మట్టిలో మట్లిరాజుల చరితం

ABN , First Publish Date - 2022-08-28T04:58:36+05:30 IST

నగరిపాడు గ్రామంలోని మట్లిరాజులు ఏలిన కోట శిథిలమైపోయింది. రాజ్యాలేలిన మట్లిరాజుల సామ్రాజ్యం మట్టిలో కలిసిపోయింది.

మట్టిలో మట్లిరాజుల చరితం
కుప్పకూలిన కోటలో కంపచెట్ల ఆనవాళ్లు

శిథిలమైన నగరిపాడుకోట

గుడ్లగూబలకు నేడు రాచబాట

సర్వం త్యాగం చేసిన మట్లిరాజులు 


రాజంపేట, ఆగస్టు 27 : కాలం అన్నింటికీ సరైన సమాధానం చెబుతుందంటారు. బండ్లు ఓడలుగానూ.. ఓడలు బండ్లు గానూ మారతాయంటారు. కాలచక్రంలో ఎన్నెన్నో మార్పులు చెందుతూ ఉంటాయి. అలాంటి విషయాన్ని అనుకుంటే చిట్వేలి మండలంలోని నగిరిపాడు మట్లిరాజుల చరిత్ర ఓ ఉదాహరణగా చెప్పవచ్చు. తమ సామ్రాజ్యంలో రారాజుగా వెలుగొందిన వారి జాడలు కనుచూపు మేరలో కానరావడం లేదు. వివరాల్లోకెళితే.. నగరిపాడు గ్రామంలోని మట్లిరాజులు ఏలిన కోట శిథిలమైపోయింది. రాజ్యాలేలిన మట్లిరాజుల సామ్రాజ్యం మట్టిలో కలిసిపోయింది. లోకం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబ సభ్యులు నేడు గూడు లేని అభాగ్యులుగా మిగిలిపోయారు. రాజ్యాలేలిన రారాజులు నేడు కంటికి కనపడకుండా పోయారు. నాడు అనేక గ్రామాలను తమ ఏలుబడిలో పెట్టుకుని రాజ్యాధికారం నిర్వహించిన నగరిపాడు మట్లిరాజుల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. వారి కోట శిథిలమైంది. ఆ రాజరికం త్యాగమూర్తి రంగరాజు ఆలయం నేడు ప్రజలకు ప్రముఖ పుణ్యక్షేత్రంగా వాసికెక్కి అందరి పూజలు అందుకుంటోంది. కుల రహిత సమాజం కోసం అగ్నిగుండంలో సజీవ సమాధి అయిన రంగరాజు నేడు అలనాటి తీపిగురుతులకు చిహ్నంగా నిలుస్తున్నారు. 


సర్వం త్యాగం చేసి...

సర్వం త్యాగం చేసిన మట్లిరాజులు నేడు మట్టిలో కలిసిపోయారు. జిల్లాలో మట్లిరాజుల గురించి తెలియని వారుండరు. వారి ఏలుబడిలో మూడు పువ్వులు.. ఆరుకాయలుగా రాజ్యం సాగిందని ప్రతీతి. కనుసైగతో రాజ్యాలనే ఏలి కోరిన వారికి మణులు, మాణిక్యాలనే ధారాదత్తం చేసి ఏకంగా తమ ఆధీనంలోని అగ్రహారాలనే ప్రభుత్వానికి అప్పజెప్పి తమ ఆధీనంలోని వేలాది ఎకరాలను ప్రజలకు ఈనాములుగా ఇచ్చి పేరు గాంచిన కడప రాజుల కుటుంబాలు కాలగర్భంలో కలసిపోయాయి. పాలనాపరంగా ఓ రాజసౌథంగా వెలుగొందిన నగిరిపాడులోని మట్లిరాజుల కోట కుప్పకూలి నేడు గుడ్లగూబలకు నిలయంగా మారింది.


