్రం ఆర్‌బీకేల్లో ఎక్కడా ధాన్యం కొనుగోలు చేయడంలేదని ఆరోపించారు. బహిరంగ మార్కెట్లో ప్రైవేటు వ్యాపారస్తులకు ధాన్యం అమ్ముతున్నారని, మిల్లర్లు, దళారులు రైతులను దోపిడీకి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో రైతుల నుంచి బలవంతపు భూసేకరణ జరుపుతున్నారని, 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు విఫలం చెందాయని అన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలను తప్పు పట్టిన ప్రస్తుత సీఎం జగన్‌రెడ్డి అవే విధానాలను కొన సాగిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ పంపు సెట్లకు మీటర్లు పెట్టి రీడింగ్ బిల్లులు ఇచ్చే ఏర్పాట్లకు ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికే కేంద్రం స్టాండింగ్ కమిటీ పెట్టిందని... రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్మార్ట్ మీటర్లు బిగించడానికి ముందుకు పోతోందన్నారు. దీన్ని రైతు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. ఆర్‌బీకేల్లో రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు, మందులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో అనంతపురం రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి దస్తగిరిరెడ్డి, నెల్లూరు జిల్లా కార్యదర్శి మూల వెంకటయ్య, కర్నూలు రామక్రిష్ణ, హిందూపురం సుబ్బిరెడ్డి, అన్నమయ్య జిల్లా కార్యదర్శి నాగబసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.