అక్రమ కేసులతో వేధిస్తున్నారు

ABN , First Publish Date - 2022-06-28T05:17:45+05:30 IST

తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తంబళ్లపల్లెకు చెందిన టీడీపీ నేత మద్దిరెడ్డిగారి కొండ్రెడ్డి ఆరోపించారు.

అక్రమ కేసులతో వేధిస్తున్నారు
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేత కొండ్రెడ్డి

ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి పెద్ద భూకబ్జాదారుడు

టీడీపీ నేత కొండ్రెడ్డి ఆరోపణ

మదనపల్లె క్రైం, జూన్‌ 27: తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తంబళ్లపల్లెకు చెందిన టీడీపీ నేత మద్దిరెడ్డిగారి కొండ్రెడ్డి ఆరోపించారు. సోమవారం మదనపల్లెలోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో 2019లో తాను 9.75 ఎకరాల పొలం కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఫోర్జరీ సంతకాలతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి పొలం కొనుగోలు చేశారని తనపై అభియోగం మోపి చంద్రగిరి పోలీ్‌సస్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టారన్నారు. దీంతో అక్కడి పోలీసులు తనతో పాటు మరో నలుగురిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారన్నారు. దీనిపై కోర్టుకెళ్లగా..న్యాయస్థానం ఇటీవల స్టే ఇచ్చిందన్నారు. అయితే రాజకీయ నాయకుల సూచనల మేరకు చంద్రగిరి పోలీసులు చీటింగ్‌ కేసును మదనపల్లెకు ట్రాన్స్‌ఫర్‌ చేశారన్నారు. ఎమ్యెల్యే ద్వారకనాథరెడ్డి తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, చంపుతామంటూ బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయన్నారు. పోలీసులు కూడా ఫోన్లు చేసి వేధిస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారాలను చంద్రబాబు, లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. తనకు ఏదైనా హాని జరిగితే అందుకు ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి ప్రధాన కారకుడని, ఆయన తంబళ్లపల్లె నియోజకవర్గంలో వేల ఎకరాలు కబ్జా చేసి ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. న్యాయస్థానం స్టే ఆర్డర్‌ ఇచ్చినా పోలీసులు పదేపదే ఫోన్లు చేసి బెదిరించడం, స్టేషన్‌కు రావాలని దబాయించడం, అసభ్యకర పదజాలంతో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ద్వారకనాథరెడ్డిని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. మదనపల్లెలో జూలై 6న జరిగే మినీ మహానాడుకు టీడీపీ శ్రేణులు పెద్దసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు ఆనిగాని కృష్ణారెడ్డి, రెడ్డెప్పరెడ్డి, చంద్రన్న, బాలాజీ, సిద్దయ్య, శివ, శ్రీనివాసులురెడ్డి, వినోద్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T05:17:45+05:30 IST