మట్టిలో కలిసిపోయిన చరిత్ర

చిట్వేలి మండలం నగరిపాడు గ్రామంలోని మట్లిరాజుల గురించి అనుకుంటే ఎవరైనా కన్నీటి పర్యంతం కాక తప్పదు. ఈ కుటుంబానికి చెందిన  రంగరాజు నేడు రంగనాయకస్వామిగా జీవసమాధి అయ్యారు. అది ప్రస్తుతం ప్రముఖ పుణ్యక్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. నగరిపాడుకు చెందిన మట్లిరాజు కుటుంబీకులు కడప రాజు పేరిట ఎంతో గుర్తింపు పొందారు. ఆ రాజుల ఇంటిపేరు కడప రాజు. చిట్వేలి, సిద్దవటం, ఎర్రగుంట్ల కోట, నగరిపాడు, అవుకు, ఆనగొంది, కార్వేటి నగరం ప్రాంతాలలో మట్లిరాజులు ప్రసిద్ధి చెందిన వారు. వారిలో నగిరిపాడు రాజులు పేరెన్నికగన్నవారు. చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఏలుబడిలో ఉంచుకుని రాజ్యాధికారం చేశారు. అయిదు తరాల కిందట వీరు చెప్పిందే ఆ ప్రాంతంలో వేదం. గ్రామానికి చుట్టూ ఓ పెద్ద ప్రాకారాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రాకారం మధ్యలో అందమైన కోటను నిర్మించుకుని వీరు రాజ్యపాలన చేశారు. వారి కుటుంబీకులు చెప్పిన వివరాల ప్రకారం... నేడు నగరిపాడులో జీవసమాధి అయి రంగనాయకస్వామిగా పిలువబడే రంగరాజు, రంగరాజు తండ్రి జగ్గరాజు ఈ కుటుంబానికి మూలపురుషుడంటారు. అదే కుటుంబానికి సంబంధించిన అయిదు తరాల నాటి నారాయణరాజు ఈ సంస్థానంలో కీలక రాజు. ఆ తరువాత ఆయన కుమారుడు అనంతరాజు ముఖ్యులు. వారి ఏలుబడిలో నగరిపాడు ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. ఈ రాజుల పేరిట ఏర్పాటు చేసిన నగరి నేడు పాడుబడడంతో ఆ గ్రామం నేడు నగరిపాడుగా పిలువబడుతోంది. చుట్టూ 500 ఎకరాల పైబడి మాగాణి భూమిలో కుంజరీ నదీ తీరాన, పచ్చని పంట పొలాల మధ్య వీరి కోట దేదీప్యమానమై వెలుగొందింది. నేటికి 300 ఏళ్లు దాటినా ఆ కోట కుప్పకూలిపోయినా ఆ దొరల రాజ్యం అడ్రస్సు లేకుండాపోయినా నేటికీ మా దొరగారి కుటుంబమని చుట్టుపక్కల ప్రాంతీయులు గొప్పగా పొగుడుతూ ఉంటారు. దొరగారి రాజ్యం ఓ బంగారు భోజ్యమని నేటికీ శ్లాఘిస్తుంటారు. అటువంటి కుటుంబీకులు అలనాడు వందల ఎకరాలను ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు. తమ ఆధీనంలోని అనేక అగ్రహారాలను ప్రభుత్వానికి అప్పజెప్పారు. 1870వ సంవత్సరంలో రాజంపేట తాలుకాలోని తమ ఆధీనంలో ఉన్న అనాసముద్రమనే అగ్రహారాన్ని ప్రభుత్వానికి వీరు అప్పజెప్పారు. ఇలా వేల ఎకరాల భూములను పేదలకు పంచి పెట్టారు. చుట్టుపక్కల గ్రామాలను ఏలుతూ సామంతరాజులుగా కీర్తి పొందారు. అలనాడు చుట్టుపక్కల గ్రామస్తులెవరైనా రాజులు నివసించే కోటవైపు చూడాలన్నా గజగజవణికిపోయే వారు. అటువంటి సామంతరాజ్యం సర్వనాశనమైపోయింది. వారి అష్టైశ్వర్యాలు అడ్రస్‌ లేకుండా పోయాయి. 


కటిక దారిద్య్రంలో మట్లిరాజుల వారసులు

నేడు మట్లిరాజుల వారసులు కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూ తలా ఓ దిక్కుకుపోయి కూలీ నాలీ చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆ కుటుంబంలోని నారాయణరాజు మూడు తరాల కిందట దొరగా ఉండేవారు. ఆయన సతీమణి భాస్కరమ్మ ఈ ప్రాంతంలో మంచి గుర్తింపు పొందారు. నారాయణరాజు, భాస్కరమ్మలకు నలుగురు సంతానం. నారాయణరాజు, భాస్కరమ్మల హయాంలోనే ఒక్కసారిగా కుటుంబ ఆర్థిక పరిస్థితి అధ్వాన్న స్థితిలో ఉండేది. భూములు, ఆస్తులు, మణులు, మాణిక్యాలు, అష్టైశ్వర్యాలు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. వందల మందికి దానధర్మాలు చేసే ఆ దొరవారు చివరికి ప్రజలిచ్చే దానధర్మాలకు తలవంచాల్సి వచ్చింది. ఇక చేసేది లేక ఆ కుటుంబం అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు జీవన భృతి కోసం వలస వెళ్లింది. నారాయణరాజు కుటుంబంలో అయిదుగురు సంతానం. వారిలో నలుగురు పురుషులు కాగా మరొకరు మహిళ. రంగరాజు, శ్రీనివాసవర్మ, విజయవర్మ, రవీంద్రవర్మలు నారాయణరాజు కుమారులు. వీరిలో శ్రీనివాసవర్మ, రవీంద్రవర్మ చనిపోయారు. రంగరాజు, విజయవర్మలు ప్రస్తుతం జీవించి ఉన్నారు. రంగరాజు కర్ణాటకలోని ఆనగొందికి వెళ్లిపోగా, విజయవర్మ కర్నూలు జిల్లాలోని అవుకు ప్రాంతానికి వెళ్లిపోయి జీవనభృతి లేక అక్కడే ఆయుర్వేద వైద్యం చేస్తూ జీవనం చేస్తున్నారు. ఇక మిగిలిన కుటుంబీకులు పట్టెడన్నం కోసం తలా ఒకచోటికి వెళ్లిపోయారు. ప్రస్తుతం వీరు ఉన్న కోట నగరిపాడులో పాడుబడి గుడ్లగూబలకు నిలయంగా మారింది. ఎప్పుడూ రాజరిక వ్యవస్థతో కళకళలాడే కోట ముఖద్వారం పూర్తిగా శిథిలమై చూపరులను వెక్కిరిస్తోంది. కోటలోని పైకప్పు పూర్తిగా కూలిపోయింది. 


