కొత్త జీతం పడాలంటే.. రూ.వేయి కొట్టాల్సిందే..
ABN , First Publish Date - 2022-08-05T05:28:26+05:30 IST
మీ ఉద్యోగం రెగ్యులర్ అయింది.. జీతం కూడా పెరిగింది.. మీకు కొత్త జీతం పెట్టాలంటే.. మాకేంటి..? బిల్లులు పెట్టాలంటే వేయి రూపాయలు ఇవ్వాల్సిందే..
సచివాలయ సిబ్బంది నుంచి వసూళ్లు
ఇవ్వకపోతే.. జీతం పడదంటూ బెదిరింపులు
రాయచోటి, ఆగ స్టు 4 (ఆన్లైన్) : మీ ఉద్యోగం రెగ్యులర్ అయింది.. జీతం కూడా పెరిగింది.. మీకు కొత్త జీతం పెట్టాలంటే.. మాకేంటి..? బిల్లులు పెట్టాలంటే వేయి రూపాయలు ఇవ్వాల్సిందే.. డబ్బు ఇవ్వ కుంటే.. మీకు కొత్త జీతం పడదు.. ఇదీ సచివాలయ ఉద్యోగులకు జీతాల బిల్లులు పెట్టాల్సిన పలువురు పంచాయతీ కార్యదర్శులు, కొన్ని సబ్‌ట్రెజరీ కార్యాలయాల్లో పనిచేసే కొందరి నుంచి ఎదురవుతున్న సమస్య. వేయి రూపాయలు ఇవ్వడం పెద్ద విషయం కాదు. అయితే ఇలా డిమాండ్ చేయడం ఏంటని పలువురు సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ఉన్నతాఽధికారులు స్పందించి డబ్బు డిమాండ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
3227 మంది రెగ్యులర్
జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో కలిసి 3227 మందిని రాష్ట్ర ప్రభు త్వం గత నెలలో రెగ్యులర్ (ప్రొబిషన్ పీరియడ్ డిక్లేర్) చేసింది. వీరందరికీ గత నెల వరకు రూ.15వేలు వేతనం వచ్చేది. అయితే రెగ్యు లర్ కావడంతో.. ఇక దాదాపు 25 వేల నుంచి 26వేల వరకు (పీఎఫ్ వంటి కోతలు పోనూ) వస్తుంది. ఈమేరకు ప్రభుత్వ ఉత్తర్వులు రావడంతో.. జూలై నుంచి కొత్త వేతనాలు ఇవ్వడానికి ప్రక్రియ మొద లైంది. గ్రామ పంచాయతీ, మునిసిపల్ అధికారులు (డ్రాయింట్ డిస్ పెర్సింగ్ ఆఫీసర్స్) కసరత్తు మొదలెట్టారు. ఇదే సమయంలో కొందరు పంచాయతీ కార్యదర్శులు, మునిసిపాలిటీలలోని అధికారులు సచివా లయ సిబ్బంది నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఉద్యోగి వద్ద సర్వీ సు రిజిస్టర్ ఉంటే.. రూ.700, వాళ్ల చేతిలో లేకుంటే రూ.1000 ఇవ్వాలనే ప్రకారం వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ముక్కుపిండీ మరీ వసూళ్లు
జిల్లాలో రాజంపేట, రాయచోటి, మదనపల్లె, బి.కొత్తకోట మునిసిపాలిటీలు ఉన్నాయి. 30 మండలాలు ఉన్నాయి. ఇందులో ఒకటీ అరా సచివాలయాలు తప్పా.. మిగిలిన చోట ముక్కుపిండీ మరీ వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల డబ్బు ఇచ్చిన తర్వాతే బిల్లు పెట్టగా.. మరి కొన్నిచోట్ల ముందే బిల్లులు పెట్టి.. జీతం వచ్చిన తర్వాత ఇవ్వమని అడుగుతున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కొన్ని చోట్ల సబ్ ట్రెజరీ కార్యాలయాల్లోనూ ఈబిల్లులు చేయడానికి మామూళ్లు అడుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ సబ్ ట్రెజరీ కార్యాలయ పరిధిలోని బిల్లులు.. అక్కడే చేస్తారు. జిల్లాలో రైల్వేకోడూరు, రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలలో సబ్‌ట్రెజరీ కార్యాలయాలు ఉన్నాయి. సగటున ఒక్కో సబ్‌ట్రెజరీ కార్యాలయ పరిధిలోకి 50 గ్రామ పంచాయ తీలు వస్తాయి. ఈ మేరకు ఒక్కో బిల్లుకు మామూళ్లు అడుగుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. రాయచోటి సబ్‌ట్రెజరీ కార్యాలయ పరిధిలో ఇప్పటివరకు 169 మంది సచివాలయ ఉద్యోగులకు కొత్త జీతాలు పడ్డా యి. తమ వద్దకు వచ్చిన బిల్లులను ఆలస్యం లేకుండా.. వెంటనే చేసేశామని రాయచోటి సబ్ ట్రెజరీ కార్యాలయ అధికారులు తెలిపారు. రాయచోటి మునిసిపాలిటీ పరిధిలో డ్రాయింగ్ డిస్పెర్సింగ్ అధికారిగా మునిసిపల్ కమిషనర్ ఉంటారు. అయితే ఆయన కిందిస్థాయి ఉద్యోగి ఒకరు రాయచోటి మునిసిపాలిటీలోని 34 సచివాలయాల్లో సుమారు 200 మంది ఉద్యోగుల నుంచి రూ.1000 వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవ్వకపోతే.. బిల్లులు పెట్టనని బెదిరించి మరీ వసూలు చేసి నట్లు సచివాలయ సిబ్బంది వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతా ధికారులు స్పందించి.. వసూళ్లకు తెరలేపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సచివాలయ సిబ్బంది కోరుతున్నారు.
వాస్తవమైతే చర్యలు తప్పవు
-రాంబాబు, మునిసిపల్ కమిషనర్ రాయచోటి
మా కార్యాలయంలో పనిచేసే అధికారి డబ్బు వసూలు చేసినట్లు నా దృష్టికి రాలేదు. విచారిస్తాం.. డబ్బు వసూలు చేసింది నిజమని తేలితే.. తప్పని సరిగా చర్యలు తీసుకుంటాం.