రూ.6 కోట్లతో హార్సిలీహిల్స్‌ అభివృద్ధి

ABN , First Publish Date - 2022-06-27T05:38:03+05:30 IST

ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలనే లక్ష్యంతో హిల్స్‌ అభివృద్ధికి రూ.6 కోట్లు కేటాయించినట్లు పర్యాటక శాఖ ఎండీ కన్నబాబు తెలిపారు.

రూ.6 కోట్లతో హార్సిలీహిల్స్‌ అభివృద్ధి
హార్సిలీహిల్స్‌లో పర్యటిస్తున్న పర్యాటక శాఖ ఎండీ కన్నబాబు

హిల్స్‌లో ఒబెరాయ్‌ రిసార్ట్స్‌ 

పర్యాటక శాఖ ఎండీ కన్నబాబు


బి.కొత్తకోట, జూన్‌ 26 : ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపుదిద్దాలనే లక్ష్యంతో హిల్స్‌ అభివృద్ధికి రూ.6 కోట్లు కేటాయించినట్లు పర్యాటక శాఖ ఎండీ కన్నబాబు తెలిపారు. ఆదివారం ఆయన హార్సిలీహిల్స్‌లో టూరిజం అతిథి భవనాలను పరిశీలించడంతో పాటు హిల్స్‌లోని ప్రకృతి అందాలను ఆయన తిలకించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రూ.142 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతిసిద్ధంగా వైవిధ్యభరితమైన వాతావరణంతో అనేక ప్రాంతాలు ఉండడం అదృష్టం అన్నారు. బీచ్‌, ఎకో, హెరిటేజ్‌, మ్యూజియం, టెంపుల్‌ టూరిజం వంటి విభిన్న, ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు నెలవు మన రాష్ట్రం అని, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి దేశంలోనే అత్యుత్తమమైన టూరిజం పాలసీ మన అంద్రప్రదేశ్‌ టూరిజందే అన్నారు. రాష్ట్రంలో తిరుపతి, విశాఖపట్టణం, గండికోట, పిచ్చుకలంక, హార్సిలీహిల్స్‌ పర్యాటక కేంద్రాల్లో ఒబెరాయ్‌ రిసార్ట్స్‌ రానున్నాయని తెలిపారు. 7 స్టార్‌ సౌకర్యాలతో 5 స్టార్‌ హోటళ్ళను నిర్మించడానికి నిర్ణయించామన్నారు. మొదటి విడతలో తిరుపతి, విశాఖపట్టణం, గండికోటలలోను ఆ తరువాత హార్సిలీహిల్స్‌, పిచ్చుకలంక పర్యాటక కేంద్రాల్లో ఒబెరాయ్‌ రిసార్ట్స్‌ నిర్మిస్తామని తెలిపారు. ఒక్కొక్క రిసార్ట్‌ను రూ.80 కోట్ల అంచనాతో నిర్మిస్తామని తెలిపారు. అలాగే అరకు, పాడేరు, లంబసింగీ, సూర్యలంక, హార్సిలీహిల్స్‌ పర్యాటక కేంద్రాలను అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా సరికొత్త ప్రణాళికతో అభివృద్ధి చేయడానికి నిర్ణయించామన్నారు. ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకట్టుకునే విధంగా అభివృద్ధి చేయడానికి మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తామన్నారు. హిల్స్‌లో టూరిజం అభివృద్ధికి రూ.6 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. టూరిజం అతిథి గృహాలను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామన్నారు. ఎకో టూరిజం అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇస్తామన్నారు. హార్సిలీహిల్స్‌ సమగ్రాభివృద్ధికి అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా చేపడుతున్న అభివృద్ధి ప్రణాళికకు టూరిజం సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం, హార్సిలీహిల్స్‌ టౌన్‌ షిప్‌ కమిటీ, టూరిజం సంయుక్త ఆధ్వర్యంలో హార్సిలీహిల్స్‌ను అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేయడానికి బృహత్తర ప్రణాళికను రూపొందించేందుకు ప్రత్యేక నిపుణుల బృందం, ఆర్కిటెక్చర్‌ బృందాలను హిల్స్‌కు పంపుతున్నట్లు తెలిపారు. హార్సిలీహిల్స్‌ పరిసర ప్రాంతాలను కలుపుతూ సర్క్యూట్‌ టూరిజం అభివృద్ధి చేయడానికి నిర్ణయించామన్నారు. హార్సిలీహిల్స్‌లో కార్పొరేట్‌ స్థాయిలో కాన్ఫరెన్స్‌ సమావేశాలు జరిగేలా చర్యలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ ఈడీ మల్‌రెడ్డి, ఈఈ సుబ్రమణ్యంరాజు, తిరుపతి టూరిజం డీవీఎం గిరిధర్‌ రెడ్డి, హార్సిలీహిల్స్‌ మేనేజర్‌ సాల్విన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T05:38:03+05:30 IST