మా కళ్ల ముందే మట్టిలో కలిసిపోయింది

- కురవి ఉమామహేశ్వర శర్మ, పురోహితులు, నగిరిపాడు. 

నేను నగిరిపాడులో పురోహితుడిని. నాకు 70 సంవత్సరాలు ఉన్నాయి. కోట పక్కనే మా ఇల్లు ఉంది. మట్లిరాజులు అంటేనే మా ప్రాంతంలో ఓ ప్రసిద్ధి. వారి ఏలుబడిలో చుట్టుపక్కల గ్రామాలు ఉండేవి. వేలాది ఎకరాల భూములు వారి సొంతం. వారు చెప్పిందే ఈ ప్రాంతంలో వేదం. నాకు ఉహ తెలిసినప్పటి నుంచి మట్లిరాజుల కుటుంబీకులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా వారి సామ్రాజ్యం మా ఎదుటే కుప్పకూలిపోయింది. మొత్తం కుటుంబ సభ్యులంతా చెల్లాచెదురైపోయారు. కనీసం జీవనం జరగక ఎక్కడికెక్కడికో వెళ్లిపోయారు. నేడు ఆ కోట కూడా కుప్పకూలిపోయి చూపరులను వెక్కిరిస్తోంది. 


ఆనవాళ్లే లేకుండా పోయాయి

- కావేరి చంద్ర, నగిరిపాడు, చిట్వేలి మండలం

కోటకు అల్లంతదూరంలో మా ఇల్లు ఉంది. ఎంతో గొప్పగా బతికే ఈ మట్లిరాజులు కాలగర్భంలో కలిసిపోయారు. నగిరిపాడు మట్లిరాజుల ఏలుబడిలో అనేక సంస్థానాలు ఉండేవి. వారు గుర్రాలపై సంచరిస్తూ ఉండేవారు. మా గ్రామంలోని ప్రతి ఒక్కరూ వారికి అనుంగులమే.. కోట చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉండేది. ఎవరైనా అటువైపు వెళ్లాలంటే వారి అనుమతి తీసుకుని వెళ్లాల్సి ఉండేది. అటువంటిది కోట అంతా పడిపోయి కోట ప్రహరీగోడ కూడా పాడైపోయింది. గ్రామం చుట్టూ ఉన్న ఈ గోడ శిథిలావస్థకు చేరింది. 


అనుకుంటేనే బాధ కలుగుతోంది

- వెలగచెర్ల శ్రీధర్‌రెడ్డి, నగిరిపాడు, చిట్వేలి మండలం. 

పేదలను తమ బిడ్డల వలే చూసుకుంటూ ఈ ప్రాంతాన్ని పాలించే మట్లిరాజుల గురించి అనుకుంటేనే చాలా బాధ కలుగుతోంది. మట్లిరాజులు జీవించిన కోటను నగిరి అని పిలుస్తారు. అంటే రాజులు ఉండే ఇంటిని నగిరి అని పిలవడం గౌరవప్రదం. అటువంటి రాజులు జీవించిన మట్లిరాజుల కోట అయిన నగిరి నేడు పాడైపోయింది. మా గ్రామానికి వారి పేరిట ఉన్న నగిరి కూలిపోవడంతో మా గ్రామాన్ని కూడా రానురాను నగిరిపాడు అని పిలుస్తున్నారు. ఎంతో చరిత్ర కలిగిన మా ఊరి రాజుల చరిత్ర తరతరాలకు ఓ గుర్తుగా మిగిలిపోయింది.





Updated Date - 2022-08-28T04:58:36+05:30 IST